ఫోన్‌లో సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది.. ఏంటీ కొత్త రూల్..!
భారత టెలికాం విభాగం గతంలో మెసేజింగ్ సంస్థలకు కీలక సూచనలు చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ సహా ఇతర మెసేజింగ్ యాప్‌లు సిమ్ బైండింగ్ (Whatsapp) విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. అంటే ఫోన్‌లో సిమ్ కార్డు ఉంటేనే, ఆ నంబర్‌పై వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లు పనిచేస్తాయి. సైబర్ నేరాల కట్టడి కోసం ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
టెలికాం విభాగం కొత్త నిబంధనలు అమలు పరిచేందుకు వాట్సాప్ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి టెక్నాలజీ పరంగా చేయాల్సిన మార్పులపై పనిచేస్తోంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.26.8.6 బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్ కనిపించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఫోన్‌లో సిమ్ కార్డు ఉంటేనే :
భారత్ యూజర్ల కోసం వాట్సాప్ పీరియాడిక్ సిమ్ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఫోన్‌లో సిమ్ కార్డు లేకున్నా.. ఓటీపీని నమోదు చేసి వాట్సాప్‌ను వినియోగించుకొనేందుకు అవకాశం ఉంది. త్వరలో ఇందులో మార్పులు రానున్నాయి. ఇతర బ్యాంకింగ్ యాప్స్ తరహాలో వాట్సాప్ కూడా ఫోన్‌లో సిమ్ కార్డు ఉంటేనే పనిచేస్తుంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ వివరాల ఆధారంగా వాట్సాప్ కొత్త అప్‌డేట్ విడుదలయ్యాక.. ఆటోమేటిక్‌గా సిమ్ కార్డు వెరిఫికేషన్ పూర్తి చేస్తుంది. ఫోన్‌లో సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్‌ను వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే Bluestacks లేదా ఇతర సాఫ్ట్‌వేర్స్ ద్వారా వాట్సాప్ వినియోగిస్తున్న వారికి, ఈ కొత్త నిబంధన ప్రభావితం చేసే అవకాశం ఉంది.
గత సంవత్సరం నవంబర్ లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సిమ్ బైడింగ్ విధానాన్ని అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన గడువును పొడిగించే ఆలోచన లేదని సంబంధిత శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28 వరకు ఈ గడువు ఉంది.
* వాట్సాప్ ఇటీవలే స్టేటస్‌లో కస్టమ్ లిస్ట్ సహా వెబ్ యూజర్లకు వీడియో, వాయిస్ కాలింగ్ సపోర్టుపై పనిచేస్తోందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. దీంతోపాటు వాట్సాప్ గ్రూప్ హిస్టరీ ఫీచర్‌ను కూడా తీసుకొస్తోంది. ఇటీవలే కొంత మందికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. త్వరలో మరింత మంది యూజర్లకు విడుదల కానుంది.
వీటితోపాటు వాట్సాప్ షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ ను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నట్లు తెలిసింది. కొంత మంది iOS బీటా టెస్టర్‌లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గూగుల్ మెసేజ్‌లో ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ఉంది.
వాట్సాప్ షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ ప్రస్తుతం iOS బీటా 26.7.10.72 వెర్షన్‌లో టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. వాట్సాప్‌లో మెసేజ్ టైప్ చేసి, అనంతరం మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక సెక్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే షెడ్యూల్ చేసిన మెసేజ్ డెలివరీ అయ్యే ముందే క్యాన్సిల్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








