మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులుంటే ఎంత జరిమానా చెల్లించాలో తెలుసా.. ఎలా తనిఖీ చేయాలి..?
భారత్‌లో కొత్త టెలికాం చట్టం జూన్ 26, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టంలో సిమ్ కార్డులపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. చట్టం అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే జరిమానా, జైలు శిక్ష విధించేలా స్పష్టమైన నిబంధనలున్నాయి. ప్రస్తుత కాలంలో ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే కొంత మందికి తమ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో కూడా తెలియడం లేదు. అయితే కొత్త చట్టం కింద ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే నేరంగా పరిగణిస్తారు.
దేశంలో వివిధ ప్రాంతాలను బట్టి ఈ సిమ్ కార్డులపై పరిమితులు ఉన్నాయి. ఈశాన్య, జమ్ము మరియు కశ్మీర్, అస్సోం వంటి ప్రాంతాల్లో ఒక సిమ్ కార్డుపై గరిష్ఠంగా 6 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలి. అదే దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ఒక గుర్తింపు కార్డుపై గరిష్ఠంగా 9 కార్డులను కలిగి ఉండవచ్చు.

ఈ పరిమితికి మించి ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే తొలిసారి రూ.50,000 జరిమానా విధిస్తారు. అదే రెండోసారి కూడా ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉంటే రూ.2,00,000 జరిమానా విధిస్తారు. మోసపూరిత విధానంలో సిమ్ కార్డులను కలిగి ఉంటే మాత్రం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా విధించవచ్చు. కొన్ని సార్లు రెండూ విధించవచ్చు.
అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తుల కోసం మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిందిగా టెలికాం మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు ఆయా కార్డులను నిలిపివేయడం, సరెండర్, బదిలీ చేయడం వంటి మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే మీ గుర్తింపు కార్డుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోవడం సహా ఇతర సేవల కోసం టెలికాం మంత్రిత్వ శాఖ సంచార్‌సతి ( Sanchar saathi ) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారో ఈ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చు.
తొలుత సంచార్ సతి వెబ్‌సైట్ ( https://sancharsaathi.gov.in/) లోకి వెళ్లాలి. హోం పేజీలోని Check Mobile Connections పైన క్లిక్ చేయండి. అనంతరం మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయండి. తర్వాత Captcha code ను నమోదు చేయలి. అనంతరం మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేయాలి.
OTP ను ఎంటర్ చేశాక.. సంచార్ సతి వెబ్ సైట్ హోం పేజీలో మీ ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు ఉపయోగించని లేదా మీకు చెందని నంబర్లపై రిపోర్టు చేసేందుకు అవకాశం ఉంటుంది. కొత్త చట్టంలోని కఠినమైన నిబంధనల రీత్యా ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డుపై ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








