మీ ఫోన్‌ను సర్వీసింగ్ కోసం ఇస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు..!
ప్రస్తుతం టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. వివిధ రకాలుగా వ్యక్తిగత వివరాలను, బ్యాంకింగ్ సమాచారం సహా ఇతర డేటా సేకరించి, మోసాలకు పాల్పుతున్నారు. అందుకే స్మార్ట్‌ఫోన్ లోని డేటాతో అప్రమత్తంగా ఉండాలి. సర్వీస్ సెంటర్‌లో (Smartphone Servicing) స్మార్ట్‌ఫోన్ ను అందించినా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే డేటా చోరీ జరిగే అవకాశం ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌లు డ్యామేజీ లేదా ఇతర కారణాలతో సర్వీస్ సెంటర్‌లలో అందిస్తుంటాం. సంస్థలకు చెందిన అధికారిక సర్వీస్ సెంటర్‌లలో సాధారణంగా సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అనధికారిక సర్వీసింగ్ కేంద్రాల్లో కొన్నిసార్లు డేటా చోరీకి అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవన్నీ బయటకు తీసేయాలి :
డ్యామేజీ లేదా ఫోన్ అప్‌డేట్ చేసేందుకు సర్వీసింగ్ కేంద్రాల్లో స్మార్ట్‌ఫోన్ ను అందిస్తుంటే.. కచ్చితంగా సిమ్ కార్డు, మొమెరీ కార్డులను తీసివేయాలి. దీంతోపాటు కాంటాక్ట్ లిస్ట్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలి. వీటితోపాటు ఫోటోలు, వీడియోలను కూడా ఇతర ప్రాంతాల్లో సేవ్ చేసుకోవాలి.
డేటాను బ్యాకప్ చేసుకోవాలి :
స్మార్ట్‌ఫోన్ లోని డేటాను బ్యాకప్ చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ లో సేవ్ చేసుకోవాలి. దీంతోపాటు బ్యాంకింగ్ యాప్స్, మెయిల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని రకాల సోషల్ మీడియా ఖాతాలను Logout చేసుకోవాలి. దీంతోపాటు ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ కూడా డియాక్టివేట్ చేసుకోవాలి.
గెస్ట్ మోడ్ :
అవకాశం ఉంటే వ్యక్తిగత డేటా పరిరక్షణ కోసం గెస్ట్ మోడ్ లేదా సెకండ్ స్పేస్ ను క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే సదరు సర్వీస్ సెంటర్ టెక్నీషియన్ కు లభిస్తుంది. దీంతోపాటు మీ ఫోన్‌ను సర్వీసింగ్ సెంటర్‌లో అందించాక.. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో జాబ్ షీట్‌ను తీసుకోవాలి.

ఈ ట్రాకింగ్ ఫీచర్లను డియాక్టివేట్ చేయాలి :
డివైజ్ ట్రాకింగ్ ఫీచర్లు అయిన ఫైండ్ మై డివైజ్, ఫైండ్ మై ఐఫోన్ వంటి ఫీచర్లను తాత్కాలికంగా డియాక్టివేట్ చేయాలి. దీంతోపాటు డేటా ప్రొటెక్షన్ కోసం సర్వీసింగ్ సెంటర్ సిబ్బంది ఏయే నిబంధనలు పాటిస్తున్నారో అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
ఈ వివరాలను స్పష్టంగా చెప్పాలి :
ఆర్థికపరంగా చూసుకుంటే ఈ ఫోన్ కు వారంటీ సహా ఇతర గ్యారెంటీలు ఏమైనా ఉంటే.. ఆ విషయాన్ని సర్వీసింగ్ సెంటర్ సిబ్బందికి స్పష్టం చేయాలి. అదనంగా నగదు చెల్లించాల్సి ఉంటుందో లేదో కూడా స్పష్టమైన వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.

సర్వీసింగ్ పూర్తయ్యాక :
సర్వీసింగ్ పూర్తయిన తర్వాత మీ ఫోన్ కు సంబంధించిన అన్ని పాస్‌వర్డ్ ను వెంటనే మార్చుకోవాలి. దీంతోపాటు మీ ఫోన్‌లో అన్ని టాస్క్‌లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవాలి. యాప్ యాక్టివిటీని తనిఖీ చేయాలి. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ మొత్తాన్ని స్కాన్ చేయాలి. దీంతో ఎటువంటి మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయినా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








