ఐఫోన్ 16e: కొత్త మోడల్, పాత ఫీచర్లు.. యాపిల్ మసిబూసి మారేడుకాయ చేస్తుందా..?
iPhone 16e: ప్రముఖ ప్రీమియం ప్రొడక్ట్‌ల తయారీదారు యాపిల్ ఐఫోన్ SE సిరీస్‌కు మంగళం పాడి, సరికొత్త 'ఐఫోన్ 16e’ మోడల్‌ను మార్కెట్‌లోకి దించేసింది. అంతేకాదు, ఐఫోన్ SE, ఐఫోన్ 14 మోడళ్లను అమ్మకాల లిస్టు నుంచే మాయం చేసింది. మరి ఈ కొత్త ఫోన్‌లో ఏముంది? ఏం లేదు? చూద్దాం. ఐఫోన్ 16e కొత్త ఐఫోన్ల కంటే తక్కువ ధరకే వస్తున్నా, ఇదివరకు SE మోడల్స్‌తో పోలిస్తే మాత్రం రేటు బాగా పెరిగిపోయింది.
ఇండియాలో దీని ధరలు 128GB వేరియంట్ రూ.59,900, 256GB వేరియంట్ రూ.69,900, 512GB రూ.89,900గా ఉన్నాయి. ఒకప్పుడు యాపిల్ కంపెనీ ఎస్‌ఈ మోడల్స్‌ని ప్రస్తుత మార్కెట్ల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా ప్రచారం చేసింది. కానీ 16e ధరలు చూస్తే మాత్రం, వాళ్ల ప్లాన్ పూర్తిగా మారిపోయినట్టే ఉంది.

ధరలు పెంచకుండా చాలా ఏళ్లు నెట్టుకొచ్చిన యాపిల్, ఇప్పుడు మాత్రం లాభాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుంది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడటం వాళ్లకు ఇష్టం లేనట్టుంది. అంత మాత్రం దానికి ఈ లైట్ వెర్షన్ ఎందుకు తీసుకొచ్చినట్టు? ఇదంతా యాపిల్ వేసిన మాస్టర్ ప్లాన్ అని టెక్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు.
* ఏంటా మాస్టర్ ప్లాన్
యాపిల్ కంపెనీ ఇప్పుడు "గుడ్-బెటర్-బెస్ట్" అనే కొత్త ఆట ఆడుతోంది. ఐఫోన్ 16e ధర దాదాపు 60 వేల నుంచి మొదలవుతుంది. అంటే ఐఫోన్ 16 సిరీస్‌లో ఇదే తక్కువ ధర ఫోన్ అన్నమాట. కానీ యాపిల్ ఏం ఆశిస్తుందంటే, కస్టమర్లు కాస్త ఎక్కువ ఫీచర్లు ఉన్న స్టాండర్డ్ ఐఫోన్ 16 కొంటారని లెక్కలు వేసుకుంటోంది.
షోరూమ్‌కి వెళ్లిన కస్టమర్లు, కాస్త ఎక్కువ డబ్బులు పెట్టి మంచి మోడల్ కొనేలా ఈ ట్రిక్ ప్లే చేస్తోంది యాపిల్. అంటే చీప్ ఆప్షన్ ఇస్తూనే తెలివిగా స్టాండర్డ్ వెర్షన్ కొనేలాగా చేస్తోంది. ఒకవేళ 16 సిరీస్‌లో ఈ చీప్ వెర్షన్ రాకపోతే స్టాండర్డ్ వెర్షన్ చీప్ వెర్షన్‌గా కనిపించవచ్చు. దాని సేల్స్ తగ్గవచ్చు.
* ఐఫోన్ 16e వర్సెస్ ఐఫోన్ 16
ధర తగ్గించాలని యాపిల్ కంపెనీ, ఐఫోన్ 16e లో కొత్త, పాత టెక్నాలజీలను కలిపేసింది. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాలు చూస్తే షాక్ అవుతారు. ఐఫోన్ 16e కేవలం నలుపు, తెలుపు రంగుల్లోనే దొరుకుతుంది. కలర్‌ఫుల్ ఫోన్లు కావాలంటే ఇది మీకోసం కాదు. రెండు ఫోన్లలోనూ A18 చిప్ ఉంటుంది.
కానీ 16eలో ఒక GPU కోర్ తక్కువ ఉంటుంది. అంటే పర్ఫార్మెన్స్ కొంచెం తేడా ఉండొచ్చు. 48MP మెయిన్ కెమెరా ఉంటుంది కానీ అల్ట్రావైడ్ లెన్స్ మాత్రం మాయమైంది. కొన్ని కెమెరా ఫీచర్లు, అంటే ఫొటోగ్రాఫిక్ స్టైల్స్ లాంటివి పాత ఐఫోన్ మోడల్స్ నుంచి దించేశారు.
డిస్‌ప్లేలో డైనమిక్ ఐలాండ్ బదులు పాతకాలపు నాచ్డ్ OLED స్క్రీన్ వాడారు. కొత్త ఫీచర్లను కోసేసింది. ఫ్రంట్ గ్లాస్‌కి యాపిల్ లేటెస్ట్ సెరామిక్ షీల్డ్ కోటింగ్ లేదు. గట్టిగా పట్టుకోకపోతే, జారి అది ముక్కలు అవ్వచ్చు. అలాగే మ్యాగ్‌సేఫ్ సపోర్ట్ లేదు. వైర్‌లెస్ ఛార్జింగ్ మాత్రం ఉంది.
మ్యాగ్‌సేఫ్ లేకపోవడం నిజంగా షాకింగ్. చాలామందికి ఇది మైనస్ పాయింట్. దీనివల్ల 16e చాలా మోడ్రన్ ఐఫోన్ యాక్సెసరీస్‌కి పనికిరాకుండా పోతుంది. ఐఫోన్ 16eలో యాక్షన్ బటన్ ఉంది కానీ కెమెరా కంట్రోల్ మాత్రం మిస్సింగ్. యాపిల్ తెలివిగా ప్రీమియం ఫీచర్లతో పాటు పాత ఫీచర్లను కలిపి ఖర్చు తగ్గించింది.
* ఐఫోన్ లైనప్ ఇప్పుడు మరింత క్లారిటీగా
ఎస్‌ఈ పేరును 16e గా మార్చడం వల్ల, ఐఫోన్ ఫ్యామిలీలోకి ఇది కూడా ఒక మెంబర్ గా కలిసిపోయినట్టు అనిపిస్తుంది. SE మోడల్ పక్కన పెట్టినట్టు ఉండేది కానీ, 16e ఇప్పుడు ఐఫోన్ జనరేషన్‌లో ఒక భాగంగా మారిపోయింది. దీనివల్ల యాపిల్ ఈ మోడల్‌ను రెండేళ్లకోసారైనా అప్‌డేట్ చేస్తారేమో చూడాలి.
* చిన్న సైజు ఫోన్లకు సెలవా?
కొంతమంది ఐఫోన్ ఎస్‌ఈని చిన్న ఫోన్‌గా చూసేవాళ్లు. కానీ యాపిల్ ఎప్పుడూ దాన్ని చిన్న ఫోన్‌గా అనుకోలేదు. అది పాత డిజైన్ కాబట్టి అలా చిన్నగా అనిపించింది. ఐఫోన్ 16e సైజు ఐఫోన్ 16 అంత ఉంటుంది. అంటే చిన్న ఫోన్ల ట్రెండ్‌కి యాపిల్ ఫుల్‌స్టాప్ పెట్టేసినట్టే.
మార్కెట్‌లో పెద్ద స్క్రీన్ ఫోన్ల హవా నడుస్తోంది కాబట్టి, యాపిల్ కూడా దారి మార్చుకుంది. ఐఫోన్ 16e చరిత్రలో నిలిచిపోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది: అదే యాపిల్ C1 మోడెమ్. ఆరేళ్ల కిందట ఇంటెల్ మోడెమ్ బిజినెస్‌ను కొనేసిన తర్వాత, యాపిల్ ఈ మోడెమ్‌ను సొంతంగా తయారు చేసింది.
ఇన్నాళ్లూ ఐఫోన్ మోడెమ్‌లను సప్లై చేస్తూ వచ్చిన క్వాల్‌కామ్ కంపెనీకి చెక్ పెట్టడానికి యాపిల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. C1 మోడెమ్ రావడం, సెల్యులార్ టెక్నాలజీలో యాపిల్ సొంతంగా ఎదగడానికి ఒక పెద్ద ముందడుగు. కానీ ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో చూడాలి. ఒకవేళ బాగా పనిచేస్తే, యాపిల్‌కి డివైజ్‌లపై మరింత కంట్రోల్ వస్తుంది.
ఒకవేళ తేడా కొడితే, యాపిల్ పరువు గంగలో కలిసిపోతుంది. అందుకే రిస్క్ తగ్గించుకోవడానికి, ఈ మోడెమ్‌ను ఫస్ట్ తక్కువ ధర ఉన్న ఐఫోన్ 16eలో పెట్టి టెస్ట్ చేస్తోంది. ఒకవేళ సక్సెస్ అయితే, హై-ఎండ్ మోడల్స్‌లోకి కూడా దించేస్తుంది.


Click it and Unblock the Notifications








