ఫోన్ పోయిందా? సంచార్ సాథీతో నిమిషాల్లో బ్లాక్ చేయండి.. మీ డేటా, ఫోటోలు ఇలా సేఫ్ చేసుకోండి!
భారత ప్రభుత్వానికి చెందిన 'సంచార్ సాథీ' పోర్టల్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 75,000 పోయిన ఫోన్లను రికవర్ చేసి ఇచ్చింది. దీనిపై ఆగస్టు 28, 2026న కేంద్ర మంత్రి స్పందిస్తూ.. "సంచార్ సాథీ సీన్‌ను పూర్తిగా మార్చేసింది... ఇది నిజంగా ఒక గేమ్ ఛేంజర్" అని ప్రశంసించారు. దీంతో అసలు ఫోన్ పోతే మొదట ఏం చేయాలి? అనే దానిపై గూగుల్‌లో నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. అందుకే మీ ఫోన్ పోయిన వెంటనే దాన్ని ఎలా బ్లాక్ చేయాలి, ట్రాక్ ఎలా చేయాలి, అలాగే మీ వాట్సాప్, ఫోటోలను ఎలా సేఫ్‌గా ఉంచుకోవాలో తెలిపే సింపుల్ గైడ్ ఇదిగో!
ఇందులో ఉండే 'CEIR' సిస్టమ్ ద్వారా మీ ఫోన్ యొక్క IMEI నంబర్‌ను కేవలం కొన్ని నిమిషాల్లోనే దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో బ్లాక్ చేయవచ్చు. ఆ తర్వాత మీ ఫోన్‌ను ఎవరైనా వాడటానికి ట్రై చేస్తే.. వెంటనే మీకు, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఎస్ఎమ్‌ఎస్, ఈమెయిల్ ద్వారా అలర్ట్‌లు వెళ్తాయి. ఆ రిపోర్ట్‌లో పోలీస్ స్టేషన్ పేరు కూడా ఉంటుంది కాబట్టి ఫోన్‌ను త్వరగా రికవర్ చేయడం ఈజీ అవుతుంది. అంతేకాదు, మీ IMEI నంబర్‌ను ఇతరులు క్లోనింగ్ చేయకుండా, రీసేల్ చేయకుండా ఇది అడ్డుకుంటుంది.

సంచార్ సాథీ CEIR ద్వారా IMEIని ఎలా బ్లాక్ చేయాలి? ట్రాక్ ఎలా అవుతుంది?
ఈ ప్రాసెస్ ప్రారంభించే ముందు మీ ఫోన్ బాక్స్ లేదా బిల్లుపై ఉండే IMEI నంబర్, ఒక గుర్తింపు కార్డు (ID Proof), పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ FIR కాపీ లేదా అక్నాలెడ్జ్‌మెంట్‌ను సిద్ధంగా ఉంచుకోండి. ఆ తర్వాత సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్‌లోకి వెళ్లి 'Block Stolen or Lost Mobile' ఆప్షన్‌ను ఎంచుకోండి. వివరాలన్నీ నమోదు చేసి, ఆధారాలు అప్‌లోడ్ చేశాక OTPతో వెరిఫై చేయండి. ప్రాసెస్ పూర్తయ్యాక వచ్చే 'Request ID'ని జాగ్రత్తగా దాచుకోండి. ఇక మీరు కొత్తగా తీసుకున్న సిమ్ కార్డులో ఎస్ఎమ్‌ఎస్ సర్వీసులు 24 గంటల తర్వాతే యాక్టివేట్ అవుతాయని గుర్తుంచుకోండి.
ఫోన్ బ్లాక్ చేశాక: గూగుల్, ఆపిల్, UPI అకౌంట్లను ఇలా సెక్యూర్ చేసుకోండి!
IMEI బ్లాక్ చేసిన వెంటనే ముందుగా మీ గూగుల్ లేదా ఆపిల్ అకౌంట్ పాస్‌వర్డ్‌లను మార్చేయండి. ఇతర డివైజ్‌లలో ఆ అకౌంట్స్ లాగిన్ అయి ఉంటే వెంటనే సైన్ అవుట్ (Revoke) చేయండి. అలాగే 'Find My Device' లేదా 'Find My' ఫీచర్ సహాయంతో ఫోన్‌ను లాక్ చేసి, 'Mark as Lost' పెట్టండి. అవసరమైతే డేటాను రిమోట్‌గా ఎరేజ్ (Erase) చేయండి. ఆ వెంటనే మీ UPI పిన్‌లను మార్చుకోండి, బ్యాంక్ హెల్ప్‌లైన్ లేదా యాప్ సపోర్ట్‌ను సంప్రదించి సమాచారం ఇవ్వండి. మీ పాత సిమ్ కార్డ్‌ను కూడా బ్లాక్ చేయించండి. గుర్తుపెట్టుకోండి.. రీఫండ్ ఇస్తామని లేదా ఓటీపీ చెప్పమని వచ్చే అనుమానాస్పద కాల్స్‌ను అస్సలు నమ్మకండి.
ఒకవేళ ఫోన్ తిరిగి దొరికితే? వాట్సాప్, ఫోటోల రికవరీ, IMEI అన్‌బ్లాక్ ప్రాసెస్ ఇదిగో!
ఒకవేళ మీ ఫోన్ మళ్లీ దొరికితే, అందులో ఏవైనా మాల్వేర్‌లు ఉంటే పోవడానికి ఫ్యాక్టరీ రీసెట్ (Factory Reset) చేయడం ఉత్తమం. అంతకంటే ముందు ముఖ్యమైన డేటా ఉంటే బ్యాకప్ తీసుకోండి. రీసెట్ చేశాక ఫోన్ ఆన్ అవ్వడానికి మీ గూగుల్ లేదా ఆపిల్ లాగిన్ వివరాలు అడుగుతుంది. ఆ తర్వాత గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ ద్వారా మీ వాట్సాప్ చాట్‌లు, గూగుల్ ఫోటోస్ సింక్ చేసి ఫోటోలను తిరిగ పొందవచ్చు. చివరగా సంచార్ సాథీ వెబ్‌సైట్‌కి వెళ్లి 'Un-Block Found Mobile' ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఫోన్ దొరికినట్లు ఆధారాలు సమర్పించి మీ IMEIని అన్‌బ్లాక్ చేసుకోండి.
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం FIR కాపీ, ఫోన్ కొనుగోలు బిల్లు, CEIR బ్లాకింగ్ అక్నాలెడ్జ్‌మెంట్, రిక్వెస్ట్ ఐడీ మరియు ఫోన్ రికవరీ ప్రూఫ్‌లను రెడీగా ఉంచుకోండి. మీ ఫోన్ స్టేటస్ ఏంటనేది సంచార్ సాథీలోని 'Request Status' ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మీకు వచ్చే ఎస్ఎమ్‌ఎస్, ఈమెయిల్ అలర్ట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ కాపీలను ఆఫ్‌లైన్‌లో కూడా దాచుకోవడం మంచిది. ఫోన్ పోయినప్పుడు ఎంత వేగంగా స్పందిస్తే అంత మంచిది.. కొన్ని నిమిషాల్లో మీరు తీసుకునే త్వరిత నిర్ణయాలు మిమ్మల్ని ఆర్థిక నష్టాల నుంచి కాపాడటమే కాకుండా, ఫోన్ త్వరగా మీ చేతికి వచ్చేలా చేస్తాయి.


Click it and Unblock the Notifications