WhatsAppలో కొత్తగా 'అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ' ఫీచర్.. ఎలా వాడాలంటే ?
WhatsApp Advanced Chat Privacy : మనమందరం రోజూ వాడే వాట్సాప్, మన ప్రైవేట్ మాటలకు మరింత భద్రత కల్పించడానికి 'అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ' (Advanced Chat Privacy) పేరుతో ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫ్రెండ్స్‌తో పర్సనల్‌గా చాట్ చేసినా, గ్రూపుల్లో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నా.. మీ సంభాషణలు యాప్‌లోనే మరింత భద్రంగా ఉండేలా ఈ ఫీచర్ చూసుకుంటుంది. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటి? దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? పూర్తి వివరాలు చూద్దాం.
* అసలు ఏంటి ఈ అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ..
ఈ 'అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ' సెట్టింగ్ ద్వారా, యూజర్లు తమకు నచ్చిన ఏ చాట్ (పర్సనల్ లేదా గ్రూప్) ప్రైవసీని అయినా మరింత పెంచుకోవచ్చు. దీన్ని ఆన్ చేస్తే, ఆ చాట్‌లోని విషయాలను (కంటెంట్) ఇతరులు బయటకు పంపడం (ఎక్స్‌పోర్ట్) చేయలేరు. ఫోటోలు/వీడియోలను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయలేరు.

మెటా ఏఐ (Meta AI) లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లలో వాడటం కుదరదు. అంటే, చాట్‌లోని సున్నితమైన సమాచారాన్ని ఇతరులు సులభంగా కాపీ కొట్టడం, ఫార్వార్డ్ చేయడం, సేవ్ చేసుకోవడం వంటివి చేయలేరన్నమాట. ముఖ్యంగా గ్రూప్‌లో అందరూ తెలియని వాళ్లు ఉన్నప్పుడు, ఇలాంటి ఫీచర్ చాట్లను మరింత సురక్షితంగా ఉంచుతుందని వాట్సాప్ అంటోంది.
* ఈ ఫీచర్ ఎందుకంత ముఖ్యం..
ఈ డిజిటల్ కాలంలో ప్రైవసీ చాలా ముఖ్యం. వాట్సాప్ కొత్త సెట్టింగ్ సున్నితమైన సంభాషణలకు రక్షణ ఇస్తుంది.
వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సమస్యల చర్చలకు ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, హెల్త్ సపోర్ట్ గ్రూపులకు ఇది మంచిది. కాలనీలో సున్నితమైన కార్యక్రమాలు చర్చించే గ్రూపులకు కూడా ఇది అవసరం.
ఈ సెట్టింగ్ చాట్‌లోని సమాచారం బయటకు వెళ్లకుండా ఆపుతుంది. దీనివల్ల గ్రూప్‌లోని అందరూ మరింత నమ్మకంతో, నిశ్చింతగా ఉండొచ్చు. ఏమేమి బ్లాక్ అవుతాయి అని అడిగితే.. అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఆన్ చేస్తే, ప్రధానంగా మూడు జరుగుతాయి.
* అవేంటంటే
చాట్ ఎక్స్‌పోర్ట్ బంద్: ఇతరులు చాట్‌ను మొత్తం బయటకు పంపడం (ఎక్స్‌పోర్ట్) చేయలేరు. ఆటో-డౌన్‌లోడ్ బంద్: ఆ చాట్‌లోని ఫోటోలు, వీడియోలు (మీడియా) వాళ్ల ఫోన్లలోకి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కావు. ఏఐ ఫీచర్లు బంద్: మెటా ఏఐ (Meta AI) లాంటి ఏఐ ఫీచర్లు ఆ చాట్‌కు పనిచేయవు.
దీనివల్ల, చాట్‌లోని విషయాలు వాట్సాప్ దాటి బయటకు వెళ్లే అవకాశాలు బాగా తగ్గుతాయి, మీ ప్రైవసీకి రక్షణ పెరుగుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి - ప్రస్తుతానికి స్క్రీన్‌షాట్‌లు తీయడాన్ని ఇది ఆపలేదు. భవిష్యత్తులో దీనికి కూడా పరిష్కారం తెచ్చే ప్రయత్నాల్లో వాట్సాప్ ఉందని తెలుస్తోంది.
* ఎలా ఎనేబుల్ చేయాలి?
దీన్ని ఆన్ చేయడం చాలా ఈజీ. ముందుగా, మీరు ఏ చాట్ (పర్సనల్ లేదా గ్రూప్) కోసం ఈ ఫీచర్ ఆన్ చేయాలనుకుంటున్నారో, ఆ చాట్‌ను ఓపెన్ చేయాలి. పైన కనిపించే కాంటాక్ట్ పేరు లేదా గ్రూప్ పేరు మీద నొక్కాలి.
కిందకు స్క్రోల్ చేస్తే 'అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ' (Advanced Chat Privacy) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కాలి. అక్కడ కనిపించే స్విచ్‌ను ఆన్ చేయాలి. అంతే, వెంటనే ఆ చాట్‌కు పైన చెప్పిన ప్రైవసీ ఫీచర్లు యాక్టివేట్ అవుతాయి. మీకు కావాల్సినన్ని చాట్‌లకు ఇలా సెట్ చేసుకోవచ్చు.
* ఎవరికి అందుబాటులో ఉంది..
లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్ వాడుతున్న అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి, ముందుగా మీ యాప్‌ను ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి అప్‌డేట్ చేసుకోండి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని ప్రైవసీ ఆప్షన్లు తీసుకొచ్చి, మన చాట్‌లపై మనకు ఇంకా ఎక్కువ కంట్రోల్ ఇచ్చేలా చేస్తామని వాట్సాప్ చెబుతోంది.


Click it and Unblock the Notifications








