యాపిల్‌ లాభం సెకనుకు రూ 82,795

Posted By:

యాపిల్‌ లాభం సెకనుకు రూ 82,795

 

ఆర్థిక మాంద్యం నుండి ఎలా బయటపడాలా అని యూరోజోన్‌ మార్కెట్లు ప్లాన్స్ వేస్తుంటే ఆపిల్‌ కంపెనీ మాత్రం గతయేడాది చివరి త్రైమాసికంలో సెకనుకు 82,795 రూపాయల (1,670 డాలర్లు) లాభాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆపిల్‌ వద్ద ఉన్న మిగులు నిధులను ఉపయోగించి మొత్తం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను, ప్రభుత్వ రంగ సంస్ద అయిన ఒఎన్‌జిసిలో 90 శాతానికన్నా ఎక్కువ మొత్తాన్ని కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం సంస్థ మార్కెట్‌ వాల్యూ 400 బిలియన్‌ డాలర్లు (సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు)గా ఉంది. వెనిజులా వార్షిక స్థూల జాతీయతోత్పత్తి కన్నా ఇది అధికం. మూడవ త్రైమాసికంలో యాపిల్‌ లాభాలు 13.1 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు ఆదాయాలతో పాటు రెట్టింపు లాభాలనూ నమోదు చేసింది. 2011 ఆర్థిక సంవత్సరంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఐబిఎం ఆదాయం 106 బిలియన్‌ డాలర్లయితే, 35 సంవత్సరాలుగా సాగుతున్న యాపిల్‌ ఆదాయం 108 బిలియన్‌ డాలర్లు.

1981లో యాపిల్‌ ఆదాయం 335 మిలియన్లుగా ఉండగా, ఐబిఎం ఆదాయం 29 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. ఆ సమయంలో యాపిల్‌ కంప్యూటర్‌కు పోటీగా ఐబిఎం పిసిని విడుదల చేసింది. స్టీవ్‌ జాబ్స్‌ 'వెల్‌కం ఐబిఎం. సీరియస్‌లీ' అంటూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు ఫుల్‌ పేజి ప్రకటనను ఇచ్చారు. అక్టోబర్‌ 2010తో ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్‌ ఆదాయాలను అధిగమించిన యాపిల్‌ ఐఎన్‌సి ఒక సంవత్సరం తిరిగేసరికి మైక్రోసాఫ్ట్‌ రెవెన్యూలకు రెట్టింపును ఖాతాల్లో వేసుకుంది.

అమేజాన్‌ విక్రయించిన కిండెల్‌ ఫైర్స్‌ కన్నా మూడు రెట్ల అధిక ఐపాడ్‌ అమ్మకాలను యాపిల్‌ సాధించి పోటీ పరుగులో తనకు ఎదురులేదని చాటింది. ఒక్క ఐట్యూన్‌ స్టోర్స్‌ నుంచే యాపిల్‌కు 50 శాతం ఆదాయం లభించింది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఇంటర్నెట్‌ దిగ్గజం యాహూ ఆదాయాలతో పోలిస్తే ఇదే అధికం. ఒక్క ఐఫోన్‌ అమ్మకాలతో వచ్చిన ఆదాయం మైక్రోసాఫ్ట్‌ పూర్తి ఆదాయాల కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ త్రైమాసికంలో యాపిల్‌ లాభాలు గూగుల్‌ మొత్తం ఆదాయానికి సమానం. మొత్తం 46.33 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసిన యాపిల్‌ నికర లాభం 13.1 బిలియన్‌ డాలర్లు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot