పొరపాటున తప్పుడు UPI ID కి నగదు ట్రాన్సాక్షన్ చేశారా.. ఇలా చేస్తే రెండు రోజుల్లోనే నగదు రిఫండ్ వస్తుంది..!
ఇండియాలో డిజిటల్ పేమెంట్ లు భారీగా పెరిగాయి. UPI ద్వారా సులభంగా ట్రాన్సాక్షన్‌లు చేయగలుగుతున్నాం. గతంతో పోలిస్తే చిన్న చిన్న దుకాణాల నుంచి భారీ షాపింగ్ మాల్స్‌లోనూ డిజిటల్ పేమెంట్‌లకు అనుమతిస్తున్నారు. అయితే కొన్నిసార్లు పొరపాటున తప్పుడు UPI ID లకు నగదు బదిలీ జరిగిపోతుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో అనేక మంది యూజర్లు ఆందోళన చెందుతుంటారు. అయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరించుకోవచ్చు.
ఇలా నగదు తిరిగి పొందవచ్చు :
గూగుల్ పే లో (Google pay) మీరు తప్పుడు UPI ID కి నగదు బదిలీ చేస్తే కొన్ని మార్గాల ద్వారా మీ నగదును పొందవచ్చు. అయితే వేగంగా స్పందించాల్సి ఉంటుంది. కస్టమర్ కేర్, NPCI ను సంప్రదించడం లేదా నేరుగా నగదు బదిలీ చేసిన వ్యక్తిని సంప్రదించి, తిరిగి పొందే అవకాశం ఉంది.

డైరెక్ట్ కాల్ చేయండి :
మీరు ఎప్పుడైన గూగుల్ పే ద్వారా తప్పుడు వ్యక్తికి నగదు బదిలీ చేస్తే వెంటనే ఆ వ్యక్తిని సంప్రదించాలి. జరిగిన విషయాన్ని వారికి చెప్పి, మీ నగదును తిరిగి బదిలీ చేయమని కోరాలి. అయితే ఇలాంటి సందర్భాల్లో చాలా మంది నగదు వెనక్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే సదరు వ్యక్తి నుంచి సరైన స్పందన లేకుంటే ఇతర మార్గాల ద్వారా ప్రయత్నం చేయాలి.
కస్టమర్ కేర్ ద్వారా ప్రయత్నం చేయండి :
మీ నుంచి నగదు పొందిన వ్యక్తి నుంచి మీ కాల్స్‌కు స్పందించకపోయినా లేదా నగదు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించినా గూగుల్ పే కస్టమర్ కేర్ ప్రతినిధులను సంప్రదించాలి. 18004190157 నంబర్‌కు కాల్ చేసి వారి అడిగిన వివరాలను అందించాలి.

ఇలాంటి సందర్భాల్లో కస్టమర్ కేర్ ప్రతినిధులకు మీ నుంచి ట్రాన్సాక్షన్ ఐడీ మరియు ట్రాన్సాక్షన్ చేసిన తేదీ, సమయం సహా ఎంత నగదు బదిలీ చేశారనే వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ వివరాల ద్వారా UPI యాప్ తరఫున మీ నగదును తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు.
NPCI కి ఫిర్యాదు చేయండి :
గూగుల్ పే కస్టమర్ కేర్ ప్రతినిధుల ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభించకపోతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం npic.org.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అనంతరం what we do ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ కనిపించిన UPI ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అనంతరం NPCI వెబ్‌సైట్‌లోని Dispute Redressal Mechanism ను క్లిక్ చేయాలి. తర్వాత UPI ట్రాన్సాక్షన్ ఐడీ, బదిలీ చేసిన నగదు మొత్తం, మీ బ్యాంకుల వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 24 నుంచి 48 గంటల మధ్య రిఫండ్ కావాల్సి ఉంటుంది.
నగదు పంపిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి అకౌంట్‌లు ఒకే బ్యాంక్‌కు చెందినట్లయితే మీ నగదు గడువు లోగా తిరిగి వస్తుంది. వేర్వేరు బ్యాంకులు అయితే మాత్రం ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే నగదు పొరపాటున ట్రాన్స్‌ఫర్ చేసిన వెంటనే ఆందోళన చెందకుండా పైన తెలిపిన విధానం ద్వారా నగదును పొందేందుకు ప్రయత్నం చేయాలి.
గూగుల్ పే లేదా ఇతర UPI యాప్‌ల ద్వారా పేమెంట్స్ చేస్తున్న సందర్భాల్లో UPI ఐడీ, ఫోన్ నంబర్‌ను పూర్తిస్థాయిలో దృవీకరించుకోవాలి. QR కోడ్ ద్వారా ప్రయత్నం చేయాలి. మాన్యువల్‌గానే UPI వివరాలను నమోదు చేయాల్సిన సందర్భాల్లో యూజర్ పేరు, బ్యాంకింగ్ వివరాలు తనిఖీ చేయడం ఉత్తమం.


Click it and Unblock the Notifications