షాకింగ్ న్యూస్.. బ్యాన్ చేసిన చైనా యాప్స్ మళ్లీ గూగుల్ ప్లే, యాప్ స్టోర్లలోకి వచ్చేశాయ్.. అసలేం జరుగుతోంది?
Chinese Banned Apps: 2020లో ఇండియా బ్యాన్ చేసిన చైనా యాప్స్ మళ్లీ వచ్చేస్తున్నాయి. అప్పుడు బ్యాన్ చేసిన యాప్సేనా ఇవి అంటే.. అవుననే అంటున్నారు టెక్ నిపుణులు. పేర్లు మార్చారు, కాస్త కొత్తగా రెడీ అయ్యారు అంతే, కొన్ని యాప్స్ యజమానుల్ని కూడా మార్చేశాయి. కానీ చాలా వరకు యాప్స్ మాత్రం పాత చింతకాయ పచ్చడిలానే ఉన్నాయి. 2020లో సెక్యూరిటీ, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని దాదాపు 267 చైనా యాప్స్‌ని ఇండియా బ్యాన్ చేసింది.
అప్పుడేమో గాల్వాన్ లోయలో చైనా గొడవ చేసింది. దాంతో ఇండియాకి చైనాకి టెన్షన్ పెరిగిపోయింది. అంతే యాప్స్‌పై బ్యాన్ పడింది. ఇప్పుడేమో 2025 వచ్చేసింది. కట్ చేస్తే కనీసం 36 బ్యాన్ చేసిన యాప్స్ మళ్లీ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో దర్శనమిస్తున్నాయి.

కొన్ని యాప్స్ పేర్లు మార్చలేదు. అచ్చం పాత పేర్లతోనే వచ్చేశాయి. కొన్ని బ్రాండింగ్ మార్చాయి, లోగోలు మార్చాయి, యజమానుల పేర్లు మార్చాయి. ఈ యాప్స్ అన్నీ గేమ్స్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫైల్ షేరింగ్, డేటింగ్ ఇలా అన్ని కేటగిరీల్లోనూ ఉన్నాయి. కొన్ని యాప్స్ పేర్లు మార్చినా.. చాలా యాప్స్‌ని మాత్రం పాత చైనా డెవలపర్లే నడిపిస్తున్నారట.
* ఆ యాప్స్ ఏంటంటే
ఇండియా టుడే ప్రకారం, కొన్ని యాప్స్ సేమ్ పేరుతో ప్లే స్టోర్లలో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు గ్జిండర్ (Xender) అనే ఫైల్ షేరింగ్ యాప్. యాపిల్ యాప్ స్టోర్‌లో ఇప్పుడు "Xender: ఫైల్ షేర్, షేర్ మ్యూజిక్" అని కనిపిస్తోంది. కానీ గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం ఇంకా కనిపించట్లేదు.
ఇంకోటి మ్యాంగోటీవీ .. ఇది స్ట్రీమింగ్ యాప్.. ఇందులో ఏ మార్పు లేదు. యూకు (Youku) కూడా స్ట్రీమింగ్ యాపే. టావోబావో (Taobao) షాపింగ్ యాప్ ఇప్పుడు "మొబైల్ టావోబావో" అని పేరు మార్చుకుంది. డేటింగ్ యాప్ టాంటన్ (Tantan), "టాంటన్ - ఆసియన్ డేటింగ్ యాప్"గా కొత్త అవతారం ఎత్తింది.
* లీగల్‌గా కూడా దారులు వెతుక్కున్నాయి..
కొన్ని యాప్స్ లీగల్‌గా కూడా దారులు వెతుక్కుని మళ్లీ ఇండియాలో ఎంట్రీ ఇచ్చేశాయి. పార్ట్‌నర్‌షిప్స్ కుదుర్చుకుని, లైసెన్సింగ్ డీల్స్ పెట్టుకుని మళ్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ షెయిన్ (Shein). ఫ్యాషన్ బ్రాండ్‌కి ఇది చాలా పాపులర్. ఇది రిలయన్స్‌తో పార్ట్‌నర్‌షిప్ పెట్టుకుని ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది.
షెయిన్ యూజర్ల డేటా మొత్తం ఇండియాలోనే స్టోర్ చేస్తారట. చైనా కంపెనీకి డేటా యాక్సెస్ ఉండదట. గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. బ్యాన్ చేసినా.. క్లోన్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు డెవలపర్లు యాప్స్‌లో కాస్త మార్పులు చేసి కొత్త పేర్లతో రిలీజ్ చేస్తున్నారు.
* క్లోన్ యాప్స్
పబ్‌జీ మొబైల్ గేమ్‌ను 2020లో బ్యాన్ చేశారు. కానీ 2021లో "బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)" పేరుతో మళ్ళీ వచ్చింది. దీన్ని మేనేజ్ చేసేది సౌత్ కొరియన్ కంపెనీ క్రాఫ్టన్. కానీ BGMIని మళ్లీ 2022లో బ్యాన్ చేశారు. మళ్లీ సెక్యూరిటీ రూల్స్ అన్ని ఫాలో అయ్యాక 2023లో మళ్లీ పర్మిషన్ ఇచ్చారు.
* బ్యాన్స్ ఎందుకంత కష్టం
బ్యాన్ చేసిన యాప్స్‌ని పూర్తిగా ఆపడం చాలా కష్టం. గవర్నమెంట్ ఒక యాప్‌ని బ్లాక్ చేస్తే.. డెవలపర్లు వెంటనే కొత్త పేరుతో ఇంకో వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. కొన్ని యాప్స్ ఇప్పుడు ఇండియా, సింగపూర్, వియత్నాం, సౌత్ కొరియా, సీషెల్స్, జపాన్, బంగ్లాదేశ్.. ఇలా వేరే దేశాల పేర్లతో ఓనర్‌షిప్ చూపిస్తున్నాయి.
దీంతో అసలు యాప్ ఎక్కడిదో కనిపెట్టడం కూడా కష్టమైపోతోంది. టెక్నాలజీ మారుతోంది.. మార్కెట్లు కలిసిపోతున్నాయి.. ఇలాంటప్పుడు దేశ చట్టాలు సరిగ్గా అమలు చేయడం గవర్నమెంట్‌లకు పెద్ద ఛాలెంజ్‌గానే మారింది. ఏదైనా చెడు జరగక ముందే ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








