మీ ఫోన్లో 'హిరుడో' వైరస్ ఉందా? బ్యాంక్ ఖాతా ఖాళీ కాకముందే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులను కలవరపెడుతూ 'హిరుడో' (Hirudo) అనే కొత్త బ్యాంకింగ్ ట్రోజన్ వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 14, 2026న విడుదలైన నివేదికల్లో ఈ మాల్వేర్ తీవ్రత బయటపడింది. ఇది ఫోన్లోని ఒరిజినల్ బ్యాంకింగ్ యాప్‌లను తొలగించి, వాటి స్థానంలో సెక్యూరిటీ చెక్‌లను బైపాస్ చేసే నకిలీ (ప్యాచ్డ్) యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంది. థర్డ్-పార్టీ APKలు, ఫేక్ యాప్ అప్డేట్లు, మెసేజ్ లింక్‌ల ద్వారా హ్యాకర్లు దీనిని వ్యాపింపజేస్తున్నారు. దీనివల్ల మీ UPI పేమెంట్లు, ఒకసారి ఉపయోగించే పాస్వర్డ్లు (OTP) తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కూడా ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ కాకుండా బయటి వనరుల నుంచి ఏవైనా యాప్‌లు ఇన్స్టాల్ చేసి ఉంటే, వెంటనే మీ ఫోన్‌ను ఒకసారి పరిశీలించుకోండి.
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'త్రెట్ఫ్యాబ్రిక్' (ThreatFabric) అందించిన సమాచారం ప్రకారం.. ఈ 'హిరుడో' మాల్వేర్ కోడ్‌లో భారత్‌కు చెందిన యూజర్ల డేటా కూడా టార్గెట్ లిస్ట్‌లో ఉంది. ఈ వైరస్ ఫోన్లోని యాక్సెసిబిలిటీ సర్వీస్, నోటిఫికేషన్ యాక్సెస్, స్క్రీన్ క్యాప్చర్ అనుమతులను దుర్వినియోగం చేస్తూ రహస్యంగా సమాచారాన్ని దొంగిలిస్తుంది. అసలైన బ్యాంక్ యాప్‌లను అన్ఇన్స్టాల్ చేసి, అచ్చం అలాగే ఉండే క్లోన్ యాప్‌లను ప్రవేశపెట్టడమే దీని అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడ. ఈ నకిలీ యాప్‌లు సెక్యూరిటీ చెక్‌లను గ్యాప్ లేకుండా దాటేస్తూ, ఫోన్ రక్షణ వ్యవస్థలను డిసేబుల్ చేస్తాయి. దీనివల్ల యూజర్లకు ఎలాంటి అనుమానం రాకుండానే UPI యాప్‌లు, OTPల ప్రక్రియను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చేసుకోగలరు.

ఫోన్లో 'హిరుడో' ట్రోజన్‌ను త్వరగా గుర్తించడం ఎలా?
ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, Accessibility అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు తెలియని లేదా అనుమానాస్పద యాప్‌లకు ఉన్న పర్మిషన్లను వెంటనే తీసేయండి (Remove). ఆ తర్వాత Special app access విభాగంలోకి వెళ్లి, Notification access ని పరిశీలించి, అనవసరమైన యాప్‌ల అనుమతులను రద్దు చేయండి. అనంతరం Install unknown apps అని సెర్చ్ చేసి, బ్రౌజర్లు మరియు ఫైల్ మేనేజర్లకు ఉన్న 'Allow from this source' ఆప్షన్‌ను ఆఫ్ చేయండి. అలాగే Google Play Store ఓపెన్ చేసి, Play Protect ద్వారా ఫోన్ మొత్తాన్ని ఫుల్ స్కాన్ చేయండి. ఇటీవల ఇన్స్టాల్ చేసిన యాప్‌లు, Device admin యాప్‌లను పరిశీలించి, అనుమానాస్పదంగా ఉన్న వాటిని డిసేబుల్ చేసి అన్ఇన్స్టాల్ చేయండి.
'హిరుడో' బారిన పడితే వెంటనే చేయాల్సిన పనులు
అనుమానాస్పద యాప్‌లను వెంటనే అన్ఇన్స్టాల్ చేసి, అవి పొందిన యాక్సెసిబిలిటీ, నోటిఫికేషన్ యాక్సెస్‌లను రద్దు చేయండి. ఆలస్యం చేయకుండా మీ UPI PIN, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను మార్చేయడంతో పాటు మిగతా పరికరాల్లోని సెషన్ల నుంచి లాగౌట్ అవ్వండి. ఒకవేళ ఆర్థికంగా మోసపోయినట్లు గ్రహిస్తే.. 'గోల్డెన్ అవర్'లోగా 1930 సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఖాతాను ఫ్రీజ్ చేయమని కోరండి. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (National Cyber Crime Reporting Portal)లో ఫిర్యాదు నమోదు చేసి, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను భద్రపరుచుకోండి. ఒకవేళ ఫోన్‌పై హ్యాకర్ల నియంత్రణ ఇంకా కొనసాగుతుంటే, ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ (Factory Reset) చేయండి.
ముఖ్యంగా పండుగ ఆఫర్ల సమయంలో థర్డ్ పార్టీ APKలు లేదా మోడెడ్ యాప్‌లను ఇన్స్టాల్ చేయకండి. కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుంచే యాప్‌లను డౌన్లోడ్ చేసుకోండి. మీ బ్యాంకింగ్ యాప్‌లలో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను సక్రియం చేసుకుని, బలమైన స్క్రీన్ లాక్‌ను ఉపయోగించండి. ప్రతీ లావాదేవీకి సంబంధించి SMS అలర్ట్‌లను ఆన్‌లో ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP లేదా UPI PINను ఎవరితోనూ పంచుకోవద్దు. స్కామ్ కాల్స్, అనుమానాస్పద SMSలు లేదా వాట్సాప్ మెసేజ్‌లను రిపోర్ట్ చేయడానికి 'సంచార్ సాథీ చక్షు' (Sanchar Saathi Chakshu) పోర్టల్‌ను ఉపయోగించండి. మీ అనుమతి లేకుండా SIM పోర్ట్-అవుట్ యత్నాలు జరుగుతున్నట్లు అనిపిస్తే, వెంటనే మీ టెలికాం ఆపరేటర్‌కు కాల్ చేసి సేవలను నిలిపివేయండి.


Click it and Unblock the Notifications
