పండుగ సేల్స్‌లో నకిలీ ఛార్జర్లు కొంటున్నారా? మీ ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది, ఇలా చెక్ చేసుకోండి!
పండుగల సేల్స్ వేళ, మార్కెట్లో నాణ్యత లేని ఛార్జర్లు, పవర్ బ్యాంకులపై అధికారులు నిఘా తీవ్రతరం చేశారు. ముఖ్యంగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విదేశాల నుంచి వచ్చే నకిలీ, BIS సర్టిఫికేషన్ లేని యాక్సెసరీస్‌ను కస్టమ్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఇటీవల బీఐఎస్ (BIS) నిర్వహించిన దాడుల్లో నకిలీ ముద్రలు ఉన్న వస్తువులు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. అందుకే ఈ ఫెస్టివ్ సీజన్ షాపింగ్‌లో బ్యాటరీ పేలుళ్లు, ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే.. కొనేముందు BIS వివరాలు సరిచూసుకోవడం, సురక్షితమైన ఛార్జింగ్ పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం.
మన దేశంలో ఛార్జర్లు, పవర్ బ్యాంకులు అమ్మాలన్నా లేదా దిగుమతి చేసుకోవాలన్నా 'కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ (CRS)' కింద కచ్చితంగా BIS స్టాండర్డ్ మార్క్‌తో పాటు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాల్సిందే. నాణ్యతా ప్రమాణాలు పాటించని వస్తువులను అమ్మడం లేదా నిల్వ చేయడం చట్టరీత్యా నేరం. పవర్ బ్యాంకులు నోటిఫైడ్ కేటగిరీ కిందకు వస్తాయి కాబట్టి, భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విక్రయాలకు అనుమతిస్తారు. అందుకే తక్కువ ధరలకే లభించే ప్రమాదకరమైన నకిలీ ప్రొడక్టులపై ప్రస్తుతం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

BIS రిజిస్ట్రేషన్ (R‑నంబర్) నిజమైనదో కాదో ఎలా వెరిఫై చేయాలి?
ఛార్జర్ అడాప్టర్ లేదా పవర్ బ్యాంక్ బాడీపై, అలాగే ప్యాకింగ్ బాక్స్‌పై ముద్రించిన R-నంబర్‌ను ముందుగా చూడండి. ఆ తర్వాత 'BIS Care' యాప్‌లోని "Verify R-Number under CRS" ఆప్షన్ ద్వారా గానీ, లేదా BIS పబ్లిక్ డాష్‌బోర్డ్‌లో గానీ ఆ మోడల్ నంబర్‌ను సెర్చ్ చేసి సరిచూసుకోండి. బ్రాండ్ పేరు, మోడల్ నంబర్ లేదా స్టేటస్ మ్యాచ్ కాకపోయినా.. లేదా ‘Cancelled’ అని ఉన్నా అది కచ్చితంగా నకిలీ అని అర్థం. ప్రొడక్ట్ కొనేముందే ఈ వివరాలను స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవడం మంచిది.
నకిలీ ఛార్జర్లు, పవర్ బ్యాంక్‌లను గుర్తుపట్టడం ఎలా?
బరువు తక్కువగా (లోపల ఖాళీగా ఉన్నట్టు) అనిపించడం, స్పష్టత లేని ప్రింటింగ్, పక్కకు జరిగినట్టు ఉండే లోగోలు, వంకరగా ఉన్న పిన్స్ నకిలీ ప్రొడక్ట్‌కు ప్రధాన సంకేతాలు. ఛార్జ్ అవుతున్నప్పుడు అడాప్టర్ నుంచి వింత శబ్దం (కాయిల్ వైన్) వస్తుందేమో గమనించండి. ఛార్జింగ్ సమయంలో విపరీతంగా వేడెక్కినా లేదా కాలిన వాసన వచ్చినా వెంటనే వాడటం ఆపేయండి. అడాప్టర్ లేబుల్‌పై 5V/9V/12V ఔట్‌పుట్ వివరాలు స్పష్టంగా లేకపోతే.. కేవలం '65W' అని రాసి ఉన్నా నమ్మకండి. ఒరిజినల్ ప్రొడక్టులపై ఫోంట్లు, లేబుల్స్ క్లియర్‌గా, ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఊహించని తక్కువ ధరలకే వస్తున్నాయంటే అనుమానించాల్సిందే, అలాంటి ప్రొడక్టులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
పవర్ బ్యాంక్ రూల్స్: 100Wh లిమిట్.. విమానంలో వాడటం నిషేధం!
ప్రయాణాల్లో పవర్ బ్యాంక్‌లను ఎప్పుడూ క్యాబిన్/హ్యాండ్ బ్యాగేజ్‌లోనే తీసుకెళ్లాలి. పైన ఉండే ఓవర్‌హెడ్ బిన్స్‌లో కాకుండా మీకు అందుబాటులో ఉంచుకోవడం మంచిది. సాధారణంగా 100Wh వరకు సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌లను అనుమతిస్తారు; 100 నుంచి 160Wh మధ్య ఉంటే ఎయిర్‌లైన్స్ ముందస్తు అనుమతి తప్పనిసరి. విమాన ప్రయాణంలో ఓవర్‌హీటింగ్ ప్రమాదాలు జరుగుతున్నందున, ఫ్లైట్‌లో పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని డిజిసిఎ (DGCA) స్పష్టంగా నిషేధించింది. ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే ప్రయాణానికి ముందే మీ ఎయిర్‌లైన్స్ నిబంధనలను ఒకసారి చెక్ చేసుకోండి.
సేఫ్ ఫాస్ట్ ఛార్జింగ్: PD, PPS టెక్నాలజీలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ ఫోన్ ఛార్జింగ్ కెపాసిటీకి సరిపోయే కేబుల్, అడాప్టర్‌లను మాత్రమే వాడండి. USB పవర్ డెలివరీ (PD), ప్రోగ్రామబుల్ పవర్ సప్లై (PPS) టెక్నాలజీలు వోల్టేజ్, కరెంట్‌ను నియంత్రిస్తాయి. ఎక్కువ వాటేజ్ ఉన్న అడాప్టర్‌కి నాణ్యత లేని సాధారణ కేబుల్ వాడితే ఛార్జింగ్ స్లో అవ్వడమే కాకుండా డివైజ్ బాగా వేడెక్కుతుంది. రాత్రిపూట దిండు కింద లేదా పరుపుపై ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెట్టకూడదు. అడాప్టర్‌కి గాలి తగిలేలా చూడండి, ఫోన్‌లో బ్యాటరీ ప్రొటెక్షన్ ఫీచర్లను ఆన్ చేసుకోండి. నమ్మకమైన విక్రేతల వద్ద, స్పష్టమైన రిటర్న్ పాలసీ ఉన్న BIS మార్క్ ప్రొడక్టులనే కొనడానికి ప్రాధాన్యం ఇవ్వండి.


Click it and Unblock the Notifications
