ఇంకా ఇలాంటి పాస్‌వర్డ్స్‌ను క్రియేట్ చేస్తున్నారా.. మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టే..?
ప్రస్తుతం లక్షలాది మంది వివిధ అవసరాల కోసం సోషల్ మీడియా, బ్యాంకింగ్ యాప్స్, మెయిల్, ఇతర ఆన్‌లైన్ అకౌంట్‌లను వినియోగిస్తున్నారు. వీటి వినియోగానికి యూజర్ నేమ్, పాస్‌వర్ట్ అవసరం. సోషల్ మీడియా సహా ఇతర అకౌంట్‌ల యూజర్లు సుమారుగా 4 నుంచి 5 పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కొంత మంది సురక్షితం కాని పాస్‌వర్డ్‌లను (weak passwords) ఎంపిక చేసుకుంటున్నారు. బలహీనమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసి వినియోగిస్తున్న వారికి ఏదో ఒక సమయంలో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్చరికలు జారీ :
ప్రస్తుతం టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో.. అదే టెక్నాలజీని ఆధారంగా చేసుకొని, మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్ భద్రతా సంస్థలు సహా ఇతర విభాగాలు ఇప్పటికే అనేకసార్లు సరైన పాస్‌వర్డ్‌లు లేకుంటే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉందో వెల్లడించాయి.

బలహీనమైన పాస్‌వర్డ్ ఉంటే :
బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా సైబర్ నేరగాళ్లు.. మీ అకౌంట్స్‌లను సులభంగా హ్యాక్ చేసేందుకు అవకాశం ఉంది. ఫలితంగా మీ వ్యక్తిగత సమాచారం సహా ఇతర వివరాలు నేరగాళ్ల చేతికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆర్థిక సహా ఇతర విధాల్లో నష్టపోయే ప్రమాదం ఉంది.
కీలక రిపోర్టు :
తాజాగా NordVPN సంస్థ సైబర్ సెక్యూరిటీపై కీలక వివరాలను వెల్లడించింది. ఇప్పటికీ బలహీనమైన పాస్‌వర్డ్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య, వాటి వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగాయో తెలిపింది. బ్యాంకింగ్ యాప్స్, సోషల్ మీడియా అకౌంట్ల కోసం సురక్షితమైన పాస్‌వర్డ్‌లను ఎంపిక చేసుకోవాలని సూచించింది.
ఈ పాస్‌వర్డ్‌లు వినియోగిస్తున్నారా?
బలహీనమైన పాస్‌వర్డ్ జాబితాలో 123456, 123456789, 1234, 123456789, 12345, 111111, 123123, abc123 వంటి అనేకం ఉన్నాయి. భారీసంఖ్యలో ఈ తరహా పాస్‌వర్డ్‌ల కారణంగా హ్యాకింగ్, వ్యక్తిగత డేటా చోరీ. డేటా లీక్ వంటి ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. యూజర్లు తమ అన్ని అకౌంట్స్ కోసం యూనిక్ పాస్‌వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఎలాంటి పాస్‌వర్డ్ ఉండాలి :
పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకొనే సమయంలో నంబర్ లు, స్పెషల్ క్యారెక్టర్, క్యాపిటల్ లెటర్స్ ఎంచుకోవాలి. దీంతోపాటు పొడవైన పాస్‌వర్డ్ లను క్రియేట్ చేసుకోవాలి. కనీసం 12 నుంచి 15 అక్షరాలు ఉండేలా చూసుకోండి. దీంతోపాటు ఊహించని కష్టమైన పాస్‌వర్డ్ ను ఎంచుకోవాలి.
పాస్‌వర్డ్ ను పేరు, స్థలం, పుట్టిన తేదీలతో క్రియేట్ చేసుకొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అలాంటి పేర్లు కలిగిన పాస్‌వర్డ్ ను వెంటనే మార్చుకోవాలి. దీంతోపాటు వివిధ రకాల అకౌంట్స్ కోసం ఒకే పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేస్తుంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు.
దీంతోపాటు ప్రస్తుతం సోషల్ మీడియా అకౌంట్స్ లో అవసరానికి మంచి ఎక్కువ వివరాలను అప్‌డేట్ చేస్తుంటారు. ఫ్యామిలికి సంబంధించిన వివరాలు, ఫోటోలు, వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. అకౌంట్ హ్యాక్ లేదా ఇతర సందర్భాల్లో మీ వ్యక్తిగత వివరాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మీరు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
సైబర్ నేరాలపై పోలీసులు సహా సైబర్ నిపుణులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. దీంతోపాటు పరిమితికి మించి సోషల్ మీడియాలో సమయం వృథాచేయడం కూడా ఆరోగ్యానికి హానిచేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








