వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీకు ఈ మెసేజ్ వచ్చిందా.. ఒక్క క్లిక్‌తో అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం!
WhatsApp Online scams: ఇంటర్నెట్ ప్రపంచం ఎంత విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తుందో అంతే ప్రమాదకరమైనది కూడా. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. టెక్నాలజీ తెలియని అమాయకులే కాదు, తెలిసిన వారు కూడా ఈ మోసాల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా తిరువనంతపురంకు చెందిన ఒక మహిళ ఏకంగా రూ.1.32 కోట్లు పోగొట్టుకోవడం కలకలం రేపుతోంది. శ్రీకార్యం ప్రాంతానికి చెందిన 57 ఏళ్ల మహిళ ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ గురించి వెతుకుతుండగా, ఆమెకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
అందులో ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ లింక్ ఉంది. నిజమైనదేమో అని నమ్మిన ఆమె ఆ లింక్‌ను క్లిక్ చేసింది. అక్కడి నుంచే అసలు మోసం మొదలైంది. స్కామర్లు ఆమెను ట్రేడింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని నమ్మించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించారు.

మొదట కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేయమని చెప్పడంతో ఆమె అలాగే చేసింది. యాప్‌లో ఆమె డబ్బులు రెట్టింపు అయినట్లు కనిపించడంతో ఆమెకు నమ్మకం కుదిరింది. నిజంగానే లాభాలు వస్తున్నాయని భ్రమలో పడిపోయింది. ఆ తరువాత ఆమె మరింత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టింది. ప్లాట్‌ఫామ్‌లో లాభాలు బాగా వస్తున్నట్లు కనిపించాయి.
మధ్యమధ్యలో కొంచెం డబ్బులు విత్‌డ్రా కూడా చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో అది నిజమైన ప్లాట్‌ఫామ్ అని ఆమె పూర్తిగా నమ్మింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఒకానొక సమయంలో ఆమె పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడే స్కామర్లు తమ అసలు రూపం చూపించారు.
డబ్బులు విత్‌డ్రా చేయడానికి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలని షరతు పెట్టారు. మోసపోతున్నానని తెలియక, నిజమేనని నమ్మిన ఆమె మరింత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. అలా విడతల వారీగా ఏకంగా రూ. 1.32 కోట్లు పోగొట్టుకున్నాక కానీ తాను మోసపోయానని ఆమెకు అర్థం కాలేదు.
* రీసెంట్ గానే మరో ఘటన
ఇలాంటి ఘటనే మరొకటి కేరళలో జరిగింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి శశిధరన్ నంబియార్ కూడా ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు. 2024, డిసెంబర్‌లో "ఆదిత్య బిర్లా ఈక్విటీ లెర్నింగ్" అనే వాట్సాప్ గ్రూప్‌లో ఆయన జాయిన్ అయ్యారు. అది ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన గ్రూప్ అని ఆయన అనుకున్నారు.
గ్రూప్ సభ్యులు పెట్టుబడులపై 850% లాభం వస్తుందని ఆశ చూపించారు. వారి మాటలు నమ్మి ఆయన రూ.90 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఇద్దరు వ్యక్తులు షేర్ చేసిన లింక్‌ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. జనవరి 2025 వచ్చేసరికి మోసపోయానని గ్రహించి ట్రిపునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
* మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి
వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్‌ను క్లిక్ చేయకూడదు. ఏదైనా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశోధించాలి. విశ్వసనీయమైన రివ్యూలు, రేటింగ్స్ చూడాలి. సులభంగా డబ్బు సంపాదించొచ్చు అనే మాటలను నమ్మవద్దు. స్కామర్లు ఎక్కువ లాభాల ఆశ చూపి బాధితులను ఆకర్షిస్తారు.
ఆన్‌లైన్ లావాదేవీల కోసం సురక్షితమైన, గుర్తించదగిన చెల్లింపు పద్ధతులను మాత్రమే ఉపయోగించాలి. మోసం జరిగిందని అనుమానిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. నెట్టింట పరిచయమై వారు ఎంత ప్రేమగా మాట్లాడినా వారి వలలో పడకూడదు, ఏ సమాచారాన్ని వారికి అందివ్వకూడదు. ఉద్యోగులుగా నటించి మోసగించే వారూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.


Click it and Unblock the Notifications








