మైక్రోసాఫ్ట్ నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు విడుదల.. టచ్‌స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ X ప్లస్ చిప్‌సెట్..!
Microsoft launches surface and surface pro : భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గ్యాడ్జెట్‌కు మంచి డిమాండ్ ఉంటోంది. అందువల్ల అనేక ప్రముఖ సంస్థలు ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తున్నాయి. ఇటీవల మోటోరోలా తొలిసారిగా భారత్‌లో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ల్యాప్‌టాప్, సర్‌ఫేస్ ప్రో ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్‌లు స్నాప్‌డ్రాగన్ X ప్లస్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు డిజైన్ పరంగా అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
సర్‌ఫేస్ ల్యాప్‌టాప్ (13 అంగుళాలు) :
మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ల్యాప్‌టాప్ 13 అంగుళాల వేరియంట్ ఫుల్ HD టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ట్యాప్‌టాప్ అల్యూమినియం ఛాసెస్, సన్నని బెజెల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్ తక్కువ బరువు కలిగిన మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

ఈ మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ 13 అంగుళాల ల్యాప్‌టాప్ వైలెట్, ప్లాటినం, ఓసియన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ స్నాప్‌డ్రాగన్ X ప్లస్ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB లేదా 24GB ర్యామ్ మరియు 256GB మరియు 512GB స్టోరేజీ తో అందుబాటులో ఉంటుంది.
అయితే మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ల్యాప్‌టాప్ అధిక సమయం బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని చెబుతోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 23 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్, 16 గంటల పాటు వెబ్ బ్రౌజింగ్ కు అవకాశం ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
ఈ ల్యాప్‌టాప్ ఆటో HDR, నాయిస్ రిడక్షన్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కూడా కలిగి ఉంది.

సర్‌ఫేస్ ప్రో 12 అంగుళాలు వేరియంట్ :
ఈ మోడల్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ట్యాబ్లెట్ మరియు ల్యాప్‌టాప్‌గా ఉపయోగించుకోవచ్చు. 12 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉన్న కిక్‌స్టాండ్ మరియు విడదీసేందుకు అవకాశం ఉన్న కీబోర్డును కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ అడాప్టివ్ టచ్ ప్యాడ్‌ను, backlit కీస్, కోపైలెట్ కీ తో అందుబాటులోకి వచ్చింది.
మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో 12 అంగుళాల వేరియంట్ స్నాప్‌డ్రాగన్ X ప్లస్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB లేదా 512GB స్టోరేజీ ను సపోర్టు చేస్తుంది. 2 ఇన్ 1 డివైజ్‌గా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి రోజంతా ఉపయోగించుకోవచ్చు.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? :
మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ 13 మరియు సర్‌ఫేస్ ప్రో 12 అంగుళాల వేరియంట్స్‌తోపాటు బిజినెస్ ఎడిషన్‌లను కూడా విడుదల చేసింది. ఇవి విండోస్ 11 ప్రో OS, యాంటీ రిఫ్లక్టివ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. జులై 22 నుంచి ఈ బిజినెస్ వేరియంట్స్ అందుబాటులోకి రానున్నాయి.

అయితే సర్‌ఫేస్ ల్యాప్‌టాప్ 13 అంగుళాల వేరియంట్ ప్రారంభ ధర $899 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ 76,000) గా ఉంది. అదే సర్‌ఫేస్ ప్రో 12 అంగుళాల వేరియంట్ ధర $799 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.67000) గా ఉంది. ఈ రెండు మోడల్స్ మే 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం సర్‌ఫేస్ ల్యాప్‌టాప్ 13 అంగుళాల వేరియంట్, సర్‌ఫేస్ ప్రో 12 అంగుళాల మోడల్స్‌ను అమెరికాలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే భారత్ మార్కెట్‌లో ఈ మోడల్స్‌ను విడుదల చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








