వాట్సాప్‌లో 'No' అని రిప్లై ఇచ్చారా? మీ బ్యాంక్ అకౌంట్ క్షణాల్లో ఖాళీ అవ్వొచ్చు, జాగ్రత్త!
పండుగల సేల్స్ వేళ హడావుడిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఎలాంటి లింకులు గానీ, OTPలు గానీ అవసరం లేకుండానే వాట్సాప్ ద్వారా అకౌంట్ ఖాళీ చేసే కొత్త సైబర్ ఫ్రాడ్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు ఒక ఫేక్ డిబిట్ మెసేజ్ వస్తుంది. అది మీరు చేయకపోతే జస్ట్ "No" అని రిప్లై ఇవ్వాలని అందులో ఉంటుంది. తీరా ఆ ఒక్క "No" అని రిప్లై ఇవ్వగానే క్షణాల్లో అకౌంట్‌లోని డబ్బులు మాయమవుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త తరహా ఫ్రాడ్‌పై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లకు అస్సలు స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు.
అసలు OTP లేకుండానే ఇది ఎలా సాధ్యమవుతోందనే అనుమానం రావచ్చు? ఇది ఏమీ మ్యాజిక్ కాదని, యూజర్లను మాటల్లో దింపడమే (engagement) ప్రధాన వ్యూహమని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. మీరు "No" అని మెసేజ్ చేయగానే, మీ నంబర్ యాక్టివ్‌గా ఉందని నేరగాళ్లకు తెలిసిపోతుంది. దాంతో మీపై ఒత్తిడి తెచ్చి, ఫాలో-అప్ కాల్స్ చేయడం ప్రారంభిస్తారు. మరోవైపు వాట్సాప్ వెబ్, డివైజ్ లింకింగ్ ఫీచర్లను నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు హెచ్చరికలు ఉన్నాయి. డెస్క్‌టాప్ యూజర్లే లక్ష్యంగా మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని CERT-In కూడా హెచ్చరించింది. హ్యాకర్లు మీ వాట్సాప్ సెషన్‌ను హైజాక్ చేసి, మీ పేరుతో ఇతరులను మోసం చేయడం లేదా 'వెరిఫికేషన్' నెపంతో డేటాను కాజేస్తున్నారు. ఇలా హ్యాక్ చేసిన వాట్సాప్ వెబ్ సెషన్ల ద్వారా ‘బాస్ స్కామ్’ (boss scam) నడుపుతున్నట్లు ప్రభుత్వ హెచ్చరికలు పేర్కొంటున్నాయి.

వాట్సాప్ ‘No’-రిప్లై డెబిట్ స్కామ్ ఎలా పనిచేస్తుంది?
ముందుగా మీ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు కట్ అయినట్లు, వెంటనే స్పందించాలంటూ ఒక మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు "No" అని రిప్లై ఇస్తారో, వెంటనే సైబర్ కేటుగాళ్లు మీకు "సహాయం" చేస్తున్నట్లు నటిస్తారు. మీ వివరాలను "వెరిఫై" చేయాలంటూ మాటల్లోకి దించుతారు లేదా అప్పటికే లింక్ అయి ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్‌ను వాడుకుని అకౌంట్‌ను ఖాళీ చేస్తారు. ఇందులో ఎక్కడా లింకులు గానీ, OTPలు గానీ రాకపోవడంతో బాధితులకు ఎలాంటి అనుమానం రాదు. అధికారులు ఈ స్కామ్ వెనుక ఉన్న పూర్తి సాంకేతికతను విశ్లేషిస్తున్నారు. అందుకే వాట్సాప్‌లో వచ్చే ప్రతీ మెసేజ్‌ను అస్సలు నమ్మకండి.
వాట్సాప్‌లో ఒకవేళ ‘No’ అని రిప్లై ఇస్తే.. వెంటనే ఈ పనులు చేయండి!
ఒకవేళ మీరు పొరపాటున రిప్లై ఇస్తే తక్షణమే స్పందించండి. మొదట డేటా కనెక్షన్ కట్ అయ్యేలా ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్ (Airplane mode) లో పెట్టండి. ఆ తర్వాత వాట్సాప్‌లో Settings లోకి వెళ్లి, Linked Devices ఓపెన్ చేసి, మీకు తెలియని సెషన్స్ అన్నింటి నుంచీ వెంటనే 'Log Out' అవ్వండి. వాట్సాప్‌కు టూ-స్టెప్ వెరిఫికేషన్ (Two-step verification) ఎనేబుల్ చేసుకుని స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోండి. వెంటనే మీ యూపీఐ (UPI) పిన్‌లను మార్చండి, నెట్‌బ్యాంకింగ్‌ను ఫ్రీజ్ చేయండి. తాత్కాలికంగా కొత్త బెనిఫిషియరీల చేరికను నిలిపివేయండి. మీ బ్యాంకింగ్ యాప్ లేదా NPCI టూల్స్ ద్వారా యూపీఐ ఆటోపే (UPI AutoPay) మ్యాండేట్‌లను ఒకసారి చెక్ చేసుకుని, అనుమానాస్పదంగా ఉన్నవాటిని రద్దు చేయండి.
వాట్సాప్, UPI సెక్యూర్ చేసుకోండి.. వెంటనే 1930కి ఫిర్యాదు చేయండి!
ఒకవేళ అకౌంట్ నుంచి డబ్బులు పోతే, అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో కంప్లైంట్ ఇవ్వండి. పోలీసుల విచారణ కోసం వాట్సాప్ చాట్ హిస్టరీ, స్క్రీన్‌షాట్లు, బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను సురక్షితంగా ఉంచండి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days), అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) వంటి సేల్స్ సమయంలో వాట్సాప్‌లో వచ్చే పేమెంట్ అలర్ట్‌లను పూర్తిగా విస్మరించండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను కేవలం అధికారిక బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్‌ల ద్వారా మాత్రమే సరిచూసుకోండి. వాట్సాప్ ఎన్ని సెక్యూరిటీ అప్‌డేట్‌లు తెచ్చినా, మన వ్యక్తిగత జాగ్రత్తే అత్యంత ముఖ్యం. వేగంగా ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మీ ఫిర్యాదు టికెట్ నంబర్‌ను బ్యాంక్‌కు అందించి రికవరీ ప్రాసెస్ ప్రారంభించండి.


Click it and Unblock the Notifications
