స్మార్ట్‌ఫోన్ తరచూ వేడెక్కుతోందా... ఇలా మాత్రం చేయవద్దు..!
స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతోందా.. అంటే చాలా మంది అవును అని సమాధానం ఇస్తారు. కానీ ఇందుకు కారణం ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఫోన్ వేడెక్కడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. కొన్ని పద్ధతుల ద్వారా కొంత వరకు ఈ సమస్యకు చెక్‌పెట్టొచ్చు.
ఫోన్ వేడెక్కేందుకు పరిసరాల్లోని వెచ్చని వాతావరణం కూడా ఒక కారణం. లేదా సూర్య కాంతి నేరుగా ఫోన్‌పై పడుతున్నా.. వేడెక్కే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఆ వేడిని ఫోన్ అంతటా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా ఫోన్ వేడెక్కుతుంది.

ఛార్జింగ్ చేస్తున్న సందర్భంలోనూ ఫోన్ సాధారణంగా వేడెక్కుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌ను వినియోగిస్తున్నప్పుడు లేదా ఛార్జింగ్ సమయంలో కొన్ని రకాల యాప్‌లు వినియోగిస్తున్నప్పుడు ఫోన్ వేడెక్కుతుంది. తక్కువ నాణ్యత కలిగిన ఛార్జర్ల వినియోగం వలన కూడా ఫోన్ ఉష్ణోగ్రత పెరగడం మనం గమనించవచ్చు.
ఫోన్ ఉంచిన స్థలంలో అస్సలు గాలి లేకపోవడం, కేస్ డిజైన్ కూడా ఇందుకు కారణం కావచ్చు. సరిగా పనిచేయని బ్యాటరీ కూడా ఫోన్ వేడెక్కేందుకు కారణమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్, వీడియో స్ట్రీమింగ్, వీడియో ఎడిటింగ్, కొన్ని రకాల యాప్‌ల వినియోగం కారణంగా ప్రాసెసర్ మీద ఒత్తిడి పెరిగి కూడా ఫోన్ వేడెక్కుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లోని హార్డ్‌వేర్ సమస్యలు కారణంగా కూడా వేడెక్కే అవకాశం ఉంది. సరిగా పనిచేయని ప్రాసెసర్ కూడా కారణం కావచ్చు. దీంతోపాటు కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. అటువంటి యాప్‌లు CPUను ఎక్కువగా వినియోగిస్తాయి. అందువల్ల కూడా ఫోన్ వేడెక్కుతుంది.
స్మార్ట్‌ఫోన్ మరీ పాతది అయినా త్వరగా వేడెక్కె అవకాశం ఉంటుంది. మీరు ఫోన్‌ను 2 లేదా 3 సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నారా.. అయితే చిన్న చిన్న పనులు కూడా ఆ ఫోన్ ద్వారా చేయలేకపోతే.. స్మార్ట్‌ఫోన్‌ను మార్చేందుకు ఇదే సరైన సమయమని గుర్తించుకోండి.
స్మార్‌ఫోన్ సమస్యలను ఎలా పరిష్కరించాలి: ఫోన్ ప్రాసెసర్ సహా ఇతర యూనిట్లపై అధిక ఒత్తిడి పెంచే యాప్‌ల వినియోగాన్ని పరిమితం చేయడం వల్ల ఫోన్‌ను కూల్‌గా ఉంచుకోవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, ఒకేసారి ఎక్కువ యాప్‌ల వినియోగం మధ్య కొంత విరామం తీసుకోవడం ద్వారా ఫోన్ వేడెక్కకుండా చూడవచ్చు.
ఫోన్‌లో అంతర్గత డ్యామేజీ కారణంగా కూడా ఫోన్ వేడెక్కవచ్చు. అందువల్ల దగ్గరలోని సర్వీస్ సెంటర్ నిపుణుడిని సంప్రదించడం ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. ఫలితంగా ఫోన్ కూల్‌గా ఉంటుంది. ఫోన్ తయారీ సంస్థలు అందిస్తున్న తాజా సాఫ్ట్‌వేర్‌లతో అప్‌డేట్ చేసుకోవాలి. ఈ అప్‌గ్రేడ్‌లు స్మార్ట్‌ఫోన్ పనితీరుని మెరుగుపరుస్తాయి, బగ్స్, ఫోన్ వేడెక్కేందుకు కారణమైన ఇతర సమస్యలను పరిష్కరిస్తాయి.

అధిక ఉష్టోగ్రత, నేరుగా సూర్యకాంతి పడుతున్న ప్రదేశంలో కూర్చొని ఫోన్ వినియోగించకూడదు. దాంతోపాటు సరైన గాలి వచ్చే ప్రాంతంలో ఫోన్‌ను వినియోగించాలి. ఫోన్ కేస్ విషయంలోనూ సరైనది ఎంచుకోవాలి. ఇలా చేస్తే స్మార్ట్‌ఫోన్ వేడెక్కె అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అందించిన ఛార్జర్లను మాత్రమే వినియోగించాలి. మీ ఫోన్ 30W ఛార్జర్‌ను సపోర్టు చేస్తుంది అనుకుందాం.. కానీ మీరు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఛార్జర్‌ను వినియోగించిన సమయంలోనూ ఫోన్ వేడెక్కుతుంది. అందువల్ల సంస్థ అంధించిన ఛార్జర్లనే వినియోగించడం వల్ల ఫోన్ కూల్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








