వర్షంలో ఫోన్ తడిసిందా? వెంటనే ఈ 60 సెకన్ల జాగ్రత్తలు తీసుకోకపోతే ఫోన్ ఖతం!
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (సెప్టెంబర్ 6న) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఒకవేళ ఈ వర్షాల్లో మీ ఫోన్ తడిసిపోతే... తర్వాతి 60 సెకన్లే చాలా కీలకం! ఆ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే షార్ట్ సర్క్యూట్, తుప్పు పడటం, భారీ మరమ్మతుల ఖర్చుల నుంచి మీ ఫోన్‌ను కాపాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ పూర్తిగా పాడైపోకుండా నివారించడానికి ఈ సింపుల్ మాన్సూన్ టిప్స్ పాటించండి.
ఫోన్ నీళ్లలో పడినా లేదా బాగా తడిసినా ముందుగా దాన్ని వెంటనే స్విచ్ ఆఫ్ చేసి అలాగే ఉంచండి. మళ్లీ ఆన్ చేసేందుకు ప్రయత్నించొద్దు. బటన్లు నొక్కడం, అన్‌లాక్ చేయడం లేదా ఫోన్‌ను గట్టిగా ఊపడం లాంటివి అస్సలు చేయకండి. ఫోన్ కవర్, సిమ్ ట్రే, ఇతర యాక్సెసరీలను మెల్లగా తీసేయండి. పీచులు రాలని కాటన్ లేదా లెంట్-ఫ్రీ గుడ్డతో తడిని తుడవండి. ఈ సమయంలో ఛార్జింగ్ పోర్ట్‌లు కిందకు ఉండేలా పట్టుకోండి. తడి ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే కరెంట్ ప్రసారమై ఫోన్ శాశ్వతంగా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వేడి తగలకుండా, గాలి పారే నీడ ఉన్న ప్రదేశంలో దాన్ని ఉంచండి. ఈ ప్రాథమిక జాగ్రత్తలు ఫోన్ సురక్షితంగా ఆరేందుకు తగిన సమయాన్ని ఇస్తాయి.

తడిసిన ఫోన్ విషయంలో అస్సలు చేయకూడని పనులు: ఛార్జింగ్, బియ్యం, వేడి వద్దు!
ఫోన్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్లు, ఓవెన్లు వాడటం లేదా ఎండలో పెట్టడం వంటివి చేయకండి. వేడి వల్ల తేమ లోపలికి వ్యాపించడమే కాకుండా రబ్బర్ సీల్స్ దెబ్బతింటాయి. ఫోన్‌ను బియ్యంలో పెట్టాలనే అపోహను నమ్మకండి! బియ్యపు ధూళి లోపలికి చేరే ప్రమాదం ఉంది, పైగా బియ్యం చాలా నెమ్మదిగా తేమను పీల్చుకుంటాయి. సహజమైన గాలికి ఆరనివ్వండి లేదా సిలికా జెల్ (డెసికెంట్) ప్యాకెట్లతో ఉన్న ఎయిర్-టైట్ బాక్స్‌లో ఉంచండి. ఫోన్ ఆరడానికి తగినంత సమయం ఇచ్చాకే ఛార్జింగ్ పెట్టండి. సాధారణంగా ఫోన్ ఆరడానికి కనీసం 24 గంటలు, తీవ్రత ఎక్కువగా ఉంటే 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ చేయాలన్నా ఫోన్ పూర్తిగా ఆరిపోయే వరకు ఆగాల్సిందే.
IP రేటింగ్‌లు.. వాటర్ డ్యామేజ్ ఇండికేటర్లు
IP68 రేటింగ్ అంటే ఫోన్ ధూళి పడకుండా ఉండటంతో పాటు సాధారణ నీటిలో దాదాపు 1.5 మీటర్ల లోతులో 30 నిమిషాల పాటు తడిచినా తట్టుకోగలదని అర్థం. అయితే సబ్బు నీరు, సముద్రపు నీరు, ప్రెజర్ జెట్‌లు లేదా పాతబడిన రబ్బర్ సీల్స్ విషయంలో ఇది రక్షణ ఇస్తుందని గ్యారెంటీ లేదు. పైగా కంపెనీలు లిక్విడ్ డ్యామేజ్‌కి వారంటీ ఇవ్వవు. ఐఫోన్‌లలో 'లిక్విడ్ కాంటాక్ట్ ఇండికేటర్లు' ఉంటాయి. నీటి తడి తగలగానే ఇవి ఎరుపు రంగులోకి మారతాయి. సాధారణంగా ఇవి సిమ్ ట్రే లోపల కనిపిస్తాయి. ఫోన్ ఆరిపోయాక కూడా స్పీకర్ ఆడియో సరిగ్గా రాకపోయినా, హెచ్చరికలు వస్తూనే ఉన్నా వెంటనే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.
వాటర్ డ్యామేజ్ తర్వాత డేటా, యూపీఐ (UPI) సేఫ్టీ
ఫోన్ సరిగ్గా పనిచేయకపోతే ముందుగా మీ డేటాను బ్యాకప్ చేసుకుని, టెలికాం ఆపరేటర్ ద్వారా సిమ్ (SIM) బ్లాక్ చేయండి. తడిసిన ఫోన్‌లో యూపీఐ (UPI) సేవలను నిలిపివేయండి. వేరే కొత్త ఫోన్‌లో యూపీఐ రీ-బైండ్ చేసుకునేటప్పుడు మళ్లీ కొత్తగా అనుమతులు (fresh consent) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ UPI PIN రీసెట్ చేయండి, ఆటోపే ఆప్షన్లను ఒకసారి చెక్ చేసుకోండి. పాత ఫోన్‌లో 'UPI Lite' ఉంటే దాన్ని డిజేబుల్ చేస్తే, అందులో ఉన్న బ్యాలెన్స్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. మీరు ఫోన్ రిపేర్ చేయించేలోపు మీ డబ్బు దుర్వినియోగం కాకుండా ఈ జాగ్రత్తలు మిమ్మల్ని కాపాడతాయి.


Click it and Unblock the Notifications
