ఇకపై మోటరోలా ఫోన్లు కాదు.. గూగుల్ ఫోన్లు

Posted By: Super

ఇకపై మోటరోలా ఫోన్లు కాదు.. గూగుల్ ఫోన్లు

ఈ ఏడాది జనవరిలో మోటరోలా మొబిలిటీ మరియు మోటరోలా సొల్యుషన్స్ అనే రెండు కంపెనీలుగా విడిపోయిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలాలోని 'మోటరోలా మొబిలిటీ' (మొబైల్ ఫోన్లను తయారు చేసే విభాగం) విభాగాన్ని అంతర్జాల దిగ్గజం గూగుల్ తన వశం చేసుకుంది. ఈ డీల్‌కు గూగుల్ భారీగా 1,250 కోట్ల అమెరికన్ డాలర్లను చెల్లించి మోటరోలా మొబిలిటీని సొంతం చేసుకుంది. ఈ మేరకు ఇరు కంపెనీలు ఒక ఉమ్మడి ప్రకటనను వెలువరించాయి. ఈ డీల్‌కు రెండు కంపెనీలు బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ ఆమోదం కూడా లభించినట్లు సదరు కంపెనీలు పేర్కొన్నాయి.

ఈ డీల్ ప్రకారం, మోటరోలా మొబిలిటీ యొక్క ప్రతి షేరుకి గూగుల్ 40 డాలర్ల చొప్పున లేదా మొత్తం డీల్‌కు 1,250 కోట్ల డాలర్లు చెల్లించి కొనుగోలు చేస్తుంది. నియంత్రణ సంస్థలు అనుమతులిస్తే ఈ ఏడాది చివరినాటికి గానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో గానీ ఈ ఒప్పంద ప్రక్రియ తుది దశకు చేరుకుంటుంది. ఈ వాటాల కొనుగోలు అనంతరం కూడా ఆండ్రాయిడ్ ప్రధాన లెసైన్సుదారుగా మోటరోలా మొబిలిటీనే ఉంటుందని, ప్రత్యేక వ్యాపార సంస్థ గానే కొనసాగుతుందని ఇరు కంపెనీలు వెల్లడించాయి. ఆగస్టు 12 నాటి మోటరోలా మొబిలిటీ షేరు ధరకు 63 శాతం ప్రీమియం రేటును గూగుల్ చెల్లించనుంది. ఇది పూర్తిగా నగదు లావాదేవీగానే ఉంటుంది.

ఈ డీల్ ద్వారా మొబైల్ కంప్యూటింగ్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుందని గూగుల్ సీఈవో ల్యారీ పేజ్ అన్నారు. ఈ లావాదేవీతో తమ వాటాదార్లు, ఉద్యోగులకు కూడా మరిన్ని ప్రయోజనాలు లభించగలవని మోటరోలా చైర్మన్ భారతీయ సంతతికి చెందిన సంజయ్ ఝా చెప్పారు. గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్ఠమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు వంటి పరికరాలను మోటరోలా తయారు చేస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot