వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బాగా బిజీగా ఉండేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది..!
Whatsapp Quick Recap feature : వాట్సాప్ ప్రస్తుతం ప్రముఖ మెసేంజర్‌లలో ఒకటిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల సౌకర్యం కోసం వాట్సాప్ క్రమంగా అనే ఫీచర్లను విడుదల చేస్తోంది. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను కూడా జత చేస్తోంది. ఇటీవల కాలంలో యూజర్ల భద్రత, సౌకర్యం కోసం అనేక ఫీచర్లను విడుదల చేస్తోంది.
చాట్ సంభాషణ అంతా చిటికలో తెలుసుకోవచ్చు..!
వాట్సాప్ ఇటీవల Message Summaries ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా చాట్ లో చదవని మెసేజ్‌ల (Unread Messages) పూర్తి సారాంశాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఒకసారి ఒకే చాట్ సారాంశాన్ని పొందేందుకు వీలుంది.

ఒకసారి 5 చాట్స్ వరకు :
అయితే తాజాగా అందుబాటులోకి వస్తున్న వివరాల ఆధారంగా వాట్సాప్ ప్రస్తుతం క్విక్ రీక్యాప్ (Quick Recap) ఫీచర్ పైన పనిచేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి అనేక చాట్స్ (Multiple Chats) సారాంశాన్ని తెలుసుకోవచ్చు. ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది.
ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 5 చాట్స్ కు సంబంధించిన సారాంశాన్ని తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. కావాల్సిన చాట్స్ ను ఎంపిక చేసికొని, 3 డాట్ మెనూ (3 Dot Menu) ఐకాన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ కనిపించిన క్విక్ రీక్యాప్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీ :
మెసేజ్ సమ్మరీస్ ఫీచర్ తరహాలోనే క్విక్ రీక్యాప్ ఫీచర్ మెటా ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. దీంతో ఈ మెసేజ్‌లను మెటా గానీ వాట్సాప్ కానీ చదివేందుకు వీలుండదని చెబుతోంది. అంటే థర్డ్ పార్టీలకు ఎటువంటి యాక్సెస్ ఉండదని తెలుస్తోంది. ఫలితంగా వ్యక్తిగత గోప్యతకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని చెబుతోంది.
అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఫీచర్ ఆన్ చేసి ఉంటే :
వాట్సాప్‌లో త్వరలో విడుదల కానుందని భావిస్తున్న క్విక్ రీక్యాప్ ఫీచర్.. ఆప్షనల్ గా ఉంటుందని చెబుతోంది. అయితే అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ (Advanced Chat Privacy) కలిగిన చాట్‌లను క్విక్ రీక్యాప్ ఫీచర్ ద్వారా సారాంశాన్ని క్రియేట్ చేసేందుకు అవకాశం ఉండదని వాట్సాప్ చెబుతోంది.
ప్రస్తుతానికి ఈ క్విక్ రీక్యాప్ ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.25.21.12 వెర్షన్ లో ఉందని ఫీచర్ ట్రాకర్ తెలిపింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. అందువల్ల ఈ వెర్షన్ ను ఇన్‌స్టాల్ చేసినా.. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉండదని చెబుతోంది.
బీటా యూజర్లకు కూడా ఎప్పటి నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందో వెల్లడి కాలేదు. సాధారణ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేందుకు సమయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రతిరోజు బిజీ బిజీగా గడిపే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








