ఎయిర్ కూలర్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఇవి కచ్చితంగా తెలియాలి!
దేశంలో మార్చి తొలి వారం నుంచే అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో అనేక మంది ఎయిర్ కండిషనర్‌లు, కూలర్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఎయిర్ కండిషనర్ (AC) ల కోసం కనీసం రూ.30 వేలు అయినా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఎక్కువ సామర్థ్యం, ఫీచర్లు కలిగిన ఏసీల కోసం మరింత చెల్లించాల్సి ఉంటుంది. అదే కూలర్లు రూ.5 వేల నుంచి అందుబాటులో ఉంటాయి. అయితే ఎయిర్ కూలర్లను (Air Coolers) కొనుగోలు చేసే కొన్ని అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి. అప్పుడే సరైన కూలర్‌ను కొనుగోలు చేయగలుగుతారు.

అనేక అంశాలపై అవగాహన ఉండాలి :
కూలర్లను కొనుగోలు చేసే సమయంలో మీకు ఎలాంటి కూలర్ కావాలి, సామర్థ్యం, ఫీచర్లు, విద్యుత్ వినియోగం వంటి అంశాలపై అవగాహన ఉండడం ఉత్తమం. ఎప్పుడు మీ అవసరాలకు తగిన కూలర్ ను ఎంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.
గది విస్తీర్ణం ఆధారంగా :
ఇంట్లో లేదా కార్యాలయాల్లో గది విస్తీర్ణానికి అనువైన సామర్థ్యం కలిగిన కూలర్ ను ఎంచుకోవాలి. చిన్న గదుల కోసం 15-20 లీటర్లు, అదే కాస్త పెద్ద గది అయితే 25-40 లీటర్లు, మరింత పెద్ద గది అయితే 40 లీటర్ల కంటే అధిక సామర్థ్యం కలిగిన కూలర్లను కొనుగోలు చేయాలి.
నాలుగు రకాల కూలర్లు :
ప్రస్తుతం నాలుగు రకాలయిన కూలర్లు అందుబాటులో ఉండగా.. అందులో మీకు ఎలాంటి మోడల్ కావాలో తెలుసుకోవాలి. ప్రస్తుతం పర్సనల్, టవర్, విండో, డిజర్ట్ కూలర్లు ఉన్నాయి. చిన్న గదులకు పర్సనల్ కూలర్లు సరిపోతాయి. ఇతర ప్రదేశాలకు కూడా వీటిని సులభంగా తీసుకెళ్లవచ్చు.
టవర్, విండో కూలర్లు :
మీడియం సైజు గదులకు టవర్ కూలర్లు అనుకూలంగా ఉంటాయి. ఈ మోడల్స్ తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రాంతాన్ని చల్లగా మార్చేస్తాయి. ఒకేచోట్ల కూలర్ ను అమర్చుకుంటామంటే.. విండో కూలర్ లను ఎంచుకోవచ్చు. కూలర్ ఫ్యాన్ ను గది లోపల, అవుట్‌పుట్ యూనిట్ ను గది బయట అమర్చాల్సి ఉంటుంది.
డిజర్ట్ కూలర్లు :
పెద్ద గదుల కోసం డిజర్ట్ కూలర్లు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, తేమ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ తరహా కూలర్లు సౌకర్యంగా ఉంటాయి. ప్రస్తుతం అనేక కూలర్లు ఐస్ ఛాంబర్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా గది మరింత వేగంగా చల్లగా మారుతుంది.
ఫీచర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి :
గతంతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కూలర్లు అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. రిమోట్ కంట్రోల్, డస్ట్ ఫిల్టర్లు, మస్కిటో ఫిల్టర్లు కలిగిన మోడల్స్ ను ఎంచుకోవడం ఉత్తమం. దీంతోపాటు మెరుగైన కూలింగ్‌ను అందించే కూలింగ్ ప్యాడ్స్ కలిగిన మోడల్స్‌ను కొనుగోలు చేసుకోవాలి.
వీటన్నింటితోపాటు ధర, బ్రాండ్ కూడా చూసి కొనుగోలు చేసుకోవాలి. సర్వీసింగ్ సదుపాయాలు అందించే సంస్థలకు ఎంచుకోవడం కూడా ఉత్తమం. తక్కువ విద్యుత్‌తో మెరుగైన పనితీరు అందించే ఉత్పత్తులను ఎంచుకోవాలి.


Click it and Unblock the Notifications








