ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నకిలీ కాల్... రూ.1.4 లక్షలు దోపిడీ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీని వినియోగించుకొని ప్రముఖ నటి రష్మిక నకిలీ వీడియోను తయారు చేసి వైరల్ చేశారు. ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం అయితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపించింది.
నటి రష్మిక మందాన్న : ఈ డీప్‌పేక్ వీడియోపై నటి రష్మిక మందాన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రష్మిక మందాన్నకు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. సోషల్ మీడియా సంస్థలకు కీలక రిమైండర్‌ను పంపింది.

మరో ఘటనలో కోల్ ఇండియా మాజీ ఉన్నతోద్యోగిని సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా స్నేహితుడి మాదిరిగా వీడియో కాల్ చేసి రూ.4౦ వేలు దోచుకున్నారు. మరికొంత నగదు కావాలని కోరడంతో సదరు మాజీ ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు.
అయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేక్ వాయిస్ కాల్ చేసి ఓ మహిళను మోసం చేశారు. కెనడాలో ఉన్న 59 సంవత్సరాల మహిళ మేనల్లుడి వాయిస్‌ను అనుకరించారు. తనకు తక్షణ అవసరం ఉందని చెప్పి ఆమె వద్ద నుంచి రూ.1.4 లక్షల నగదును దోచుకున్నారు. ఈ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఎలాంటి కాల్స్ వస్తాయి : కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మాదిరిగా కాల్ చేస్తారు. అత్యవసరంగా డబ్బు పంపాలని కోరతారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ శాతం మంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది. వ్యక్తిగతంగా వారితో మాట్లాడి వారికి నిజంగా అవసరం ఉంటే అప్పుడే నగదు బదిలీ చేయడం ఉత్తమం.
కస్టమర్ సర్వీస్ సిబ్బందిగా నటించడం : సైబర్ నేరగాళ్లు కొన్నిసార్లు కస్టమర్ కేర్ సభ్యులుగా కాల్ చేస్తారు. బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు టీంకు చెందిన వారిగా మాట్లాడతారు. వ్యక్తిగత సమాచారాన్ని ధృవీకరించమని లేదా చెల్లింపులు చేయాలని కోరతారు. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలి.
ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ : ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ కాల్ చేస్తారు. సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ లేదా ఐఆర్‌ఎస్ వంటి సంస్థల పేరు చెప్పి కాల్ చేయవచ్చు. బెదిరించి లేదా ఇతర విధాలుగా మాట్లాడి నగదు డిమాండ్ చేయవచ్చు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి..
కాల్స్ చేసిన వ్యక్తి వివరాలు కచ్చితంగా తెలియకుంటే ఫోన్‌లో వ్యక్తిగత వివరాలు వెల్లడించకూడదు. దాంతోపాటు అత్యవసరంగా డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం అడిగే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయండి. అప్పుడే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండగలుగుతారు.


Click it and Unblock the Notifications