అడ్రస్ సమస్యలకు చెక్ పెట్టే DIGIPIN గురించి తెలుసుకోండి.. ఎలా క్రియేట్ చేసుకోవాలి..!
టెక్నాలజీ పరంగా రోజురోజుకు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాం. బ్యాంకింగ్, టెలికాం సహా అనేక విభాగాలు టెక్నాలజీని ఉపయోగించుకొని, మెరుగైన సేవలు అందిస్తోన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. చాలా పనులు మరింత సులభమయ్యాయి. గతంలో కాలింగ్ కోసమే ఉపయోగపడిన ఫోన్‌లను నేడు బ్రౌజింగ్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ కోసం ఉపయోగిస్తున్నాం.
లొకేషన్ షేరింగ్ :
ఏదైనా అడ్రస్ లేదా లొకేషన్ గురించి చెప్పాలంటే గతంలో ఆ ప్రాంతంలోని ప్రముఖ దుకాణాలు, దేవాలయాలు ఆధారంగా కొత్త వారికి మన అడ్రస్ చెప్పేవాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితిలో భారీ మార్పులు వచ్చాయి. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి రావాలంటే వారికి సింపుల్‌గా లొకేషన్‌ను షేర్ చేస్తున్నాం. దీంతో సులభంగా వారు ఇంటికి చేరిపోతున్నారు.

పిన్ కోడ్ ఆధారంగానే :
అయితే పోస్టల్ విభాగం పరంగా ఇంకా పిన్ కోడ్ ఆధారంగానే సేవలు అందిస్తున్నారు. ఏవైనా వస్తువులు పార్శిల్ చేయాలన్నా.. అడ్రస్, పిన్‌కోడ్ అందిస్తున్నాం. అయితే అడ్రస్, పిన్‌కోడ్ కచ్చితంగా ఉన్నా.. సదరు ఇళ్లు లేదా కార్యాలయాలకు పార్శిల్ చేరవేయడం చాలా కష్టంతో కూడుకున్నదిగా ఉంది.
డిజిపిన్ :
ఇతర విభాగాలతోపాటు పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా క్రమంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఇటీవల అనేక సేవలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల డిజిటల్ అడ్రస్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీన్నే డిజిపిన్ (DIGIPIN) గా పిలుస్తోంది. డిజిపిన్ 10 అంకెల అల్ఫాన్యూమరిక్ కోడ్‌గా ఉంటుంది.
వీటి సాయంతోనే :
ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మరియు ఐఐటీ హైదరాబాద్ సాయంతో ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ డిజిపిన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక ప్రాంతం అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఈ పిన్‌ను క్రియేట్ చేస్తుంది. ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్, జియో స్పేషియల్ డేటాను ఉపయోగించుకుంటుంది.
అత్యంత కచ్చితత్వంతో :
డిజిపిన్ కోసం సింపుల్‌గా చెప్పాలంటే జియో కోడెడ్, గ్రిడ్ ఆధారిత డిజిటల్ అడ్రస్ సిస్టమ్. ప్రతి ప్రాంతానికి శాశ్వతమైన డిజిపిన్ ఉంటుంది. పిన్‌కోడ్ తో పోలిస్తే DIGIPIN సాయంతో ఏ అడ్రస్‌ను అయిన అత్యంత కచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఉదాహరణకు మీకు ఏదైనా ప్రాంతానికి పోస్టల్ సర్వీస్ ద్వారా వస్తువును పార్శిల్ చేయాలని భావిస్తే, మీరు సాధారణంగా అందించే అడ్రస్‌తోపాటు డిజిపిన్‌ను కూడా అందించడం ద్వారా సులభంగా అడ్రస్‌ను గుర్తించి, డెలివరీ చేసేందుకు అవకాశం ఉంటుంది.
పోస్టల్ విభాగం వెబ్‌సైట్ ఆధారంగా ఎవరికి వారే తమ ప్రాంతం డిజిపిన్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతానికి కూడా డిజిపిన్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డిజిపిన్ ద్వారా ప్రైవసీకి ఎటువంటి భంగం కలగదని పోస్టల్ విభాగం చెబుతోంది.
డిజిపిన్‌ను ఎలా తెలుసుకోవాలి?
- ఎవరికి వారే స్వయంగా డిజిపిన్‌ను క్రియేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
- ఇందుకోసం పోస్టల్ విభాగం వెబ్‌సైట్ www.indiapost.gov.in లోకి వెళ్లాలి.
- అనంతరం అక్కడ హోం స్క్రీన్‌పైన Know your Pincode ఆప్షన్ కనిపిస్తుంది.
- ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన అనంతరం మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
- అక్కడ Know Your Pincode, Know Your DIGIPIN అనే రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి.
- DIGIPIN ఆప్షన్ పైన క్లిక్ చేయగానే, మీకు ప్రత్యేకంగా మ్యాప్ ఓపెన్ అవుతుంది.
- అయితే DIGIPIN క్రియేట్ చేసుకొనేందుకు వీలుగా మీ లొకేషన్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
- లొకేషన్ అనుమతి ఇవ్వగానే మీరు 10 అల్ఫాన్యూమరిక్ కోడ్ జనరేట్ అవుతుంది.
- ఈ డిజిపిన్‌ను కాపీ చేసుకోవడం, షేర్ చేసుకొనేందుకు కూడా అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications