Instagram Teen Accounts ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం.. 18 సంవత్సరాల్లోపు వారికి ప్రత్యేక ఖాతాలు..!
చిన్నారులపై సోషల్ మీడియా ప్రభాతం ఇటీవల కాలంలో అధికంగా ఉంటోంది. గంటలపాటు సోషల్ మీడియాలో కంటెంట్ చూడడం, చాటింగ్ చేయడం చేస్తున్నారు. దీంతో సహజంగానే చిన్నారుల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళన సహా చిన్నారుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మెటా కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గతంలో ఇన్‌స్ట్రాగ్రామ్ కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే తాజాగా చిన్నారులకు ఇన్‌స్టాగ్రామ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు వీలుగా టీన్ అకౌంట్స్‌ను (Instagram Teen Accounts) తీసుకొచ్చింది.
కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరుతున్న 18 సంవత్సారాలలోపు వయసు ఉన్నవారికి టీన్ అకౌంట్స్‌ను కేటాయిస్తారు. ఈ ఖాతాలకు అనేక పరిమితులు ఉంటాయి. ఫలితంగా చిన్నారులు సురక్షితంగా ఉంటారని మెటా భావిస్తోంది. భారత్‌లో ఈ విధానంపై ఇన్‌స్టాగ్రామ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల్లో నిన్నటి (సెప్టెంబర్ 17) నుంచే టీన్ అకౌంట్స్ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు మెటా వెల్లడించింది.

ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ వినియోగిస్తున్న చిన్నారులకు ఈ మార్పులపై సమాచారం అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వినియోగిస్తున్న చిన్నారుల ఖాతాలను కూడా త్వరలో టీన్ అకౌంట్స్‌గా మారుస్తామని వెల్లడించింది. అయితే ఏయే దేశాల్లో ఎప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో కూడా వెల్లడించింది.
క్రమపద్ధతిలో US, UK, కెనడా, ఆస్ట్రేలియాలో తొలుత ఈ విధానం ప్రారంభించి 60 రోజుల్లో పూర్తి మార్పులు చేస్తామని పేర్కొంది. యూరోపియన్ యూనియన్‌లో ఈ సంవత్సరం చివర్లో ఈ టీన్స్ అకౌంట్స్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. జనవరి 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్ బిల్ట్‌ఇన్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటాయి. పేరెంటర్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఈ టీన్ అకౌంట్స్ డిఫాల్ట్‌గానే ప్రైవేట్ మోడ్‌లో ఉంటాయని మెటా వెల్లడించింది. ఈ ఖాతాల వారికి కాంటాక్ట్ చేయడంలో కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది. ఫాలో అయిన వ్యక్తులు మాత్రమే మెసేజ్‌లు చేసేందుకు వీలుంటుంది. దీంతోపాటు వారు మాత్రమే ట్యాగ్ చేసేందుకు వీలుంటుంది.
దీంతోపాటు 16 ఏళ్ల వయస్సు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు (టీన్ అకౌంట్స్) ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేసేందుకు వారి తల్లిదండ్రులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నారుల తల్లిదండ్రుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫీచర్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీన్ అకౌంట్స్ ఎటువంటి ఫీచర్లు కలిగి ఉంటాయో చూద్దాం.
డిఫాల్ట్ ప్రైవేటు అకౌంట్స్ : ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్ డిఫాల్ట్ గానే ప్రైవేటు ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాల్లోని కంటెంట్ చూసేందుకు.. మీ ఫాలో రిక్వెస్ట్‌లను చిన్నారులు అనుమతించాల్సి ఉంటుంది. లేకుంటే కంటెంట్ చూసే అవకాశం లేదు. 16 ఏళ్ల వయస్సు కలిగిన మరియు 18 ఏళ్ల వయస్సున్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఇది వర్తిస్తుంది.
దీంతోపాటు టీన్ అకౌంట్స్‌లో మెసెజ్ సెట్టింగ్స్ పటిష్ఠంగా ఉంటాయి. వారికి మెసేజ్ చేసేందుకు కచ్చితంగా వారి ఖాతాలను ఫాలో కావాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈ టీన్ అకౌంట్స్‌కు సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉంటుంది. దీంతోపాటు వారి ఖాతాల్లోని డైరెక్ట్ మెసెజ్‌లు, కామెంట్లలో ఏమైనా అసభ్యకరమైన పదాలు ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేటిక్‌గా వాటిని ఫిల్టర్ చేస్తుంది.
దీంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్‌లో రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్ మోడ్ ఆన్ లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం లేదు. దీంతోపాటు చిన్నారుల ఖాతాలను వారి తల్లిదండ్రులు పర్యవేక్షించవచ్చు. ఎంత సమయం వినియోగిస్తున్నారు. కంటెంట్‌ను చూస్తున్నారనే తెలుసుకోవచ్చు.
దీంతోపాటు ఏయే సమయాల్లో మీ చిన్నారులు ఇన్‌స్టాగ్రామ్ వినియోగించకూడదని భావిస్తారో.. ఆ సమయంలో వారి అకౌంట్లను బ్లాక్ చేసేందుకు వీలుంటుంది. మరియు రోజులో ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్‌ను 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం వినియోగిస్తే వారికి వెంటనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది.


Click it and Unblock the Notifications








