ఫోన్‌కు బానిసలయ్యారా..? గంటలకొద్దీ టైం వృథా చేసుకోకుండా ఈ సింపుల్ స్టెప్స్‌తో ఆ సమస్యను అధిగమించండి..!
Reduce Screen Time: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, బ్రౌజింగ్ చేయడం.. ఇలా రకరకాల పనులతో మనం ఫోన్ స్క్రీన్‌లకు అతుక్కుపోయి గంటలు గడుపుతున్నాం. మన భారతదేశంలో సగటు మనిషి రోజుకి దాదాపు ఐదు గంటలు ఫోన్‌లోనే గడుపుతున్నాడు. స్మార్ట్‌ఫోన్లు అతిగా వాడితే శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరం.
ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల ఏకాగ్రత తగ్గిపోతుంది, ఆందోళన పెరుగుతుంది, నిద్ర కూడా సరిగా పట్టదు. అందుకే, ఫోన్‌ని లిమిట్‌లో వాడుకోవడం చాలా ముఖ్యం. మీ రోజువారీ స్క్రీన్ టైమ్‌ను ఎలా తెలుసుకోవాలి, ఫోన్ వాడకం తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

* అతిగా ఫోన్ చూస్తే జరిగే నష్టాలు
ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎక్కువసేపు బ్లూ లైట్‌కి గురైతే కళ్ల మంటలు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ గడిపే లేదా గేమ్స్ ఆడటం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, నిరాశ నిస్సృహాలు కూడా కలుగుతాయి.
ఇంకా ఎక్కువ కాలం ఇలాగే చేస్తే డిప్రెషన్, ఆందోళన కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫిజికల్‌గా కూడా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బద్ధకం పెరుగుతుంది, ఊబకాయం వచ్చే ముప్పు పెరుగుతుంది, దాంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. స్క్రీన్ టైమ్ తగ్గించుకుంటే మీ మెదడు చాలా స్పష్టంగా పదునుగా ఆలోచించగలదు. అంతేకాదు, ఆరోగ్యంగానూ ఉంటారు.
* డైలీ స్క్రీన్ టైమ్ ఎలా చెక్ చేసుకోవాలి..
ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి "డిజిటల్ వెల్‌బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్" మీద క్లిక్ చేయండి. అక్కడ డైలీ స్క్రీన్ టైమ్, ఏ యాప్ ఎంతసేపు వాడారు, ఫోన్ ఎన్నిసార్లు అన్‌లాక్ చేశారు అనే డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఒక్కో యాప్ ఎంతసేపు వాడారో వివరంగా చూడాలంటే డాష్‌బోర్డ్ మీద నొక్కాలి.
ఐఫోన్‌లో సెట్టింగ్స్‌కి వెళ్లి స్క్రీన్ టైమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. రోజువారీ, వారానికి ఎంత స్క్రీన్ టైమ్ ఉందో చూడటానికి "సీ ఆల్ యాక్టివిటీ" ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీరు ఏ యాప్ ఎంతసేపు వాడారు, ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి, ఎన్నిసార్లు ఫోన్ తీసుకున్నారు అనే వివరాలు చూడొచ్చు.
* యాప్స్‌లో ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోండి
ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండిట్లోనూ మీరు ఏ యాప్‌లో ఎంత ఎంత సమయం గడుపుతున్నారో చూడొచ్చు. ఆండ్రాయిడ్‌లో అయితే డిజిటల్ వెల్‌బీయింగ్ డాష్‌బోర్డ్‌లో చూడొచ్చు. ఐఫోన్‌లో అయితే స్క్రీన్ టైమ్ > సీ ఆల్ యాక్టివిటీకి వెళ్లి కిందకి స్క్రోల్ చేస్తే యాప్ స్టాట్స్ కనిపిస్తాయి.
* స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడానికి సింపుల్ స్టెప్స్
* యాప్ పరిమితులు పెట్టుకోండి
ఫోన్ ఎక్కువగా వాడుతున్న యాప్స్‌కి టైమ్ లిమిట్ పెట్టుకోవడం చాలా మంచిది. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే, 'డిజిటల్ వెల్‌బీయింగ్'లోకి వెళ్లి, 'డాష్‌బోర్డ్'లో కావాల్సిన యాప్‌ని సెలెక్ట్ చేసుకొని, ఎంతసేపు వాడాలో టైమ్ సెట్ చేసుకోండి. ఐఫోన్ వాడుతుంటే, 'సెట్టింగ్స్'లో 'స్క్రీన్ టైమ్'కి వెళ్లి, 'యాప్ లిమిట్స్'లో యాప్స్ సెలెక్ట్ చేసి, రోజుకి ఎంతసేపు వాడాలో పెట్టుకోవచ్చు.
* ఫోకస్ మోడ్ లేదా డౌన్‌టైమ్ వాడండి
మనల్ని ఫోన్ వైపు లాగే యాప్స్‌ని కొద్దిసేపు ఆపేయడానికి 'ఫోకస్ మోడ్' చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటుంది. ఐఫోన్‌లో 'డౌన్‌టైమ్' ఆప్షన్ ఉంటుంది. ఇది మనం పెట్టుకున్న టైమ్ వరకూ యాప్స్ వాడకుండా ఆపేస్తుంది. చదువుకునేటప్పుడు లేదా పని చేసుకునేటప్పుడు ఇలాంటివి వాడితే ఫోన్ నుంచి తప్పించుకోవచ్చు.
* నోటిఫికేషన్లు ఆపేయండి
అవసరం లేని యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్లు మన దృష్టిని మారుస్తూ ఉంటాయి. వాటిని ఆపేస్తే ఫోన్ చూడాలనే ఆలోచనలు రావు. 'సెట్టింగ్స్'లో 'నోటిఫికేషన్స్'కి వెళ్లి, మీకు అవసరం లేని యాప్స్ నోటిఫికేషన్లు బంద్ చేయండి. ముఖ్యమైన వాటిని మాత్రం ఆన్‌లో ఉంచుకోండి.
* క్రమం తప్పకుండా విరామం తీసుకోండి
'ఫారెస్ట్', 'స్టేఫ్రీ', 'ఆఫ్‌టైమ్' లాంటి యాప్స్ ఉన్నాయి. ఇవి ఫోన్ వాడకాన్ని తగ్గించడానికి, బ్రేక్స్ తీసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని వాడితే ఫోన్‌కి కాస్త దూరం ఉండొచ్చు. మధ్యమధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉంటే కళ్లు కూడా అలసిపోకుండా ఉంటాయి.ఎప్పుడూ ఫోన్‌లోనే కాకుండా బయట ప్రపంచంలో కూడా చాలా పనులు ఉన్నాయి.
పుస్తకాలు చదవటం, వ్యాయామం చేయటం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపటం లాంటివి చేయండి. ఇలా చేస్తే ఫోన్ మీద ఆధారపడటం తగ్గుతుంది. ఫోన్ లేని జీవితం కూడా చాలా బాగుంటుంది. స్క్రీన్ టైమ్ ని ట్రాక్ చేస్తూ, కంట్రోల్ లో పెట్టుకుంటే పనులు తొందరగా అవుతాయి, నిద్ర కూడా మంచిగా పడుతుంది.


Click it and Unblock the Notifications








