Air Cooler ఈ వేసవి కాలంలో ఎయిర్ కూలర్ కొనుగోలు చేయాలా.. ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..!
వేసవి కాలం కంటే ముందుగానే ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ కొంత అనుకూలంగా ఉంటున్నా.. పట్టణ, నగరాల్లో ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనే వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో అనేక మంది ప్రజలు ఏసీలు, కూలర్‌లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఎయిర్ కండిషనర్ (AC) కోసం కనీసం రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాలి. అదే అధునాతన ఫీచర్లు, సామర్థ్యం ఆధారంగా అంతకంటే ఎక్కువే ఖర్చుచేయాల్సి రావచ్చు. అందుకే మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఎయిర్ కూలర్ లను (Air Cooler Buying Guide) కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఎయిర్ కూలర్ లు కొనుగోలు చేసే సందర్భాల్లో కొన్ని అంశాలను కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఈ అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి :
ఎయిర్ కూలర్ ను కొనుగోలు చేసే సమయంలో ఏ విధమైన మోడల్‌ను కొనుగోలు చేయాలో మీకు అవగాహన ఉండాలి. దీంతోపాటు ధర, సామర్థ్యం, ఫీచర్‌లు వంటి అనేక అంశాలపై అవగాహన కలిగి ఉండడం ఉత్తమం. దీంతోపాటు విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న కూలర్‌లను ఎంచుకోవాలి.
ఎయిర్‌కూలర్ ను కొనుగోలు చేసే సమయంలో మీకు ఎంత సామర్థ్యం కలిగిన కూలర్ అవసరం కానుందో ముందుగా తెలుసుకోవాలి. చిన్న గదుల కోసం 15-20 లీటర్లు, మిడిల్ సైజ్ ఉన్న గది అయితే 25-40 లీటర్లు, అదే పెద్ద గది అయితే 40 లీటర్ల సామర్థ్యం కలిగిన కూలర్ ను ఎంచుకోవాలి.
దీంతోపాటు కొన్ని రకాల కూలర్‌లు పనిచేసే సమయంలో ఎక్కువ సౌండ్ చేస్తుంటాయి. అందువల్ల కొనుగోలు చేసే సమయంలోనే తక్కువ సౌండ్ వచ్చే ఎయిర్ కూలర్‌లను ఎంచుకోవాలి. దీంతోపాటు కూలర్‌లను ఒకచోటు నుంచి మరో చోటుకు తీసుకొనేందుకు వీలుగా వీల్స్ ఉన్న వాటిని కొనుగోలు చేసుకోవాలి.
ఎయిర్ కూలర్ లు ప్రస్తుతం నాలుగు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. పర్సనల్, టవర్ కూలర్లు, విండో కూలర్లు, డిజర్ట్ కూలర్లు. అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవాలి. పర్సనల్ కూలర్లను చిన్న గదుల్లో వినియోగానికి అనువుగా ఉంటాయి. వీటిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం సులభం.
తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రాంతాన్ని చల్లగా మార్చాలంటే టవర్ కూలర్ లు ఉపయోగపడతాయి. మీడియం సైజు గదుల కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. అదే విండో కూలర్‌లు కొంచెం పెద్ద గదులకు అనువుగా ఉంటాయి. ఒకే ప్రాంతంలో ఫిక్సడ్ గా అమర్చాలి. ఈ విండో కూలర్ ఫ్యాన్ ను గదిలోపల, బాడీని గది బయట అమర్చాల్సి ఉంటుంది.
ఇక డిజర్ట్ కూలర్లను పెద్ద గదుల కోసం కొనుగోలు చేయాలి. ఉష్ణోగ్రత అధికంగా ఉండి, హుమిడిటీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలు ఈ డిజర్ట్ కూలర్‌ను ఎంచుకోవాలి. దీంతోపాటు ఐస్ ఛాంబర్ లు ఉండే కూలర్ లు కూడా అందుబాటులో ఉంటాయి. గదిని అత్యంత వేగంగా చల్లగా మార్చేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
ఇక ఫీచర్ ల విషయానికి వస్తే రిమోట్ కంట్రోల్, డస్ట్ ఫిల్టర్, మస్కిటో ఫిల్టర్ లు కలిగిన కూలర్ లను ఎంచుకోవాలి. దీంతోపాటు కూలర్లలో వివిధ రకాల కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి. వూల్ వుడ్, యాస్పెన్, హానీ ప్యాడ్స్ ఉంటాయి. హానీ ప్యాడ్ కూలర్లు కొంచెం అధిక ధరను కలిగి ఉంటాయి కానీ.. తక్కువ సమయంలో గదిని చల్లబరుస్తాయి.


Click it and Unblock the Notifications








