రూ.39,990 నుంచే.. 64GB RAM, 144Hz డిస్‌ప్లేతో ASUS ఎక్స్‌పర్ట్‌బుక్ P సిరీస్ ల్యాప్‌టాప్స్ లాంచ్..
ASUS ExpertBook P Series India: టెక్ దిగ్గజం అసూస్ (ASUS), భారతదేశ మార్కెట్లోకి తమ సరికొత్త ఎక్స్‌పర్ట్‌బుక్ P సిరీస్ ల్యాప్‌టాప్స్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రత్యేకంగా వ్యాపార నిపుణులు, స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలలో పనిచేసే వారి కోసం వీటిని రూపొందించారు. అద్భుతమైన పనితీరు, మన్నిక, భద్రత ప్రధాన లక్ష్యాలుగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు.
ఈ సిరీస్‌లో ఎక్స్‌పర్ట్‌బుక్ P1, P3, P5 అనే మూడు మోడళ్లు ఉన్నాయి. వీటిలో హైలైట్ అయిన ఎక్స్‌పర్ట్‌బుక్ P5 లో అత్యాధునిక ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ కూడా లభిస్తుంది. ఇప్పుడు వీటి ఫీచర్లు, ధరల వంటి ముఖ్య వివరాలు తెలుసుకుందాం.

* స్ట్రాంగ్ కానీ బరువులో చాలా లైట్..
ఈ మూడు ల్యాప్‌టాప్స్ కూడా మిలిటరీ-గ్రేడ్ మన్నికతో వస్తున్నాయి. అంటే మామూలు ల్యాప్‌టాప్‌ల కంటే చాలా గట్టిగా ఉంటాయి. వీటిలో దృఢమైన మెటల్ బాడీ, 50,000 సార్లు తెరిచినా మూసినా చెక్కుచెదరని బలమైన కీలు (Hinges), ల్యాప్‌టాప్ మూతపై 30 కిలోల బరువు పెట్టినా తట్టుకోగల ప్యానెల్స్ ఉన్నాయి.
కీబోర్డులు కూడా 1 కోటి సార్లు కీ నొక్కినా పనిచేసేలా, అనుకోకుండా 78cc వరకు ద్రవాలు పడినా పాడవకుండా (Spill-resistant) ఉండేలా తయారుచేశారు. స్క్రీన్ ప్యానెల్స్ మీద 9 కిలోల ఒత్తిడి పడినా తట్టుకుంటాయి. ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నా, బరువు విషయంలో మాత్రం తేలిగ్గానే ఉన్నాయి. ఎక్స్‌పర్ట్‌బుక్ P5 కేవలం 1.29 కిలోలే బరువు ఉంటుంది.
* నచ్చిన సైజు, మెరుగైన స్క్రీన్
P1 మోడల్ 14-అంగుళాల, 15.6-అంగుళాల సైజులలో లభిస్తుంది. రెండూ ఫుల్ HD (FHD) రిజల్యూషన్, 300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తాయి. P3 మోడల్ కొంచెం ప్రీమియంగా 14-అంగుళాల FHD డిస్‌ప్లేతో, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. P5 మోడల్ 14-అంగుళాల FHD డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.
* పనితీరులో కింగ్ ఏది?
పనితీరు విషయంలో ఎక్స్‌పర్ట్‌బుక్ P5 టాప్‌లో నిలుస్తుంది. ఇందులో లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 (సిరీస్ 2) ప్రాసెసర్ వరకు ఆప్షన్ ఉంది. దీనికి తోడు ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్, 32GB వరకు LPDDR5X RAM ఉంటాయి. 1TB వరకు వేగవంతమైన NVMe SSD స్టోరేజ్ ఇచ్చారు. 63Wh పెద్ద బ్యాటరీ దీని సొంతం.
P1, P3 మోడళ్లలో 13వ తరం ఇంటెల్ కోర్ i7 (H-సిరీస్) ప్రాసెసర్లు ఉన్నాయి. ఇవి 64GB వరకు DDR5 RAM సపోర్ట్ చేస్తాయి. భవిష్యత్తులో స్టోరేజ్ పెంచుకోవడానికి వీలుగా రెండు M.2 SSD స్లాట్లు ఇచ్చారు. అన్ని మోడళ్లలోనూ వేగంగా పనిచేసే PCIe జెన్ 4 SSDలనే వాడారు.
* కనెక్టివిటీకి కొదవే లేదు..
ఈ ల్యాప్‌టాప్స్‌లో అవసరమైన అన్ని పోర్ట్‌లు ఉన్నాయి. USB 3.2 Gen 1, Gen 2 టైప్-A, USB-C, HDMI (P1లో 1.4 వెర్షన్, P3 & P5లలో లేటెస్ట్ 2.1 వెర్షన్), ఇంటర్నెట్ కేబుల్ కోసం RJ45 పోర్ట్, హెడ్‌ఫోన్స్ లేదా మైక్ కోసం 3.5mm జాక్ ఉన్నాయి.
ప్రత్యేకంగా P5 మోడల్‌లో థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు కూడా ఉన్నాయి. వీటితో మరింత వేగంగా డేటా బదిలీ చేయవచ్చు, అదనపు హై-రిజల్యూషన్ మానిటర్లను కనెక్ట్ చేయవచ్చు. ఇందులోని మీ డేటాకు పటిష్టమైన భద్రత ఉంటుంది. వ్యాపార ల్యాప్‌టాప్‌లలో భద్రత చాలా ముఖ్యం. అందుకే అసూస్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
* సేఫ్టీ ఫీచర్లు
అన్ని మోడళ్లలో డేటాను సురక్షితంగా ఉంచే TPM 2.0 చిప్, ఏదైనా సమస్య వస్తే తనంతట తాను రిపేర్ చేసుకునే సెల్ఫ్-హీలింగ్ BIOS, మైక్రోసాఫ్ట్ డివైజ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నాయి. P3, P5 మోడళ్లలో ముఖాన్ని గుర్తుపట్టి లాగిన్ అయ్యేందుకు విండోస్ హలో సపోర్ట్‌తో IR కెమెరా, వేలిముద్రతో లాగిన్ అవ్వడానికి ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి.
ప్రతి ల్యాప్‌టాప్‌తో పాటు 1-సంవత్సరం మెకాఫీ (McAfee) ప్రీమియం యాంటీవైరస్ ఉచితంగా లభిస్తుంది. కంపెనీలకు అవసరమైన సర్వీస్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. భారతదేశంలో 13,900కు పైగా పిన్ కోడ్‌లలో ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ చేసే సదుపాయం, వ్యాపార కస్టమర్లకు ప్రత్యేక ఫోన్ లైన్ (Business helpline), ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో అంతర్జాతీయ వారంటీ ఉంది.
* ధర ఎంత, లాంచ్ ఆఫర్లు ఉన్నాయా..
ఈ అసూస్ ఎక్స్‌పర్ట్‌బుక్ P సిరీస్ ల్యాప్‌టాప్స్ 2025, ఏప్రిల్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి వస్తాయి. ఎక్స్‌పర్ట్‌బుక్ P1 ప్రారంభ ధర రూ.39,990, ఎక్స్‌పర్ట్‌బుక్ P3 ప్రారంభ ధర రూ.64,990, ఎక్స్‌పర్ట్‌బుక్ P5 ప్రారంభ ధర రూ. 94,990గా నిర్ణయించారు.
లాంచ్ ఆఫర్లు ఏప్రిల్ 21 నుంచి 27 వరకు మాత్రమే ఉన్నాయి. రూ.3,000 వరకు తక్షణ తగ్గింపు. రెండు సంవత్సరాల అదనపు వారంటీ (విలువ రూ.3,499) ఉచితం. రెండేళ్ల పాటు ల్యాప్‌టాప్ అనుకోకుండా కింద పడినా, డ్యామేజ్ అయినా కవర్ చేసే యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ (విలువ రూ.1,499) ఉచితం.


Click it and Unblock the Notifications








