గూగుల్ మ్యాప్స్ ముసుగులో మృత్యువు.. ఇండియన్ మ్యాప్స్ రాకపోతే ప్రాణాలు మిగలవ్.. ఎంపీ షాకింగ్ కామెంట్స్
Google Maps Errors: ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ (Google Maps) లేనిదే చాలా మందికి రోజు గడవదు. అడ్రస్ తెలియకపోయినా, కొత్త ఊరికి వెళ్లాలన్నా, క్షణాల్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దారి చూసుకుంటున్నాం. కానీ ఒక్కోసారి ఈ గూగుల్ మ్యాప్సే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్ తప్పుదోవ పట్టించడం వల్ల ప్రమాదాలు జరిగి, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీంతో ఇప్పుడు భారతీయ మ్యాప్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది.
బీజేపీ ఎంపీ అజీత్ మాధవరావు గోప్చాడే స్వయంగా పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తారు. గూగుల్ మ్యాప్స్ సరిగ్గా దారి చూపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా మన దేశీయ మ్యాపింగ్ సిస్టమ్‌ను తయారు చేయాలని ఆయన కోరుతున్నారు.

* డాక్టర్లను చంపేసిన గూగుల్ మ్యాప్స్
ఇటీవల కేరళలో జరిగిన విషాద ఘటనను ఎంపీ అజీత్ గుర్తు చేశారు. ఇద్దరు 29 ఏళ్ల డాక్టర్లు గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ కారులో వెళ్తుండగా, మ్యాప్ తప్పు దారి చూపించడంతో పెరియార్ నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో కూడా జరిగింది. అక్కడ కూడా గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్న కారు నదిలో పడిపోయింది. ఇలాంటి ఘటనలు టెక్నాలజీపై అతిగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో చూపిస్తున్నాయని ఎంపీ అజీత్ అన్నారు. గూగుల్ మ్యాప్స్ ఎప్పుడూ కరెక్ట్‌గా ఉండవని హెచ్చరించారు. అది నేరుగా మృత్యువు వైపే దారితీస్తుందన్నట్లు కామెంట్ చేశారు.
* స్వదేశీ మ్యాపింగ్ సిస్టమ్
మన దేశం కోసం మన మ్యాపింగ్ సిస్టమ్‌ను తయారు చేయాలని సదరు ఎంపీ ఇండియన్ స్టార్టప్‌లు, కంపెనీలు, ఇంకా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వదేశీ మ్యాపింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని, నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ వంటి విదేశీ వేదికలపై ఆధారపడకూడదని ఆయన అన్నారు.
ఇంకా ఎంపీ అజీత్ మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 43(ఎ) ప్రకారం అన్ని కంపెనీలు యూజర్ల డేటాను రక్షించాలని, గూగుల్ మ్యాప్స్‌కు టెక్నాలజీ పరంగా మంచి సామర్థ్యాలు ఉన్నా, కచ్చితమైన, సురక్షితమైన నావిగేషన్ అందించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఇలాంటి వైఫల్యాలకు గూగుల్ చట్టపరంగా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
* గూగుల్ మ్యాప్స్‌పై ఫిర్యాదులు
గత డిసెంబర్‌లో చాలా మీడియా సంస్థలు గూగుల్ మ్యాప్స్ తప్పుల గురించి అనేక ఆర్టికల్స్ రాశాయి. మారుమూల ప్రాంతాల్లో, హైవేలపై గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, కొందరు అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్‌లపైకి, కొట్టుకుపోయిన రోడ్లపైకి వెళ్లారని ఆ కథనాల్లో పేర్కొన్నాయి.
దీనిపై గూగుల్ స్పందిస్తూ.. యూజర్ల భద్రత, డేటా క్వాలిటీ తమకు చాలా ముఖ్యమని, తక్కువ విజిబిలిటీ, ట్రాఫిక్ సమస్యలపై అలర్ట్‌లను మెరుగుపరచడానికి పనిచేస్తున్నామని, మ్యాప్ డేటాను రోజువారీగా అప్‌డేట్ చేస్తున్నామని తెలిపింది. కానీ, ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. దీంతో గూగుల్ మ్యాప్స్‌పై నమ్మకం సన్నగిల్లుతోంది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, భారత్‌కు ఒక ప్రత్యేకమైన మ్యాపింగ్ వ్యవస్థ ఎంతైనా అవసరమనిపిస్తోంది. అయితే, ఇండియా తీసుకురాబోయే మ్యాప్స్ ఎంతవరకు కచ్చితమైన సమాచారం ఇస్తాయో వేచి చూడాలి. అంతేకాదు, ఇది ఎంత త్వరగా అందుబాటులోకి వస్తుందో, వాడుకలో ఎంత సులువుగా ఉంటుందో, ప్రజలు దీన్ని గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఎంతవరకు ఆదరిస్తారో కూడా గమనించాలి.


Click it and Unblock the Notifications








