Public Wi-Fi పబ్లిక్ వైఫైని ఎక్కువగా వినియోగిస్తున్నారా.. ఇలా చేయకుంటే డేంజర్‌లో ఉన్నట్టే..!!
ప్రయాణాలు సహా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సమీపంలోని పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ను (Public Wi-Fi) ఎక్కువగా వినియోగిస్తుంటాం. అయితే పబ్లిక్ వైఫైను వినియోగిస్తున్న సమయంలో కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే పబ్లి్‌క్ వైఫైను వినియోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై కేంద్ర ప్రభుత్వం సైబర్ టెక్నాలజీ ఏజెన్సీ కీలక సూచనలు చేసింది.
సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌గా వ్యవహరించే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (Cert-in) ఇందుకు సంబంధించి X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది. దీని ఆధారంగా షాపింగ్ మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, హోటళ్లలు సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ వైఫై ని వినియోగించే ముందు వైఫై పేరు సహా ఇతర వివరాలను అక్కడున్న సిబ్బంది ద్వారా ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది.

అదనపు భద్రత కోసం వైఫై సెట్టింగ్స్‌లోని ఆటో కనెక్ట్ ఆప్షన్ ఆఫ్ చేయడం ఉత్తమం. దీంతోపాటు ఎక్కువగా పబ్లిక్ వైఫై ని వినియోగిస్తున్న వారు ఫోన్‌లోని యాంటీ వైరస్‌ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా మెరుగైన భద్రతను పొందవచ్చు. లేకుంటే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది.
దీంతోపాటు ముఖ్యంగా ఓపెన్ నెట్ వర్క్ లేదా పబ్లిక్ వైఫైని వినియోగిస్తున్న సమయంలో సాధ్యమైనంత వరకు బ్యాంకు లావాదేవీలు నిర్వహించకపోవడం ఉత్తమం మరియు సున్నితమైన సమాచారాన్ని వెబ్ సైట్‌లలో నమోదు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ వైఫైను ఉపయోగించాలి. వైఫై ద్వారా మీ పరికరాల్లోకి మాల్ వేర్‌ను పంపి, నేరగాళ్ల నియంత్రణలోకి తీసుకొనే అవకాశం ఉంది.
దీంతోపాటు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇటీవల కీలక సూచనలు చేసింది. బస్టాండ్‌లు, హోటళ్లు, ఎయిర్‌పోర్టులు వంటి ప్రాంతాల్లోని USB ఛార్జింగ్ పోర్టుల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించింది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లను సైబర్ దాడుల కోసం నేరగాళ్లు ఉపయోగిస్తున్నారని వెల్లడించింది.
ఇలాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ చేసేవారి ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లోకి మాల్‌వేర్‌ను పంపేందుకు USB ఛార్జింగ్ పోర్టులను వినియోగిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ఫలితంగా పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు సహా ఇతర వ్యక్తిగత డేటాను కాజేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ దాడులను జ్యూస్ జాకింగ్ అంటారని తెలిపింది.
ప్రమాదకర మాల్ వేర్‌ను పరికరాల్లోకి పంపి ఆయా డివైజ్‌లను తమ నియంత్రణలోకి తీసుకొనే అవకాశం ఉందని హెచ్చరించింది. బస్టాండ్‌లు సహా ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్ పెట్టాలని భావిస్తే ఎలక్ట్రికల్ వాల్ అవుట్ లెట్‌ను మాత్రమే వినియోగించాలని USB ఛార్జింగ్ పోర్టులకు దూరంగా ఉండాలని, లేకుంటే పవర్ బ్యాంకులు సహా ఇతర ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉంటుందని పేర్కొంది.
ఎప్పుడైనా సైబర్ దాడులకు గురైతే వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం అందించాలి. www.cybercrime.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సూచించింది.


Click it and Unblock the Notifications








