డెబిట్ కార్డ్ అక్కర్లేదు.. ఆధార్‌తో మీ UPI పిన్ సెటప్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..
UPI PIN Using Aadhaar: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పుణ్యమా అని డిజిటల్ పేమెంట్స్ చాలా ఈజీ, ఫాస్ట్ అయిపోయాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, బీమ్ లాంటి యాప్స్ వాడుతూ షాపుల్లో పేమెంట్స్, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, బిల్లులు కట్టడం వంటి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇంతకుముందు UPI పిన్ సెట్ చేసుకోవాలంటే డెబిట్ కార్డ్ తప్పనిసరి. అందుకే డెబిట్ కార్డ్ లేని చాలామంది UPI సేవలకు దూరంగా ఉండాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు ఆధార్ కార్డ్ ఉంటే చాలు, క్షణాల్లో UPI పిన్ సెట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే, ఈ ప్రాసెస్‌ని సింపుల్‌గా కొన్ని స్టెప్స్‌లో పూర్తి చేసుకోవచ్చు. దీంతో డిజిటల్ పేమెంట్స్ అందరికీ అందుబాటులోకి వచ్చేస్తాయి.

* ఆధార్‌తో UPI పిన్ సెటప్ చేయడమెలా
స్టెప్ 1: ముందుగా ఫోన్‌లోని UPI యాప్‌ని ఓపెన్ చేయాలి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, బీమ్.. ఏదైనా పర్లేదు. యాప్‌లో "యాడ్ బ్యాంక్ అకౌంట్" అనే ఆప్షన్‌కు వెళ్లాలి. మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్ బ్యాంక్ రికార్డ్స్‌లో, ఆధార్ వివరాల్లో రెండిటిలోనూ సేమ్ ఉండాలి.
స్టెప్ 2: UPI పిన్ సెట్ చేసే దగ్గర మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి ఒకటి డెబిట్ కార్డ్, రెండు ఆధార్ ఓటీపీ. అందులో "ఆధార్ OTP" ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ 12 డిజిట్ల ఆధార్ నంబర్‌ను కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. పొరపాటు లేకుండా చూసుకోండి.
స్టెప్ 3: ఆధార్ నంబర్ ఎంటర్ చేశాక, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTPని యాప్‌లో ఎంటర్ చేసి మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి. వెరిఫికేషన్ అయిపోయాక, యాప్ మిమ్మల్ని UPI పిన్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది.
స్టెప్ 4: ఈ పిన్ 4 లేదా 6 డిజిట్స్ ఉంటుంది. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ లాంటిది ఒక పిన్ సెట్ చేసుకొని, కన్ఫర్మ్ చేయాలి. అంతే సెటప్ కంప్లీట్ అవుతుంది. పాస్‌వర్డ్ ఎవరూ ఊహించని విధంగా ఉంటే మంచిది. బాగా ఆలోచించి బలమైన పాస్‌వర్డ్ పెడితే భవిష్యత్తులో నేరాల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.
* డెబిట్ కార్డ్ లేకుండా UPI వాడకం షురూ..
పిన్ సెట్ చేసుకున్న వెంటనే మీరు మీ UPI యాప్‌తో పేమెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. డబ్బులు పంపడం, తీసుకోవడం, QR కోడ్ స్కాన్ చేసి పే చేయడం, బిల్లులు కట్టడం.. అన్నీ డెబిట్ కార్డ్ లేకుండానే చేసుకోవచ్చు. ఈ ఆధార్ బేస్డ్ సెటప్‌తో UPI పేమెంట్స్ మరింత ఈజీ, అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి.
* వెంటనే రూపే కార్డు తీసుకోవచ్చు..
రూపే క్రెడిట్ కార్డ్‌ని ఇప్పుడు యూపీఐతో లింక్ చేసుకోవచ్చు. ఇందుకు ముందుగా ఫోన్‌లో బీమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేకపోతే ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆపై యాప్ ఓపెన్ చేసి, కనెక్టివిటీ ఆప్షన్‌లో 'క్రెడిట్ కార్డ్' సెలెక్ట్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంకుదో ఆ బ్యాంకుని ఎంచుకోవాలి.
మొబైల్ నంబర్ బ్యాంకులో అప్‌డేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అప్‌డేట్ లేకపోతే చేసుకోవాలి. లింక్ అయిన కార్డ్స్ కనిపిస్తాయి, అందులో రూపే కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. కార్డ్ కరెక్టేనా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. చివరిగా ఒక స్ట్రాంగ్ యూపీఐ పిన్ క్రియేట్ చేసుకొని ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
రూపే క్రెడిట్ కార్డ్స్ వల్ల చాలా లాభాలున్నాయి. దీంతో ఖర్చులు తక్కువ, భద్రత బాగుంటుంది. ఇంకా దేశంలో ఎక్కడైనా ఈజీగా వాడొచ్చు. ఎందుకంటే రూపే ట్రాన్సాక్షన్లు అన్నీ మన దేశంలోనే జరుగుతాయి. రూపే క్రెడిట్ కార్డ్స్‌తో పీఓఎస్ మెషీన్స్‌లో, ఏటీఎంలలో, ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో, ఇంకా ఐవీఆర్ పేమెంట్స్ దగ్గర కూడా చెల్లింపులు చేయొచ్చు.


Click it and Unblock the Notifications








