గూగుల్ AI టూల్‌తో నకిలీ ఆధార్, పాన్ కార్డులు ..నకిలీని ఇలా గుర్తించండి..
AI Scams Alert: టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంగా కొత్త రకం మోసాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన పనులను సులభం చేస్తుంటే, సైబర్ నేరగాళ్లు దీనిని అడ్డం పెట్టుకుని జనాలను మోసం చేసేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కొత్త AI స్కామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గూగుల్ టూల్‌తో నకిలీ ఐడీ కార్డులను సృష్టిస్తున్న ఉదంతాలు బయటపడ్డాయి.
అసలేంటి ఈ కొత్త AI స్కామ్?
గూగుల్ అభివృద్ధి చేసిన 'నానో బనానా' (Nano Banana) అనే అడ్వాన్స్‌డ్ AI ఇమేజ్ మోడల్‌ను ఇప్పుడు స్కామర్లు తమ పనికి వాడుకుంటున్నారు. వాస్తవానికి ఇది రియలిస్టిక్ ఫోటోలు క్రియేట్ చేయడానికి తెచ్చిన టూల్. దీంతో చాలామంది ఇప్పటికే ఎన్నో ఫోటోలు సృష్టించుకున్నారు. ఇది ఎంతో మందికి చేరువైంది.

కానీ, బెంగళూరుకు చెందిన టెక్ నిపుణులు గుర్తించిన దాని ప్రకారం.. కేవలం కొన్ని టెక్స్ట్ కమాండ్స్ ఇస్తే చాలు, ఈ టూల్ అచ్చం నిజమైనవాటిలాగే ఉండే పాన్ కార్డులు, ఆధార్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఎవరికైనా ఐడీ చూపించి మోసం చేయాలనుకునే వారికి ఇది వరంగా మారింది.
డెలివరీ బాయ్స్‌కు టోకరా..
ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదు, ఇప్పటికే మన చుట్టూ జరుగుతున్న మోసం. మెట్రో నగరాల్లో జొమాటో, స్విగ్గీ వంటి డెలివరీ రైడర్లను టార్గెట్ చేస్తున్నారు. ప్రీపెయిడ్ ఆర్డర్లను (డబ్బులు ముందే కట్టినవి) కాజేయడానికి స్కామర్లు ఈ ఫేక్ ఐడీలను లేదా ఫేక్ వెరిఫికేషన్ ఫోటోలను చూపిస్తున్నారు.
డెలివరీ బాయ్స్ హడావిడిగా ఐడీని పైపైన చూసి, అది నిజమే అనుకుని పార్సెల్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత అసలు కస్టమర్ ఫోన్ చేస్తే గానీ మోసం జరిగిందని తెలియడం లేదు. తీరా మోసపోయామని తెలిశాక, డెలివరీ బాయ్స్ లబోదిబోమనడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.
చూసి నమ్మే రోజులు పోయాయి..
ఒకప్పుడు ఐడీ కార్డు చూడగానే అది నకిలీదా కాదా అని చెప్పేయొచ్చు. కానీ ఈ AI టూల్స్ ప్రభుత్వ ఫాంట్లు (Fonts), లోగోలు, డిజైన్‌ను అచ్చుగుద్దినట్లు దించేస్తున్నాయి. గూగుల్‌కు 'SynthID' అనే వాటర్‌మార్క్ టూల్ ఉన్నా, హడావిడిలో ఎవరూ అంత నిశితంగా స్కాన్ చేసి చూడరు. కేవలం కళ్లతో చూసి నమ్మితే మోసపోవడం ఖాయం.
నకిలీ ఐడీని గుర్తించడం ఎలా?
మీరు ఎవరి దగ్గరైనా ఐడీ కార్డు చూస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫేక్ ఐడీల గుట్టు రట్టు చేయవచ్చు. పేర్లు, నంబర్ల దగ్గర అక్షరాలు వంకరగా ఉన్నాయా? లేదా బాక్సుల అంచులు (Edges) సరిగ్గా లేవా అని గమనించండి. ఐడీలోని ఫోటోలో చర్మం మరీ నునుపుగా ఉన్నా, కళ్లు లేదా కనుబొమ్మల్లో అసమానతలు ఉన్నా అనుమానించాలి.
ఫోటోలో నీడలు (Shadows) అసహజంగా ఉన్నాయా, వెనుక బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌గా ఉందా అని గమనించండి. ఒకవేళ ఫోటోలో చేతులు కనిపిస్తే, వేళ్లు వంకరగా ఉన్నాయా అని చూడండి (AI తరచుగా చేతి వేళ్లను సరిగ్గా డిజైన్ చేయలేక తప్పులు చేస్తుంది).
QR కోడ్ అనేది అన్నిటికంటే ముఖ్యం. ఐడీపై ఉన్న QR కోడ్‌ను కచ్చితంగా స్కాన్ చేయండి. ఫేక్ ఐడీ అయితే అది స్కాన్ అవ్వదు లేదా వేరే వింత వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. సీల్స్, హోలోగ్రామ్స్ కూడా బ్లర్‌గా ఉంటె నమ్మకండి.
జాగ్రత్తే ముఖ్యం..
'నానో బనానా' ఇష్యూ ఒక హెచ్చరిక మాత్రమే. AI మోసాలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి, డెలివరీ ఇచ్చేటప్పుడైనా, ఐడీ ప్రూఫ్ తీసుకునేటప్పుడైనా కేవలం కార్డు చూసి నమ్మకుండా, అధికారిక యాప్స్ లేదా వెబ్‌సైట్ల ద్వారా వెరిఫై చేసుకోవడం (Digital Verification) అలవాటు చేసుకోవాలి.


Click it and Unblock the Notifications








