కొత్త ఆధార్ యాప్.. కేవలం ఫేస్ ఐడీతో వెరిఫికేషన్ పూర్తి.. డేటా లీక్, నకిలీ కార్డుల టెన్షన్ ఉండదిక..!
ఆధార్ కార్డును ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాల అమలుకు ప్రాతిపదికగా తీసుకుంటోంది. దీంతోపాటు బ్యాంకింగ్, సిమ్ కార్డులు సహా అనేక చోట్ల వినియోగిస్తున్నాం. ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల సందర్భాల్లోనూ ఆధార్ వివరాలను సేకరిస్తున్నారు. అయితే చాలా చోట్ల ఆధార్ వివరాలు దుర్వినియోగం జరుగుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీంతో UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిటీ ఆఫ్ ఇండియా) ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది.
ఇప్పటికే ఈ ఫీచర్‌లు :
బయోమెట్రిక్ లాక్ సహా ఆధార్ హిస్టరీని తెలుసుకొనేందుకు అవకాశం కల్పించింది. UIDAI వెబ్‌సైట్ ద్వారా ఆధార్ వివరాలను ఎవరూ వినియోగించకుండా బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ వివరాలను ఎక్కడెక్కడ ఉపయోగించాలో ఆధార్ హిస్టరీ ద్వారా తెలుసుకోవచ్చు.

కొత్త ఆధార్ యాప్ :
అయితే తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ X ద్వారా కీలక ప్రకటన చేశారు. ఆధార్ కార్డు యాప్‌ను (Aadhaar New app) లాంచ్ చేసినట్లు తెలిపారు. దీని ద్వారా UPI పేమెంట్ చేసినంత సులభంగా ఆధార్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న ఫీచర్‌లకు అదనంగా కొత్తవి జతచేసినట్లు చెప్పారు.
ఒరిజినల్ కార్డులు, జిరాక్స్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదు :
ఎక్కడైనా ఆధార్ కార్డు వెరిఫికేషన్ పూర్తి చేయాల్సిన సందర్భాల్లో ఈ యాప్ ద్వారా QR కోడ్ స్కాన్ చేసి సులభంగా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా వెరిఫికేషన్ చేయడం ఈ యాప్ ప్రత్యేకత అని చెప్పారు. ఫలితంగా ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఇవ్వాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
New Aadhaar App
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025
Face ID authentication via mobile app
❌ No physical card
❌ No photocopies
🧵Features👇 pic.twitter.com/xc6cr6grL0
ఆధార్ దుర్వినియోగానికి చెక్ :
ప్రస్తుతం ఈ ఆధార్ యాప్ టెస్టింగ్ దశలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. దీని ద్వారా వ్యక్తిగత సమాచారం పూర్తి నియంత్రణలో ఉంటుందన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో అందరికీ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆధార్ వివరాలను దుర్వినియోగం కాకుండా ఈ యాప్ ద్వారా అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది.
వీడియో షేర్ చేసిన మంత్రి :
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా నకిలీ ఆధార్ కార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందనే వార్తలు ఆందోళన కలిగించాయి. అయితే కొత్తగా ఆవిష్కరించిన ఆధార్ యాప్ తో యూజర్లు వారి ఫోన్ ద్వారానే వెరిఫికేషన్‌ను పూర్తి చేయవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి షేర్ చేశారు.
ఈ కొత్త ఆధార్ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. ఒరిజినల్ ఆధార్ కార్డులు, జిరాక్స్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ఎక్కడా ఆధార్ వివరాలు దుర్వినియోగం అయ్యే ఛాన్స్ లేదు. 100 శాతం డిజిటల్‌గా వెరిఫికేషన్‌ను చేసుకోవచ్చు.
ఆధార్ యాప్ కేవలం ఒక్క ట్యాప్ తో అవసరమైన డేటాను మాత్రమే ఇతరులకు షేర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా వారి వ్యక్తిగత డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుందని కేంద్ర మంత్రి తన X పోస్ట్ లో పేర్కొన్నారు. కేవలం ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంతో నకిలీలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
ఆధార్ కార్డు పోర్జరీ, దుర్వినియోగం, ఆధార్ కార్డుల వివరాలు లీక్ వంటి సమస్యలు కొత్త ఆధార్ యాప్ ద్వారా పరిష్కారం కానున్నాయి. గతం కంటే ఈ యాప్.. యూజర్లకు సౌకర్యంగా ఉంటుంది, మెరుగైన భద్రతను అందిస్తుంది. అయితే ఈ యాప్ పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications