Smartphone Hacking స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ నుంచి ఎలా తప్పించుకోవాలి.. ఈ టిప్స్ మీకోసం..!
Smartphone Hacking : టెక్నాలజీ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీని నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. హ్యాకింగ్ సహా ఇతర మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే చాలా మంది నేరగాళ్లు చాలా సులభంగా ప్రజలను మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీల పేరుతో, నకిలీ బ్యాంకు మెసేజ్‌లు, నకిలీ లింక్స్ పంపి డివైజ్‌లను హ్యాక్ చేస్తున్నారు.
ఈ తరహా మోసాల పట్ల పోలీసులు సహా వివిధ సంస్థలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కానీ ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హ్యాకర్ల బారి నుంచి తప్పించుకొనేందుకు అవకాశం ఉంటుంది.

నకిలీ లింక్స్ :
సాధారణంగా ఫోన్లకు బ్యాంకులు సహా ఇతర సంస్థల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. దీని అదనుగా చూసుకొని.. హ్యాకర్లు ఈ తరహా మెసేజుల్లో హానికర లింక్స్‌తోపాటు మాల్‌వేర్‌ను జతచేస్తున్నారు. చాలా మంది ఈ మెసేజ్‌లను బ్యాంకులు లేదా డెలివరీ సంస్థల నుంచి వచ్చినవిగా భావిస్తున్నారు.
ఆయా లింక్స్ పైన క్లిక్ చేస్తున్నారు. దీంతో ఆ లింక్స్‌లో ఉన్న మాల్‌వేర్ ఫోన్‌లలోకి డౌన్‌లోడ్ అవుతోంది. దీని ద్వారా మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారం సేకరించడంతోపాటు కొన్నిసార్లు మీ ఫోన్‌ను వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారు. మరియు బ్యాంకు అకౌంట్‌లోని నగదును కాజేస్తున్నారు.
ఇలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా ఉండేందుకు.. లింక్ వచ్చిన ఫోన్ నంబర్ లేదా మెయిల్ అడ్రస్‌ను పూర్తిగా తనిఖీ చేయాలి. ఎటువంటి అనుమానాస్పదంగా అనిపించినా.. సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్ లేదా కాల్ సెంటర్‌కు కాల్ చేసి, మీకు వచ్చిన మెసేజ్ సరైనదా కాదా అని తెలుసుకోవాలి.
కేవైసీ పేరుతో :
ఇటీవల కాలంలో KYC పేరుతో అనేక మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకులు ఆధార్, పాన్ కార్డుల పేరుతో కాల్స్ చేస్తున్నారు. సంబంధిత అధికారులమని చెప్పి, అనేక వివరాలు అడుగుతుంటారు. KYC ను వెంటనే పూర్తి చేసుకోవాలని ఫోన్ నంబర్‌కు వచ్చిన OTP వివరాలను చెప్పాలని కోరుతుంటారు.
అయితే చాలా మంది ప్రజలు.. కాల్ చేసిన వ్యక్తులు అధికారులు అని భావించి, OTP వంటి సున్నితమైన వివరాలను వారితో షేర్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాంకు అకౌంట్‌ను సదరు హ్యాకర్లు ఖాళీ చేసే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా OTP సహా ఇతర వ్యక్తిగత వివరాలను షేర్ చేయమని అధికారులు ఫోన్‌లు చేయరని గుర్తుంచుకోవాలి.
యాప్స్ ద్వారా :
వివిధ అవసరాల కోసం అనేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటాం. అయితే యాప్ ఇన్‌స్టాల్ చేయాలని భావించిన ప్రతిసారి యాప్ స్టోర్‌ల నుంచే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మరియు యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే కొన్ని యాప్స్.. అన్ని రకాల అనుమతులు అడుగుతుంటాయి. ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
నకిలీ క్యూఆర్ కోడ్ :
రోజువారీ వివిధ అవసరాల కోసం వివిధ చోట్ల QR కోడ్‌లను స్కాన్ చేస్తుంటాం. ఈ పరిస్థితిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నకిలీ QR కోడ్‌లను అమర్చి, నగదు వారి ఖాతాల్లోకి బదిలీ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందువల్ల ఎక్కడైనా QR కోడ్‌లను స్కాన్ చేయాల్సి వస్తే.. వారి పేర్లను ధ్రువీకరించుకున్నాకే నగదు బదిలీ చేయాలి.


Click it and Unblock the Notifications








