నోకియాను ఓవర్‌టేక్ చేసిన యాపిల్‌, శాంసంగ్‌

Posted By: Super

నోకియాను ఓవర్‌టేక్ చేసిన యాపిల్‌, శాంసంగ్‌

దాదాపు 15 ఏళ్లుగా 'కనెక్టింగ్ పీపుల్' అంటూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన 'నోకియా' ఇప్పుడు 'డిస్కనెక్టింగ్ పీపుల్' అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్లో పెరిగిన పోటీ, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మొబైల్ కంపెనీలు, కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటివి నోకియా పతనానికి కారణమయ్యాయి. అంతేకాకుండా.. యాపిల్ ఐఫోన్ ప్రపంచ వ్యాప్తంగా హిట్ కావడం మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో శాంసంగ్ అందిస్తున్న గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 'నోకియా' సిగ్నల్స్‌కు జామర్‌లుగా మారాయి.

ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ ఐడిసి ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2)లో నోకియా కన్నా యాపిల్‌, శాంసంగ్‌ కంపెనీలే అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించాయి. గడచిన ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో యాపిల్‌ సంస్థ రికార్డు స్థాయిలో 2.03 కోట్ల ఐ-ఫోన్‌లను విక్రయించి ప్రథమ స్థానంలో నిలువగా, ఇదే సమయంలో శాంసంగ్‌ 1.9 కోట్ల ఫోన్ల అమ్మకాలతో ద్వితీయ స్థానానికి చేరుకొని నోకియాను మూడో స్థానంలోకి నెట్టేశాయి. ఈ సమయానికి నోకియా కేవలం 1.67 కోట్ల ఫోన్లను మాత్రమే విక్రయించి గలిగినట్లు ఐడిసి పేర్కొంది.

మార్కెట్లో నోకియా వెనుకబడటానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు ఎక్కువగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మొబైల్ ఫోన్లపై ఆసక్తి చూపుతుంటే నోకియా మాత్రం తన స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ సింబయాన్‌తో పాత చింతకాయ పచ్చడిలా ఉపయోగిస్తుంది. అంతేకాకుండా నోకియా స్మార్ట్‌ఫోన్ ధరలు కూడా సామాన్యులకు అందంత ఎత్తులో ఉంటాయి. దీనికి తోడు ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశిస్తున్న చిన్నా చితకా మొబైల్ కంపెనీలు తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లను కలిగిన మొబైల్ ఫోన్లను అందిస్తుండటం నోకియాను వెనక్కు నెట్టిందని చెప్పవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot