స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4, 12GB RAMతో iQOO Neo 10.. భారత్‌లో త్వరలో లాంచ్..!
iQOO Neo 10 India launch : ఐకూ (iQOO) తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'నియో 10' ను త్వరలో భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గీక్‌బెంచ్ (Geekbench) వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కీలక హార్డ్‌వేర్ వివరాలు బయటపడ్డాయి. దీని ప్రకారం, ఈ ఫోన్ త్వరలోనే భారత, ఇండోనేషియా మార్కెట్లలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు చైనాకే పరిమితమైంది ఈ మోడల్.
* స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ తో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్..
ఇప్పుడు BIS (భారతదేశం), SDPPI (ఇండోనేషియా), IMEI డేటాబేస్‌లలో కనిపించడం.. ప్రపంచవ్యాప్త విడుదలకు సంకేతంగా భావిస్తున్నారు. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ మోడల్ నంబర్ I2405. ఇది 'sun' అనే కోడ్‌నేమ్‌తో మదర్‌బోర్డును, శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌లో 3.21GHz ప్రైమ్ కోర్ ఉంది.

అలాగే 3.1GHz వేగంతో మూడు కోర్లు, 2.8GHz వేగంతో రెండు కోర్లు, 2.02GHz వేగంతో రెండు ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 825 GPU) ఉంది. ఈ వివరాలన్నీ స్పష్టంగా ఇది క్వాల్‌కామ్ (Qualcomm) కొత్త 'స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4' (Snapdragon 8s Gen 4) చిప్‌సెట్ అని సూచిస్తున్నాయి.
* పనితీరు, RAM వివరాలు
ఇది నియో 10Rలోని స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 కంటే మెరుగైనది, గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి పనులకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. గీక్‌బెంచ్ స్కోర్‌లను బట్టి చూస్తే, ఐకూ నియో 10 సింగిల్-కోర్ టెస్టులో 2,093 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 6,836 పాయింట్లు సాధించింది.
స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్ ఎంత శక్తివంతమైనదో ఈ స్కోర్లు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా, ఈ ఫోన్ 12GB RAMతో వస్తుందని లిస్టింగ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం అప్పర్ మిడ్-రేంజ్ ఫోన్‌లలో 12GB RAM సాధారణం అయిపోయింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఓఎస్‌తో రానుంది.
* Z10 టర్బో ప్రో రీబ్రాండింగ్..
నియో 10లోని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు, ఇటీవల చైనాలో విడుదలైన 'ఐకూ Z10 టర్బో ప్రో'తో సరిగ్గా సరిపోలుతున్నాయి. ఆ ఫోన్‌లోనూ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కాబట్టి, గ్లోబల్ మార్కెట్ల కోసం, ముఖ్యంగా భారతదేశం కోసం, ఐకూ Z10 టర్బో ప్రోనే 'నియో 10' గా పేరు మార్చి విడుదల చేయొచ్చు.
* భారత్‌లో ఎప్పుడు విడుదల కావచ్చు..
భారత్‌లో నియో 10 విడుదల తేదీని ఐకూ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, వరుసగా వస్తున్న లీకులు, లభిస్తున్న సర్టిఫికేషన్లు చూస్తుంటే.. విడుదల మరెంతో దూరంలో లేదనిపిస్తోంది. బహుశా ఈ నెలలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
ఇది మార్కెట్లో ఇప్పటికే ఉన్న పోకో F7 (Poco F7) వంటి ఇతర స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ఫోన్లకు పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








