గుండె ఆరోగ్యంపై నిఘా.. బీపీ పెరిగితే వెంటనే వార్నింగ్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్‌లు కేవలం టైం తెలుసుకొనేందుకు కాకుండా అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించి, అత్యవసర సమయాల్లో అప్రమత్తం చేస్తున్నాయి. టెక్నాలజీని వాడుకోవడంలో ముందుండే ఆపిల్, భారతీయుల కోసం సూపర్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. హైపర్‌టెన్షన్ నోటిఫికేషన్.. సాధారణంగా అధిక రక్తపోటు (High BP) ఎలాంటి లక్షణాలు లేకుండానే దాడి చేస్తుంది. కానీ ఆపిల్ వాచ్ దాన్ని పసిగట్టేస్తుంది. మరియు అప్రమత్తం చేస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే..
ఈ ఫీచర్ కోసం ఆపిల్ చాలా పెద్ద టెక్నాలజీనే వినియోగించింది. ఆపిల్ వాచ్‌లోని ఆప్టికల్ హార్ట్ సెన్సార్.. మీ గుండె కొట్టుకున్నప్పుడు రక్తనాళాలు ఎలా స్పందిస్తున్నాయో నిశితంగా గమనిస్తుంది. అయితే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్నట్లు వెంటనే బీపీ రీడింగ్ చూపించదు.

అందుకు బదులుగా, ఒక బ్యాక్‌గ్రౌండ్ అల్గారిథమ్ సాయంతో దాదాపు 30 రోజుల పాటు మీ డేటాను విశ్లేషిస్తుంది. మీ రక్తప్రసరణలో ఏమైనా తేడా ఉందా?.. బీపీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా?.. అనేది గమనించి, ముప్పు ఉంటే నోటిఫికేషన్ పంపిస్తుంది. దీనివల్ల సమస్య ఉందో లేదో ముందే తెలుసుకోవచ్చు.
పక్కా రీసెర్చ్‌తో..
ఇది ఏదో పేరుకు పెట్టిన ఫీచర్ కాదని ఆపిల్ చెబుతోంది. దీని వెనుక భారీ పరిశోధన ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా డేటాతో మెషిన్ లెర్నింగ్ మోడల్‌ను తయారు చేశారు. అంతేకాదు, 2,000 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి మరీ దీన్ని పరీక్షించారు.
అన్ని కేసులను ఇది గుర్తించలేకపోయినా, దీని ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. ఈ ఒక్క ఫీచర్ వల్ల మొదటి ఏడాదే దాదాపు 10 లక్షల మందికి పైగా బాధితులను అప్రమత్తం చేయొచ్చని ఆపిల్ అంచనా వేస్తోంది.
ఎవరికి అందుబాటులో ఉంటుంది?
ఈ ఫీచర్ వాడుకోవాలంటే మీ దగ్గర లేటెస్ట్ డివైజ్‌లు ఉండాలి. ఆపిల్ వాచ్ సిరీస్ 9 లేదా ఆపిల్ వాచ్ అల్ట్రా 2 (లేదా ఆ తర్వాతి మోడల్స్) ఉండాలి. ఇందులో watchOS 11 అప్డేట్ అయి ఉండాలి. ఐఫోన్ 11 లేదా ఆ పై మోడల్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. మొబైల్స్ లేటెస్ట్ iOS రన్ అవుతుండాలి. అయితే, ఈ ఫీచర్ వాడాలంటే యూజర్ల వయసు 22 ఏళ్లు దాటి ఉండాలి. ఇప్పటికే హైపర్‌టెన్షన్ ఉన్నవారికి లేదా గర్భిణీలకు ఈ ఫీచర్ ఉద్దేశించినది కాదని ఆపిల్ చెబుతోంది.
యాక్టివేట్ చేసుకోవడం ఎలా :
ఈ సేఫ్టీ ఫీచర్‌ను ఆన్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా మీ ఐఫోన్ మరియు వాచ్‌ను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు అప్డేట్ చేయండి. ఐఫోన్‌లోని Health App ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి, Health Checklist లోకి వెళ్లండి.
అక్కడ హైపర్‌టెన్షన్ నోటిఫికేషన్స్ (Hypertension Notifications) ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఆన్ (Toggle on) చేసుకోండి. వాచ్‌ను మీరు రోజూ క్రమం తప్పకుండా ధరిస్తేనే, అది మీ ఆరోగ్యాన్ని కచ్చితంగా విశ్లేషించగలదు. మధ్యలో తీసేస్తే ఇది పనిచేయకపోవచ్చు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.
అలర్ట్ వస్తే ఏం చేయాలి?
ఒకవేళ వాచ్‌కి నోటిఫికేషన్ వస్తే కంగారు పడాల్సిన పనిలేదు. అది మీకు వ్యాధి ఉందని కన్ఫర్మ్ చేయడం లేదు, కేవలం జాగ్రత్త పడమని చెబుతోంది. నోటిఫికేషన్ రాగానే, మీరు సాధారణ బీపీ మిషన్ (Blood Pressure Cuff) ద్వారా 7 రోజుల పాటు బీపీ రీడింగ్స్ రాసి పెట్టుకోవాలి. ఆ రిపోర్ట్‌ను తీసుకుని డాక్టర్‌ను సంప్రదించాలి.
నిపుణులు ఏమంటున్నారంటే..
సాధారణంగా బీపీకి బయటకు కనిపించే లక్షణాలు ఉండవు కాబట్టి, చాలామందికి హార్ట్ అటాక్ వచ్చేవరకు విషయం తెలియదు. నిత్యం వినియోగించే డివైజ్‌లో ఇలాంటి ఫీచర్ ఉండటం వల్ల, సమస్యను ముందస్తుగానే గుర్తించి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉందని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ దొరైరాజ్ ప్రభాకరన్ (Prof. Dorairaj Prabhakaran) అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications







