‘మొబైల్ యూజర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు’

Posted By: Super

‘మొబైల్ యూజర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు’

 

మాజీ టెలికాం మంత్రి రాజా హయాంలో జారీచేసిన 122 టెలికాం లైసెన్స్‌లను సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. ఆయా కంపెనీల సర్వీసులు పొందుతున్న మొబైల్ ఫోన్ కస్టమర్ల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి సచిన్ పైలట్ చెప్పారు. లైసెన్స్‌లు రద్దు కావడం వల్ల దాదాపు 8 కోట్ల మంది మొబైల్‌ఫోన్ వినియోగదారులకు సర్వీసులు నిలిచిపోనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నామని, ప్రతి వినియోగదారుకు తాము సహాయ సహకారాలు అందించనున్నట్టు పైలట్ చెప్పారు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో కొత్త టెలికాం కంపెనీల సర్వీసులు ఇప్పటికిప్పుడు నిలిచిపోవని, నాలుగు నెలల తరువాతనే ఈ కంపెనీల సేవలు రద్దు కానున్నట్టు ఆయన చెప్పారు. ఆలోపు ఈ కస్టమర్లు వేరే ఆపరేటర్‌కు మారిపోవచ్చని అన్నారు. సోమవారం బెంగుళూరులోని ఇండియా సెమికండక్టర్ అసోసియేషన్ (ఐఎస్ఎ) ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పైలెట్ మాట్లాడారు. 2జి కుంభకోణం నేపథ్యంలో వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు వల్ల మొబైల్ ఫోన్ వినియోగదారులపై ప్రభావం తక్కువగా ఉంటుందని, లైసెన్స్‌లు రద్దయిన కంపెనీల కస్టమర్లు మొబైల్ నంబర్ పోర్టబులిటీ ద్వారా ఇతర కంపెనీలకు సులువుగా మారిపోవచ్చని అన్నారు.

గత వారంలో 122 కొత్త లైసెన్స్‌లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ లైసెన్సుల్లో యునినార్ (22 లైసెన్సులు), లూప్ (21), సిస్టెమా శ్యామ్ (21), ఎటిసలాట్ డిబి (15), ఎస్ టెల్ (6), వీడియోకాన్ (21), టాటా (3), ఐడియా సెల్యులార్ (9)లకు చెందినవి ఉన్నాయి. ఇదిలా ఉంటే లైసెన్స్‌లు పొందడానికి, సర్వీసులను విస్తరించడానికి తాము భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు టెలికాం కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. 12,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని సిస్టెమా శ్యామ్ చెబుతుంటే.. ఇప్పటికే 6,100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు టెలినార్ అంటోంది. తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని ఈ కంపెనీలు అంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot