AC కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి..!
వేసవి కాలం కంటే ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వేసవి కాలం కంటే ముందుగానే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతోపాటు ఈ సంవత్సరం కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో పట్టణ, నగరాల్లోని ప్రజలు AC (ఎయిర్ కండిషనర్) లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
AC (Air conditioner) లు కొనుగోలు చేసే సమయంలో కనీస అవగాహన కలిగి ఉండాలి. ఏ ధరలో కొనుగోలు చేయాలనుకుంటున్నారు, ఏ సంస్థకు చెందిన AC ను కొనుగోలు చేయాలి. ఎంత సామర్థ్యం కలిగి ఉండాలి, ఫీచర్‌లు, ఎనర్జీ ఎఫీషియన్సీ, సర్వీస్ సౌకర్యలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

AC కొనుగోలు చేయాలని భావిస్తే, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం భారత్‌లో రూ.25000 నుంచి ఎయిర్ కండిషనర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీకు తగిన బడ్జెట్‌లో మంచి బ్రాండ్‌ను ఎంచుకోవాలి. అయితే అధునాతన ఫీచర్‌లు, స్మార్ట్ ఫీచర్‌ల కోసం మరికొంత అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. వేసవి సమీపిస్తున్న సమయాల్లో కొనుగోలు చేస్తే అధికంగా డబ్బులు ఖర్చుచేయాల్సి రావచ్చు. అందుకే ఎయిర్ కండిషనర్‌లు కొనుగోలు చేయాలని భావిస్తే, ముందుగానే అప్రమత్తం కావడం ఉత్తమం.
ఎయిర్ కండిషనర్‌లు కొనుగోలు చేసే సమయంలో ముఖ్యంగా బ్రాండ్ పైన దృష్టిపెట్టాలి. నిపుణులు మరియు AC టెక్నీషియన్‌ల అభిప్రాయాలను కూడా తీసుకోవాలి. సేల్స్ తర్వాత మెరుగైన సర్వీసులు అందించే బ్రాండ్‌లను ఎంచుకోవాలి.
ఎయిర్ కండిషనర్‌లు ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ మోడల్స్‌లో మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవాలి. ఇన్వర్టర్ మోడళ్లు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. అయితే నిర్వహణ, సర్వీస్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే నాన్ ఇన్వర్టర్ మోడళ్లు అందుబాటు ధరలో ఉంటాయి మరియు నిర్వహణ సులభం. దీంతోపాటు 5 స్టార్ రేటింగ్ కలిగిన మోడల్స్‌ను ఎంచుకోవాలి.

ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసే సమయంలో విండో, స్ప్లిట్ ఏసీను గురించి తెలుసుకోవాలి. మీకు ఎలాంటి మోడల్ సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోవాలి. విండో ఎయిర్ కండిషనర్ సింగిల్, దీర్ఘచతురస్రాకార యూనిట్‌గా ఉంటుంది. తక్కువ ధర, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. విండో AC పరికరాలు ఒకే చట్రంలో ఉంటాయి. అందువల్ల బయట వస్తువుల కారణంగా డ్యామేజీ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
స్ప్లిట్ ఏసీ సాధారణంగా రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి గది లోపల, మరొకటి గది బయట అమర్చాల్సి ఉంటుంది. అనంతరం వీటిని పైపుల ద్వారా కనెక్ట్ చేస్తారు. ఎటువంటి శబ్దం చేయకుండా చేస్తుంది. విండో AC ల అమర్చేందుకు బలమైన గోడలు కావాల్సి ఉండగా.. స్ప్లిట్ ఏసీలను సన్నని గోడలపైనా అమర్చవచ్చు.
ఇంట్లో గదుల విస్తీర్ణం ఆధారంగా AC ను ఎంచుకోవాలి. చిన్న గదులకు 0.5 టన్ను నుంచి 0.8 టన్ను సామర్థ్యం కలిగిన ఎయిర్ కండిషన్‌ను ఎంచుకోవాలి. అదే మధ్యస్తంగా ఉన్న గదుల కోసం 1 - 1.5 టన్నులు, పెద్ద గదుల కోసం 2 టన్నుల సామర్థ్యం కలిగిన AC కొనుగోలు చేయాలి.
పాత మోడల్ ఏసీలు ఆన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ శబ్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఎయిర్ కండిషనర్‌లు స్లీప్ మోడ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటున్నాయి. అంటే ఎటువంటి సౌండ్ లేకుండా మెరుగైన పనితీరును అందిస్తాయి.
దీంతోపాటు ఏసీలు మెరుగైన పనితీరు అందించేందుకు క్రమం తప్పకుండా సర్వీసు చేయించాల్సి ఉంటుంది. కూలింగ్ తక్కువగా ఉన్నా.. విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నా.. సౌండ్ సహా ఇతర సమస్యలు గుర్తిస్తే అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








