మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే వెంటనే డిలీట్ చేయండి, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ!
సెప్టెంబర్ 3, 2026న కేంద్ర ప్రభుత్వం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రమాదకరమైన ‘అడల్ట్’ యాప్‌ల (APKs) రూపంలో వస్తున్న మాల్‌వేర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇవి ఫోన్‌లోని 'యాక్సెసిబిలిటీ', 'డివైజ్ అడ్మిన్' పర్మిషన్లను ఉపయోగించి బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి యాప్‌ను ఏమైనా క్లిక్ చేసి ఉంటే, వెంటనే మీ ఫోన్‌ను ఐసోలేట్ చేయండి. మొబైల్ డేటా, వై-ఫై ఆపేయండి. ఎలాంటి బ్యాంకింగ్ లేదా UPI యాప్‌లను ఓపెన్ చేయకండి. మీ చాట్‌లు, ఫొటోలు, డబ్బూ సురక్షితంగా ఉంచుకుంటూ ఫోన్‌ను ఎలా రీసెట్ చేయాలో ఈ గైడ్‌లో చూద్దాం.
కంగారు పడకముందు కొన్ని లక్షణాలను గమనించండి. తెలియని యాప్‌లు కనిపించడం, పదే పదే పాప్-అప్‌లు రావడం, లేదా ‘యాక్సెసిబిలిటీ’ పర్మిషన్లు ఆటోమేటిక్‌గా ఆన్ కావడం ప్రమాదానికి సంకేతాలు. అలాగే ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడం, హీట్ అవ్వడం, మనకు తెలియకుండానే ఎస్‌ఎంఎస్‌లు వెళ్లడం జరగవచ్చు. దీని తర్వాత UPI కలెక్ట్ రిక్వెస్ట్‌లు రావడం లేదా బ్యాంకింగ్ లాగిన్స్ ఫెయిల్ అవ్వడం వంటివి ఎదురవుతాయి. ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నంత సేపు ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. అందుకే వెంటనే నెట్‌వర్క్ నుంచి డిస్‌కనెక్ట్ చేసి, డేటాను జాగ్రత్తగా బ్యాకప్ తీసుకుని, రీసెట్ చేయడం ద్వారా సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు. ఈ క్రింది స్టెప్స్ మీ డేటా భద్రతకు దోహదపడతాయి.

ఆండ్రాయిడ్ మాల్‌వేర్ అలర్ట్: వెంటనే చేయాల్సిన పనులు.. సేఫ్ మోడ్ గైడ్
ముందుగా మొబైల్ డేటా, వై-ఫై, బ్లూటూత్‌లను ఆపేసి, ఫోన్‌ను 'ఎయిర్‌ప్లేన్ మోడ్'లో పెట్టండి. ఆ తర్వాత ఫోన్‌ను 'సేఫ్ మోడ్' (Safe Mode)లోకి మార్చండి. దీనికోసం పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి, స్క్రీన్ పై కనిపించే 'పవర్ ఆఫ్' ఆప్షన్‌ను ప్రెస్ చేసి పట్టుకోవాలి. సేఫ్ మోడ్‌లోకి వెళ్లాక సెట్టింగ్స్‌లోకి వెళ్లి, 'యాక్సెసిబిలిటీ', 'యూసేజ్ యాక్సెస్'లను ఓపెన్ చేసి అనుమానాస్పద పర్మిషన్లను క్యాన్సిల్ (Revoke) చేయండి. అలాగే సెక్యూరిటీ లేదా ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి 'డివైజ్ అడ్మిన్ యాప్స్' చెక్ చేయండి. అక్కడ తెలియని అడ్మిన్ పర్మిషన్లను డిసేబుల్ చేసి, ఆ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఒకవేళ అన్‌ఇన్‌స్టాల్ కాకపోతే, ఫోన్ రీసెట్ చేసేవరకు వాటిని డిసేబుల్ చేసి ఉంచండి.
సురక్షితమైన బ్యాకప్, ఫ్యాక్టరీ రీసెట్ చెక్‌లిస్ట్
సురక్షితంగా ఉన్న డేటాను మాత్రమే బ్యాకప్ తీసుకోండి. సెట్టింగ్స్‌లో గూగుల్ ఆప్షన్‌లోకి వెళ్లి 'Google One' లేదా 'Drive' బ్యాకప్‌ను ఆన్ చేయండి. యాప్‌లు, కాంటాక్ట్‌లు, ఫొటోలు, ఎస్‌ఎంఎస్‌లు సెలెక్ట్ అయ్యాయో లేదో సరిచూసుకోండి. వాట్సాప్‌లో 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్' ఆన్ చేసి, బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి. మీ ఫొటోలు (DCIM), వాట్సాప్ మీడియాను కంప్యూటర్‌కు లేదా OTG పెన్‌డ్రైవ్‌కు కాపీ చేసుకోండి. అయితే ఈ క్రమంలో ఎలాంటి 'డేటా రికవరీ' APK యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి. అలాగే నమ్మకం లేని కంప్యూటర్లకు ఫోన్‌ను కనెక్ట్ చేయకపోవడమే మంచిది.
ఫ్యాక్టరీ రీసెట్, UPI రీ-బైండింగ్, డేటా రీస్టోర్ చేసే విధానం
ముందుగా మిగిలి ఉన్న అడ్మిన్ యాప్‌లను తీసివేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్ > సిస్టమ్ > రీసెట్ ఆప్షన్స్‌లోకి వెళ్లి 'ఎరేజ్ ఆల్ డేటా' (Erase all data) పై క్లిక్ చేయండి. కొన్ని ఫోన్లలో ఇది 'ఫ్యాక్టరీ రీసెట్' అని ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు కంపెనీకి చెందిన అధికారిక టూల్స్ ద్వారా అధికారిక ఫర్మ్‌వేర్‌ను రీఫ్లాష్ కూడా చేసుకోవచ్చు. రీసెట్ అయి ఫోన్ మళ్లీ ఆన్ అయ్యాక, నమ్మకమైన వై-ఫై నెట్‌వర్క్‌కు మాత్రమే కనెక్ట్ చేయండి. లోకల్ APKల నుంచి కాకుండా నేరుగా గూగుల్ క్లౌడ్ నుంచే డేటాను రీస్టోర్ చేసుకోండి. ఆ తర్వాత మీ UPI యాప్‌లను తిరిగి రీ-బైండ్ చేసి, అన్ని ఖాతాల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చేయండి.
ఆండ్రాయిడ్ మాల్‌వేర్ రాకుండా జాగ్రత్తలు: అస్సలు చేయకూడని తప్పులివే!
గూగుల్ ప్లే ప్రొటెక్ట్ (Google Play Protect) ఆన్ చేసి, ఫోన్‌ను ఫుల్ స్కాన్ చేయండి. యాక్సెసిబిలిటీ, నోటిఫికేషన్ యాక్సెస్, ఇన్ స్టాల్ అన్‌నోన్ యాప్స్ జాబితాలను ఒకసారి పరిశీలించి, అనవసరమైన పర్మిషన్లను వెంటనే రద్దు చేయండి. మీ ఈమెయిల్, బ్యాంకింగ్, UPI ఖాతాలకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) ఎనేబుల్ చేయండి. ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పాటు యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి. ఎట్టిపరిస్థితుల్లోనూ 'అడల్ట్' లేదా 'డేటా రికవరీ' పేరుతో వచ్చే యాప్‌లను థర్డ్ పార్టీ సోర్స్ నుంచి ఇన్‌స్టాల్ (Sideload) చేయకండి. ఈ జాగ్రత్తలను మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి, వారి ఫోన్లను కూడా సురక్షితంగా ఉంచండి.


Click it and Unblock the Notifications
