బి అలర్ట్.. వాట్సాప్‌ను కూడా హ్యాక్ చేసేస్తున్న సైబర్ నేరగాళ్లు!
WhatsApp Hack: వాట్సాప్‌లో హ్యాకింగ్ సంఘటనలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. సైబర్ నేరగాళ్లు కొత్త ట్రిక్కులు ఉపయోగించి అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. నకిలీ ఓటీపీ మెసేజ్‌లు, కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్ వాడుతున్నారు. ఒక్కసారి మీ అకౌంట్ వాళ్ల చేతికి చిక్కితే మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్లకు తెలిసిపోతుంది. మీ బంధుమిత్రులను మోసం చేసి డబ్బులు గుంజుతారు. ఇప్పటికే చాలామంది ఈ ఉచ్చులో పడ్డారు. వాట్సాప్‌లో సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం.
* హ్యాకర్లు మీ వాట్సాప్ అకౌంట్‌ను ఎలా కొట్టేస్తారంటే..
హ్యాకర్లు రకరకాల పద్ధతుల్లో అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. ఓటీపీ ఫిషింగ్ అనేది చాలామంది వాడే ట్రిక్. స్కామర్లు వాట్సాప్ సపోర్ట్ టీమ్ నుంచి కాల్ చేస్తున్నట్టుగానో లేదా మీ ఫ్రెండో రిలేటివో అని నమ్మించి, మీ ఫోన్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీ చెప్పమని అడుగుతారు. మీరు చెప్పారో లేదో అంతే, మీ అకౌంట్ వాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది.

సిమ్ స్వాపింగ్ అంటే.. మీ ఫోన్ నంబర్‌కు డూప్లికేట్ సిమ్ కార్డ్ తీసుకుంటారు. అప్పుడు మీ వాట్సాప్‌ను వేరే ఫోన్‌లో ఈజీగా ఓపెన్ చేయొచ్చు. వాట్సాప్ వెబ్ హైజాకింగ్ కూడా ప్రమాదకరమే. హ్యాకర్లు కొద్దిసేపు మీ ఫోన్ తీసుకుని, మీ వాట్సాప్‌ను వాళ్ల కంప్యూటర్‌కు లింక్ చేసుకుంటారు. ఇలా చేస్తే మీ మెసేజ్‌లన్నీ వాళ్ల కంప్యూటర్‌లో చూడొచ్చు.
కాల్ మెర్జింగ్ స్కామ్ ఇంకో ప్రమాదకరమైన ట్రిక్. స్కామర్ మిమ్మల్ని కాల్ మెర్జ్ చేయమని అడుగుతాడు. మీరు మెర్జ్ చేయగానే అది ఆటోమేటిక్ వాట్సాప్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్‌కు కనెక్ట్ అవుతుంది. వాళ్లు ఓటీపీ వినేసి మీ అకౌంట్ కొట్టేస్తారు.
* నిజంగా జరిగిన హ్యాకింగ్ కేసులు
కేస్ 1: సెకన్లలో హ్యాక్
శాంతను గుప్తా అనే పొలిటికల్ అనలిస్ట్ ట్రైన్‌లో వెళ్తున్నారు. సడన్‌గా ఆయన వాట్సాప్ లాగిన్ అవుతూ, లాగౌట్ అవుతూ కనిపించింది. చాలాసార్లు ట్రై చేసినా లాగిన్ అవ్వలేదు. నాలుగు గంటలపాటు ఆయన అకౌంట్ బ్లాక్ అయిపోయింది. హ్యాకర్లు వాయిస్ కాల్ ఫార్వర్డింగ్ చేసి ఓటీపీ తీసుకున్నారు. వేరే ఫోన్‌లో వాట్సాప్ సెటప్ చేసుకున్నారు.
ఆయన భార్యతో సహా కాంటాక్ట్స్ అందరికీ మెసేజ్‌లు పెట్టి డబ్బులు అడిగారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కంగారుపడి ఆయనకు ఫోన్ చేసి విషయం కనుక్కున్నారు. శాంతను సోషల్ మీడియాలో అందరినీ జాగ్రత్తగా ఉండమని పోస్ట్ పెట్టారు. వాట్సాప్ మాత్రం అనుమానాస్పద యాక్టివిటీని గుర్తించలేకపోయింది.
ఆయన నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ కూడా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ చేసింది. దీంతో స్కామర్లు ఈజీగా పని కానిచ్చారు. ఈ సంఘటనలో వాట్సాప్ సంస్థ యూజర్‌కు ప్రైవసీ అందించడంలో విఫలమైంది. ఎయిర్‌టెల్ సైతం చేతులెత్తేసింది. ఫలితంగా శాంతకు దారుణమైన పరిస్థితి ఎదురయ్యింది.
కేస్ 2: రాత్రికి రాత్రే టేకోవర్
ఓ వ్యక్తి వాట్సాప్‌ను ప్రతి రాత్రి ఎవరో హ్యాక్ చేస్తున్నారు. ఎవరో తెలియని నంబర్లతో కొత్త గ్రూప్‌లు క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఉదయం ఆయన వాట్సాప్‌కు రిక్వెస్ట్ పెట్టి అకౌంట్ యాక్సెస్ చేసుకుని, ఆ గ్రూప్‌లు డిలీట్ చేయాల్సి వస్తోంది. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) పెట్టుకున్నా హ్యాకింగ్ ఆగలేదు. విసిగిపోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
* వాట్సాప్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకోవడమెలా..
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్ చేసుకోవాలి. ఇది అదనపు సెక్యూరిటీ లాంటిది. ఒక పిన్ సెట్ చేసుకోవాలి. ఎవరికీ మీ ఓటీపీ చెప్పొద్దు. వాట్సాప్ ఎప్పుడూ ఓటీపీ అడగదు. కాల్ ఫార్వర్డింగ్ ఆఫ్ చేసుకోవాలి. మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు కాల్ చేసి అన్‌ఆథరైజ్డ్ యాక్టివేషన్ జరగకుండా చూడమని చెప్పాలి.
వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'లింక్డ్ డివైజెస్' ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు లింక్ చేయని డివైజ్‌లు ఏమైనా ఉంటే లాగ్ ఔట్ చేయండి. ఐఫోన్ వాడుతుంటే 'లాక్‌డౌన్ మోడ్' యాక్టివేట్ చేసుకోవాలి. ఇది అన్‌ఆథరైజ్డ్ డివైజ్ లింకింగ్‌ను బ్లాక్ చేస్తుంది. అనుమానాస్పద మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియని నంబర్లతో కాల్ మెర్జ్ చేయొద్దు.
హ్యాకర్లు రోజురోజుకూ స్మార్ట్ అవుతున్నారు. కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








