ఇండియాకు HTC గుడ్‌బై, షియోమికి షాకిచ్చేలా రీ ఎంట్రీ !
ఇండియాలో మొబైల్ మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియాలో పాగా వేయాలని కసరత్తులు చేస్తుంటే తైవాన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HTC సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇండియాలో మొబైల్ మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియాలో పాగా వేయాలని కసరత్తులు చేస్తుంటే తైవాన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HTC సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దిగ్గజం ఇండియా మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్త నిజమైతే ఇండియా మార్కెట్ నుంచి వైదొలిగిన తొలి కంపెనీగా హెచ్‌టీసీ నిలవనుంది. కాగా షియోమికి షాకిచ్చేలా సరికొత్తగా రీ ఎంట్రీ కోసమే హెచ్‌టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

రాజీనామా పరంపరలు
హెచ్‌టీసీ టాప్ మేనేజ్‌మెంట్ కంట్రీ హెడ్ సిద్ధిఖీ, సేల్స్ హెడ్ విజయ్ బాలచంద్రన్, ప్రొడక్ట్ హెడ్ ఆర్.నయ్యర్ ముగ్గురూ ఒకేసారి రాజీనామా చేసినట్టు ఈటీ రిపోర్ట్ చేసింది.

70 నుంచి 80 మంది ఉద్యోగులకు..
వీరితోపాటు కంపెనీ చీఫ్ ఫైనాన్షియర్ అయిన రాజీవ్ దయాల్‌ను కూడా వెళ్లిపొమ్మని కంపెనీ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మరో 70 నుంచి 80 మంది ఉద్యోగులకు కూడా కంపెనీ సెటిల్‌మెంట్ చేస్తుందని వెల్లడైంది.

నాలుగేళ్లుగా నష్టాల్లో..
గత మూడు, నాలుగేళ్లుగా నష్టాల్లో ఉన్న కంపెనీని ఇక గట్టెక్కించలేమని నిర్ణయానికి వచ్చిన తర్వాత.. మొత్తం కంపెనీని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి సేల్స్ కూడా నిలిపివేస్తుందని తెలిసింది.

ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ద్వారా..
అయితే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వాలని కూడా కంపెనీ యోచిస్తోందని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

పూర్తిగా అమ్మకాలను నిలిపివేసిన తర్వాతే..
కానీ పూర్తిగా అమ్మకాలను నిలిపివేసిన తర్వాతే, ఆన్‌లైన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని తెలిపారు. అది కూడా తైవాన్ నుంచే ఆపరేట్ చేస్తుందని చెప్పారు.

చైనా స్మార్ట్‌ఫోన్ల నుంచి పోటీ
చైనా స్మార్ట్‌ఫోన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేకపోవడం వల్ల హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. ఈ కారణంతో చాలా మార్కెట్లలో హెచ్‌టీసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ తయారీ యూనిట్లను మూసివేస్తూ వస్తోంది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు కూడా చేపట్టింది. ఇప్పుడు ఏకంగా భారత్‌లో అమ్మకాలనే బంద్ చేయాలని నిర్ణయించిందని ఈటీ రిపోర్ట్ చేసింది.

ఈ వార్తలపై
అయితే హెచ్‌టీసీ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను నిలిపివేయబోతుందని వస్తున్న వార్తలపై హెచ్‌టీసీ అధికార ప్రతినిధి స్పందించారు. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను కొనసాగిస్తామని చెప్పారు.

భారత్‌లో పెట్టుబడులు..
హెచ్‌టీసీకి భారత్ చాలా ముఖ్యమైన మార్కెట్ అని, భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తామన్నారు. తాజాగా భారత ఆఫీసులో చేపట్టిన వర్క్‌ఫోర్స్ తగ్గించడం లాంటి వాటితో, కంపెనీని మరింత సమర్థవంతంగా తీర్చుదిద్దుతామని, వృద్ధి, ఆవిష్కరణలో ఇదో కొత్త స్టేజ్ అని చెప్పారు.

రెండున్నర ఏళ్లలో ఇదే భారీ పతనం
ఇదిలా ఉంటే గ్లోబల్‌గా హెచ్‌టీసీ విక్రయాలు ఏడాది ఏడాదికి 68 శాతం మేర తగ్గాయి. రెండున్నర ఏళ్లలో ఇదే భారీ పతనం. గ్లోబల్‌గా 1500 మేర వర్కర్లను తీసేయబోతున్నట్టు కంపెనీ ప్రకటన కూడా చేసింది.

1 శాతం కంటే తక్కువ మార్కెట్ ..
భారత్‌లో హెచ్‌టీసీకి కేవలం 1 శాతం కంటే తక్కువ మార్కెట్ షేరే ఉంది. శాంసంగ్,ఆపిల్, చైనా వన్‌ప్లస్, షియోమిలు భారత మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. మరి ఈ తైవాన్ కంపెనీ వీటికి ధీటుగా ఇండియా మార్కెట్లోకి రీ ఎంట్రీ ఎలా ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications








