రూ.50,000లోపే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ బిల్డ్ చేసుకోవచ్చు.. అదెలాగో తెలుసుకోండి!
Budget PC build 2025 : ఈ రోజుల్లో వేగంగా దూసుకుపోతున్న డిజిటల్ ప్రపంచంలో, పర్సనల్ కంప్యూటర్ (PC) ఉండటం అనేది విలాసం కాదు.. కచ్చితమైన అవసరం. మీరు ఇంటి నుంచి పనిచేస్తున్నా, ఆన్‌లైన్ క్లాసులు వింటున్నా, డిజిటల్ కంటెంట్ తయారు చేస్తున్నా, లేదా ఇంటర్నెట్ వాడుతున్నా.. నమ్మకమైన PC చాలా ముఖ్యం. కానీ, ఇండియాలో రెడీమేడ్‌గా ఉన్న కంప్యూటర్ కొనాలంటే, ముఖ్యంగా బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు, కాస్త కంగారుగా అనిపించవచ్చు.
కానీ దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే, రూ.50,000 లోపే శక్తివంతమైన, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉండే PCని మీరే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇది మీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాలన్నింటికీ సరిగ్గా సరిపోతుంది.

* మీ PCని మీరే ఎందుకు తయారుచేసుకోవడం మంచిది.?
మీ PCని మీరే స్వయంగా అసెంబుల్ చేసుకుంటే, ప్రతీ భాగంపై మీకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. మీకు నిజంగా అవసరమైన కాంపోనెంట్స్‌ను మీరే ఎంచుకోవచ్చు, అవసరం లేని ఫీచర్ల కోసం డబ్బు వృథా చేయాల్సిన పనిలేదు. రెడీమేడ్ PCలతో పోలిస్తే, ఇలా చేయడం వల్ల అదే ధరకు మీకు మెరుగైన పనితీరు లభిస్తుంది.
అంతేకాకుండా, మీ సిస్టమ్‌ను మీరే అమర్చుకోవడం వల్ల ప్రతీ భాగం ఎలా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది. ఈ జ్ఞానం భవిష్యత్తులో పాడైపోయినవి లేదా నెమ్మదించిన భాగాలను అప్‌గ్రేడ్ చేసుకోవడానికీ పనికొస్తుంది. అంతేకాదు, ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే టెక్నీషియన్ అవసరం లేకుండా మీరే పరిష్కరించుకోవడానికీ ఉపయోగపడుతుంది. దీనివల్ల అసలు ఎలాంటి ఆందోళన ఉండదు.
* రూ.50,000 వర్క్ ఫ్రమ్ హోమ్ PC నుంచి ఏం ఆశించవచ్చు..
ఈ బడ్జెట్‌లో తయారుచేసే PC.. వీడియో కాల్స్, డాక్యుమెంట్ ఎడిటింగ్, వెబ్ బ్రౌజింగ్, స్ట్రీమింగ్ వంటి రోజువారీ పనులను సులభంగా చేస్తుంది. అలాగే, సాధారణ గేమింగ్, పాత ఈ-స్పోర్ట్స్ గేమ్స్ ఆడటానికి, ఫోటో లేదా వీడియో ఎడిటింగ్ వంటి తేలికపాటి కంటెంట్ క్రియేషన్ పనులకు కూడా ఇది బాగుంటుంది.
అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ బిల్డ్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే, భవిష్యత్తులో గ్రాఫిక్స్ కార్డ్ లేదా ఎక్కువ RAM వంటివి జోడించి దీని శక్తిని పెంచుకోవచ్చు, మొత్తం సిస్టమ్‌ను మార్చాల్సిన అవసరం లేదు. దీనివల్ల చిన్న చిన్న ఖర్చులతోనే ఎక్కువ కాలం మీ పీసీని వాడుకోవచ్చు.
* రూ.50,000లోపు బెస్ట్ PC బిల్డ్ (ఏప్రిల్ 2025)
ప్రాసెసర్ (CPU): AMD Ryzen 5 8500G ధర రూ.13,935. ఈ 6-కోర్, 12-త్రెడ్ ప్రాసెసర్ శక్తివంతమైన ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ (Radeon 740M) తో వస్తుంది. ఇది మల్టీటాస్కింగ్, సాధారణ గేమింగ్, తేలికపాటి ఎడిటింగ్‌ను బాగా హ్యాండిల్ చేస్తుంది. దీంతో పాటే కూలర్ వస్తుంది, కాబట్టి ఆ ఖర్చు ఆదా అవుతుంది.
బడ్జెట్‌లో ప్రత్యేక గ్రాఫిక్స్ కార్డ్ కోసం స్థలం లేనప్పుడు ఇది చాలా ఉత్తమమైన ఎంపిక. అలాగే తీసుకోవాల్సిన మదర్‌బోర్డ్ ASRock B650M-H/M.2+. దీని ధర రూ.8,050. ఈ DDR5 మదర్‌బోర్డ్ ధర తక్కువే అయినా, M.2 స్లాట్, USB 3.2 సపోర్ట్, DDR5 RAM అనుకూలత వంటి అన్ని ముఖ్యమైన ఫీచర్లతో వస్తుంది.
* ర్యామ్, స్టోరేజ్
అయితే, ASRock మదర్‌బోర్డ్‌లో వైఫై లేదా బ్లూటూత్ ఉండవు, కాబట్టి ఈ రెండింటి కోసం మీరు విడిగా USB డాంగిల్స్ కొనాల్సి ఉంటుంది. కొనాల్సిన ర్యామ్ Adata 16GB (2 x 8GB) DDR5 5600MHz. దీని ధర రూ.5,250. ఇది డ్యూయల్-ఛానల్ 16GB RAM సిస్టమ్ వేగాన్ని పెంచుతుంది. గ్రాఫిక్స్ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇది మల్టీటాస్కింగ్, తేలికపాటి గేమింగ్‌కు పర్ఫెక్ట్. ఈ మదర్‌బోర్డులో కేవలం రెండు RAM స్లాట్స్ మాత్రమే ఉంటాయి, కాబట్టి భవిష్యత్తు అప్‌గ్రేడ్‌ల గురించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. స్టోరేజ్ విషయానికి వస్తే Crucial P3 ప్లస్ 1TB NVMe Gen4 SSD కొనుగోలు చేయాలి దీని ధర రూ.5,550.
ఈ SSD చాలా వేగవంతమైన లోడింగ్ టైమ్స్, సున్నితమైన పనితీరును అందిస్తుంది. 1TBతో, మీ ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్స్, ఫైల్స్ కోసం సరిపడా స్థలం ఉంటుంది. ఒకవేళ డబ్బు ఆదా చేయడానికి 500GB ఎంచుకుంటే, మదర్‌బోర్డులో స్టోరేజ్ పెంచుకునే ఆప్షన్లు తక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి.
* పవర్ సప్లై
పవర్ సప్లై కోసం Ant Esports FP650B (650W) రూ.3,750 పెట్టి కొనాలి. నమ్మకమైన పవర్ సప్లై మీ PC సురక్షితంగా పనిచేయడానికి చాలా అవసరం. ఈ 650W యూనిట్ మీ ప్రస్తుత సెటప్‌కు సరిపోతుంది మరియు భవిష్యత్తులో గ్రాఫిక్స్ కార్డ్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది.
* క్యాబినెట్
'Ant వాల్యూ VM40 ATX Mid టవర్' రూ.2,700 వెచ్చించి కొనుగోలు చేయాలి. ఈ క్యాబినెట్ తక్కువ ధరలో లభిస్తుంది, మంచి గాలి ప్రసరణ (Airflow) ఉంటుంది. భవిష్యత్తులో కాంపోనెంట్స్ పెట్టుకోవడానికి సరిపడా స్థలం ఉంటుంది. టెంపర్డ్ గ్లాస్ సైడ్ ప్యానెల్ మీ సెటప్‌కు స్టైలిష్ లుక్‌ని ఇస్తుంది. మొత్తం ఖర్చు రూ.39,200 (సుమారుగా)
* సెటప్‌ను పూర్తి చేయడానికి అవసరమైన అదనపు వస్తువులు
మీ కొత్త PCని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే, మీకు మరికొన్ని వస్తువులు అవసరం. కొన్ని తెలివైన ఎంపికలతో మీ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ పూర్తవుతుంది. ఉదాహరణకు, TP-Link WiFi Dongle 300 Mbps కొనాలి. దీని ధర రూ.599. TP-Link USB బ్లూటూత్ అడాప్టర్, దీని ధర రూ.599
BenQ GW2490 Full HD IPS మానిటర్ కూడా కొనక తప్పదు. దీని ధర రూ.8,250. HP వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ కాంబో కొంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. ఈ రెండింటి ధర రూ.1,199. ఈ వస్తువుల కోసం సుమారుగా రూ 10,650 అదనంగా ఖర్చవుతుంది, దీంతో మొత్తం సెటప్ ఖర్చు రూ.50,000లోపే ఉంటుంది.
* తేలికపాటి గేమింగ్ కోసం గ్రాఫిక్స్ కార్డ్
ఒకవేళ మీరు మోడర్న్ గేమ్స్ ఆడాలనుకుంటే లేదా కొంచెం ఎక్కువ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే, మీరు ASRock RX 6500 XT వంటి బేసిక్ గ్రాఫిక్స్ కార్డ్‌ను (సుమారు రూ.12,380) జోడించవచ్చు. ఇది ఎంట్రీ-లెవల్ గేమింగ్ పనితీరును అందిస్తుంది. ఓన్లీ గేమ్స్ వాడే వారికి ఇది సరిపోదు.
ఇలాంటి యూజర్లు ఇంకా మంచి ఫలితాల కోసం, భవిష్యత్తులో ఎన్విడియా RTX 3060 లేదా AMD RX 6600 వంటి గ్రాఫిక్స్ కార్డులను పరిశీలించవచ్చు. ధరకు తగ్గ ఉత్తమమైన విలువ కోసం చూస్తున్నట్లయితే, ఇంటెల్ Arc A750 లేదా A770 కూడా చూడదగ్గవే.
* మొదటిసారి PC బిల్డ్ చేసేవారికి చిట్కాలు
PC అసెంబుల్ చేసే ముందు, పని సులభంగా అర్థం కావడానికి కొన్ని యూట్యూబ్ గైడ్ వీడియోలను చూడండి. కాంపోనెంట్స్‌ను స్టాటిక్ విద్యుత్ నుంచి రక్షించడానికి, స్టాటిక్ విద్యుత్ లేని ఉపరితలంపై (non-static surface) పని చేయండి. మీ మదర్‌బోర్డ్ BIOS వెర్షన్ మీ CPUకి సపోర్ట్ చేస్తుందో లేదో నిర్ధారించుకోండి.
ఒకవేళ సపోర్ట్ చేయకపోతే, మీరు కొన్న చోట వారిని అప్‌డేట్ చేయమని అడగండి. బిల్డ్ పూర్తయిన తర్వాత, విండోస్ లేదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయండి, ఆపై సిస్టమ్ సాఫీగా పనిచేయడానికి అవసరమైన అన్ని డ్రైవర్లను డౌన్‌లోడ్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








