చాట్ ట్రాన్స్‌ఫర్ కోసం వాట్సాప్‌లో కొత్త ఫీచర్ విడుదల.. ఎలా పనిచేస్తుందంటే?
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వినియోగదారులున్న ఇన్‌స్టంట్ మెసేజ్ యాప్ వాట్సాప్ కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. చాలా మంది కొత్త ఫోన్లు కొనుగోలు చేసినప్పుడు అందులో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేస్తారు. అయితే పాత ఫోన్‌లో ఉన్న చాట్ డేటా చాలాసార్లు కోల్పోతుంటాం. లేదా ఆ చాట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.
అటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేసింది. దీంతో పాత ఫోన్ నుంచి చాట్ డేటాను కొత్త ఫోన్‌లోకి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ QR కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా చాట్‌ను సులభంగా బదిలీ చేసుకోవచ్చు.

అయితే వినియోగదారుడి పాత, కొత్త ఫోన్లు ఒకే రకమైన OSను కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇందుకోసం Wi-Fi కనెక్షన్ అవసరం అవుతుంది. మరియు ఈ రెండు ఫోన్లు ఒకే వై ఫైకు కనెక్ట్ కావాల్సి ఉంటుంది. దీంతో చాలా సులభంగా పాత ఫోన్ వాట్సాప్ నుంచి కొత్త ఫోన్ వాట్సాప్‌లోనికి చాట్ డేటాను సులభంగా బదిలీ చేసుకోవచ్చు.
ఈ విధానంలో చాట్ డేటా బదిలీ చేసుకోవడానికి.. వాట్సాప్ వినియోగదారుడు తన పాత ఫోన్ వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం చాట్ పైన క్లిక్ చేయాలి. అక్కడ కనిపించిన ట్రాన్స్‌ఫర్ చాట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం అక్కడ ఓ QR స్కానర్ కనిపిస్తుంది. వినియోగదారుడు తన కొత్త ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.
ఈ విధానం ద్వారా చాలా సులభంగా చాట్ డేటాను బదిలీ చేసుకోవచ్చని వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ పద్ధతిలో ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తవని పేర్కొంది. ఇతర థర్డ్ పార్టీ సర్వీసుల కంటే ఈ విధానం ఎంతో భద్రతను కలిగి ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది. ఎందుకంటే డేటా కేవలం రెండు ఫోన్ల మధ్య మాత్రమే బదిలీ అవుతుందని తెలిపింది.
గతంలో డేటా ట్రాన్స్‌ఫర్ కోసం క్లౌడ్ బ్యాకప్ వ్యవస్థని వాట్సాప్ వినియోగించేది. అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చిన విధానం ద్వారా చాట్‌ను క్లౌడ్‌లో బ్యాకప్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎల్లప్పుడూ వినియోగదారులు తమ డేటాను భద్రపరచడం ఉత్తమం. ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ విధానం ద్వారా అత్యంత వేగంగా డేటాను బదిలీ చేసుకోవచ్చని వాట్సాప్ వెల్లడించింది.
*వాట్సాప్ ఇటీవలే తన డెస్క్‌టాప్ వెర్షన్ ద్వారా 30 మంది వరకు వీడియో కాల్ చేసుకొనే అవకాశం కల్పించింది. గతంలో ఈ సంఖ్య 8 మందికి మాత్రమే పరిమితం చేయబడింది. దీని ద్వారా ఇతర వ్యవస్థలపై ఆధారపడకుండా వాట్సాప్ ద్వారానే చిన్న చిన్న మీటింగ్‌లు ఏర్పాటుచేసుకోవచ్చు.
* మరో ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ ద్వారా HD వీడియోలను పంపించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఏదైనా వీడియో పంపుతున్నప్పుడు పైన HD ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని టిక్ చేయడం ద్వారా HD ఫోటోలను పంపుకోవచ్చు. జూన్ నెల ప్రారంభంలో HD ఫోటోలను షేర్‌చేసుకొనే ఫీచర్‌పై పరీక్షలు చేస్తున్నట్లు చెప్పింది.


Click it and Unblock the Notifications








