దివాలా ప్రకటించిన కొడాక్!!

Posted By: Prashanth

దివాలా ప్రకటించిన కొడాక్!!

 

శతాబ్దం క్రితమే ప్రజలకు ఫోటోగ్రఫీని అందుబాటులోకి తీసుకొచ్చిన, అమెరికాకు చెందిన ప్రముఖ ఈస్ట్‌మన్ కొడాక్, దివాలా తీసినట్లు ప్రకటించింది. కోడాక్ భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయమే సముచితమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్ టీం సభ్యులు ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు, కంపెనీ సిఈవో అంటానియో పెరెజ్ తెలిపారు. భాగస్వాములు, ఉద్యోగులు, పదవీ విరమణ చేసినవారు, రుణాలు ఇచ్చినవారికి ఉత్తమ విలువను సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇదే సమయంలో విలువైన తమ కస్టమర్లతో కలిసి పనిచేస్తామని కూడా పేర్కొన్నారు.

130 ఏళ్లనాటి ఈ కంపెనీ, ఫోటోగ్రఫీని ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంతో పోటీపడేస్థాయిలో పనితీరు ప్రదర్శించకపోవడంతో కంపెనీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా ఇప్పటికే 47 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. 2003లో 13 తయారీ యూనిట్లను మూసివేసింది.

ఇక ముందు కోడక్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన డిజిటల్ ఇమేజింగ్, మెటీరియల్ సైన్స్ కంపెనీగా తీర్చిదిద్దుతామని సిఇఒ తెలిపారు. డిజిటల్ యుగం రాకముందు, కోడక్ ఫిల్మ్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉండేది. ప్రస్తుతం దివాలా ప్రకటనతో కంపెనీలో పనిచేస్తున్న 19 వేల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకమయింది. 1980లో కంపెనీ ఉచ్ఛస్థితిలో కొనసాగుతూ ఉన్నప్పుడు మొత్తం 1,45,000 మంది కార్మికులు పనిచేసేవారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting