చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇదే సమస్య.. మరి పరిష్కారం ఏంటి?
స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడం, కొన్నిసార్లు పేలిపోవడం వంటి ఘటనలు గురించి తరచూ వింటుంటాం. ఫోన్‌లు పేలిపోయిన ఘటనల్లో మరణాలు, తీవ్రగాయాలయిన ఘటనలు కూడా చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌లు ఎందుకు వేడెక్కుతున్నాయి.. పేలిపోతున్నాయి?. అయితే ఇందుకు ఏమైనా కారణాలు ఉన్నాయా.. పరిష్కారం ఏంటి?
నకిలీ ఛార్జర్లు కూడా కారణం! :
స్మార్ట్‌ఫోన్‌లు ముఖ్యంగా ఛార్జింగ్ సమయాల్లో అధికంగా వేడెక్కుతుంటాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు ఫోన్‌లు వేడెక్కుతుంటాయి. అయితే అత్యధిక శాతం నకిలీ ఛార్జర్లు కూడా కారణం. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక సంస్థల ఛార్జర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో నకిలీ ఛార్జర్లను గుర్తించడం ఎలా?.

మార్కెట్లో లభిస్తోన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో నకిలీ ఉత్పత్తులను గుర్తించడం చాలా కష్టం. అయితే కొన్ని యాప్‌ల ద్వారా నకిలీ ఉత్పత్తులను గుర్తించవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కు చెందిన ప్రత్యేకమైన యాప్ అందుబాటులో ఉంది.
ఈ యాప్ ద్వారా :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS CARE పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు కొనుగోలు చేసినా లేదా ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ అసలైనదేనా లేదు నకిలీదా అని తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి కూడా తెలుసుకోవచ్చు.
* BIS యాప్ ద్వారా మొబైల్ ఛార్జర్లతోపాటు ఇతర గృహోపకరణాలు, పవర్ బ్యాంకుల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ ఉత్పత్తులపై ఉండే ISI మార్క్ లేదా R- నంబర్ ఆధారంగా, నకిలీ లేదా అసలైనవా తెలుసుకొనేందుకు అవకాశం ఉంది.
* బీఐఎస్ కేర్ యాప్ ప్రస్తుతం ఆపిల్, గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. మీ ఫోన్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక.. మీరు కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఉన్న ISI మార్క్ లేదా R నంబర్ ఆధారంగా, నకిలీ ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చు.
* ఈ యాప్ ద్వారా గుర్తించిన నకిలీ ఉత్పత్తులను, అదే యాప్ ద్వారా ఈ ఉత్పత్తులపై ఫిర్యాదులు చేయవచ్చు. దీంతోపాటు వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేయవచ్చు.
నకిలీ ఉత్పత్తుల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి?
> నకిలీ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ల కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
> కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.
> నకిలీ ఛార్జర్‌తో ఫోన్ బ్యాటరీ పూర్తిగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది.
మీ ఫోన్ ఛార్జింగ్ సమయంలో అధికంగా వేడెక్కుతుంటే, ఈ యాప్ ద్వారా ఛార్జర్ అసలైనదా కాదా అనే తెలుసుకొనే ప్రయత్నం చేయండి. నకిలీ అని తెలిస్తే వినియోగించకుండా పక్కన పెట్టాలి. అనంతరం ఫిర్యాదు చేయాలి. ఫలితంగా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
అయితే మీ ఫోన్ ఛార్జర్ ఒరిజినల్ అయినా, ఫోన్ వేడెక్కుతుంటే, ఫోన్ బ్యాటరీ స్థితిని తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. మరియు ఎక్కువ సంవత్సరాల పాటు ఫోన్ వినియోగిస్తున్నా.. ఛార్జింగ్ సమయంలో వేడెక్కే అవకాశం ఉంది. లేదా మీ ఫోన్ సామర్థ్యం కంటే అధిక ఛార్జింగ్ సామర్థ్యం కలిగిన ఛార్జర్‌ను ఉపయోగించినా ఫోన్ వేడెక్కేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








