వాట్సాప్ యూజర్లకు అత్యవసర హెచ్చరిక: ఈ మెసేజ్ క్లిక్ చేస్తే మీ డేటా హ్యాకర్ల చేతుల్లోకి!
భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 2026 ఆగస్టు 30న వాట్సాప్ మాల్‌వేర్‌పై మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఇన్వాయిస్‌లు, బిల్లుల పేరుతో ప్రమాదకర మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపింది. అజాగ్రత్తగా ఒక్క క్లిక్ చేసినా మీ విండోస్ పీసీ వైరస్ బారిన పడటమే కాకుండా.. యాక్టివ్ వాట్సాప్ సెషన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. కాబట్టి ఫోన్ రీసెట్ చేసే ముందే మీ చాట్లు, ఫోటోలను వెంటనే బ్యాకప్ చేసుకోండి. ముందుగానే బ్యాకప్ చేసుకుంటే విలువైన డేటాను కోల్పోకుండా రక్షించుకోవచ్చు. ఆ తర్వాత కింద చెప్పిన స్టెప్స్ ద్వారా రికవరీ చేయండి.
హ్యాకర్లు ఇప్పటికే హ్యాక్ చేసిన మీ పరిచయస్తుల అకౌంట్ల నుంచే "Invoice", "Statement", లేదా "Payment" పేర్లతో ZIP లేదా స్క్రిప్ట్ ఫైళ్లను పంపుతున్నారు. వీటిని ఓపెన్ చేయగానే VBScript రన్ అయి, సిస్టమ్‌లోకి హానికరమైన మాల్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది. రిమోట్ యాక్సెస్ టూల్స్ ద్వారా మీ కంప్యూటర్‌ను, వాట్సాప్ వెబ్‌ను హ్యాకర్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. కాబట్టి తెలిసిన వారి నుంచి మెసేజ్ వచ్చినా సరే, ఫైల్ ఓపెన్ చేసే ముందు ఒకసారి ఫోన్ చేసి నిర్ధారించుకోవడం మంచిది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే ఫైనాన్స్ టీమ్‌లే వీరి ప్రధాన టార్గెట్‌గా మారారు.

వాట్సాప్ డేటా బ్యాకప్, రికవరీ స్టెప్స్ ఇవే..
ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్ (Settings) > చాట్స్ (Chats) > చాట్ బ్యాకప్ (Chat backup)కి వెళ్లాక 'Back up to Google Drive' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. క్లౌడ్‌లో మీ డేటా సురక్షితంగా ఉండటానికి ‘end-to-end encrypted backups’ ఎనేబుల్ చేసుకోండి. అవసరమైతే లేటెస్ట్ లోకల్ 'msgstore' బ్యాకప్ ఫైల్‌ను వేరే సేఫ్ స్టోరేజ్‌లోకి కాపీ చేసుకోండి. ఐఫోన్ యూజర్లు డివైజ్ క్లీన్ చేసే ముందు ఐక్లౌడ్ (iCloud) బ్యాకప్ పూర్తయిందో లేదో చూసుకోండి. గూగుల్ డ్రైవ్ చివరి బ్యాకప్‌ను మాత్రమే సేవ్ చేస్తుందని గుర్తుంచుకోండి. వెంటనే 'Back up now' (బ్యాకప్ చేయండి) పై ట్యాప్ చేయండి.
వైరస్ తొలగింపు: లింక్ చేసిన డివైజ్‌లు, గూగుల్ డ్రైవ్ యాక్సెస్ తొలగించండి ఇలా..
ముందుగా అనుమానాస్పద సెషన్లను తొలగించండి: వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'Linked devices'కి వెళ్లి 'Log out from all devices' ఎంచుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్లలో 'Google Play Protect'తో స్కాన్ చేసి, యాప్‌లను కేవలం అధికారిక యాప్ స్టోర్స్ నుంచే మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. విండోస్ పీసీల్లో 'Microsoft Defender Offline scan' రన్ చేసి మాల్‌వేర్‌ను తొలగించాక సిస్టమ్ అప్‌డేట్ చేయండి. మీ గూగుల్ అకౌంట్‌కు లింక్ అయిన అనవసర యాప్‌ల యాక్సెస్‌ను తీసేయండి. అవసరమైతే డ్రైవ్‌లో అనుమానంగా ఉన్న వాట్సాప్ బ్యాకప్‌ను డిలీట్ చేయండి. చివరగా వాట్సాప్‌ను కొత్తగా రీఇన్‌స్టాల్ చేసుకోండి.
ఫోటోలు, వీడియోల రక్షణ.. సైబర్ దాడిపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
సిస్టమ్ రీసెట్ చేసే ముందే మీ ఫోటోలు, వీడియోలు సేఫ్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ స్టేటస్, ఐఫోన్‌లో 'iCloud Photos' సింక్ అవుతుందో లేదో చూడండి. జియోక్లౌడ్ (JioCloud) యూజర్లు అవసరమైతే ట్రాష్ (Trash) నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఫోన్‌లో SD కార్డ్ ఉంటే బయటకు తీసి, విండోస్ పీసీలో రైట్ క్లిక్ స్కాన్ ఆప్షన్ ద్వారా డిఫెండర్‌తో స్కాన్ చేసిన తర్వాతే తిరిగి వాడండి. ఒకవేళ మీరు ఈ మాల్‌వేర్ బారిన పడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (National Cybercrime Reporting Portal) లో ఫిర్యాదు నమోదు చేయండి. హ్యాకర్ల మెసేజ్‌లు, అనుమానాస్పద ఫోన్ నంబర్ల ఆధారాలను భద్రపరుచుకోవడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications