మీ ఫోన్ అసలైనదా.. లేక నకిలీదా? ఈ ట్రిక్‌తో క్షణాల్లో తెలుసుకోండి..
Phone Genuine or a Duplicate: స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు చాలామంది బ్రాండ్ ఏంటి, ఫీచర్లు ఎలా ఉన్నాయి, డిజైన్ బాగుందా, ధర ఎంత అనే వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ అసలు విషయం మాత్రం మర్చిపోతారు. ఫోన్ నిజమైనదా లేక ఫేక్ ఫోనా అని అస్సలు చెక్ చేయరు. చూడటానికి నకిలీ ఫోన్లు అచ్చం ఒరిజినల్ ఫోన్లలాగే ఉంటాయి. కానీ క్వాలిటీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు సెక్యూరిటీ కూడా ఉండదు.
ఇలాంటి మోసాల నుంచి మిమ్మల్ని కాపాడటానికి, మీ ఫోన్ నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక సూపర్ యాప్ తీసుకొచ్చింది. దాని పేరే సంచార్ సాథీ (Sanchar Saathi). ఈ యాప్ ఉంటే చాలు.. మీ ఫోన్ ఒరిజినలో, డూప్లికేటో ఇట్టే తెలిసిపోతుంది.

అంతే కాదు.. మోసపూరిత కాల్స్, మెసేజ్ లను కూడా ఈ యాప్ కనిపెడుతుంది. ఒకవేళ మీ ఫోన్ నిజమైనదా కాదా అని మీకు డౌట్ ఉంటే.. వెంటనే ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చాలా ఈజీగా ఇప్పుడు చూద్దాం.
* సంచార్ సాథీ అంటే..
సంచార్ సాథీ యాప్ ను 2023లో సెంట్రల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం అధికారులు రిలీజ్ చేశారు. ఎందుకంటే మొబైల్ ఫోన్ యూజర్లు వాడే డివైజ్ నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి, అలాగే మోసాలను గుర్తించడానికి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ, ఐఫోన్లలోనూ కూడా పనిచేస్తుంది.
మీ ఫోన్ ఒరిజినలా కాదా అని తెలుసుకోవాలంటే IMEI నంబర్ ఉంటే చాలు. ఈ నంబర్ ద్వారా క్షణాల్లో చెప్పేయొచ్చు. అసలు IMEI అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (International Mobile Equipment Identity). ఇది ప్రతి మొబైల్ ఫోన్‌కు ఉండే ఒక స్పెషల్ 15 అంకెల నంబర్.
ఒకవేళ మీ ఫోన్‌కు ఇన్‌వ్యాలీడ్ IMEI ఉంటే.. అది కచ్చితంగా ఫేక్ ఫోన్ లేదా అక్రమంగా తయారు చేసిన ఫోన్ అని చెప్పొచ్చు. ఇది కొనుగోలు చేస్తే భారీగా నష్టపోవడం తప్పదు. మళ్లీ కొత్త ఫోన్ కొనాల్సి రావచ్చు. అది జరగకుండా ఉండాలంటే ముందుగా కింది స్టెప్స్ ఫాలో కండి.
* ఫోన్ ఒరిజినల్ అని ఎలా చెక్ చేసుకోవాలి?
స్టెప్ 1: మీ ఫోన్ నిజమైనదా కాదా అని చెక్ చేసుకోవడం చాలా సింపుల్. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ముందుగా మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేసి, సంచార్ సాథీ యాప్ అని టైప్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 2: యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరుతో రిజిస్టర్ చేసుకోండి. యాప్ ఓపెన్ అయ్యాక వెరిఫికేషన్ సెక్షన్ లో "Know Genuineness of Your Mobile Handset" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. లేదా మీరు డైరెక్టుగా ఈ https://ceir.sancharsaathi.gov.in/Device/SancharSaathiKym.jsp లింక్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.
స్టెప్ 3: మీ ఫోన్ IMEI నంబర్‌ను అక్కడ ఇచ్చిన బాక్స్‌లో టైప్ చేయండి. ఇది 15 డిజిట్స్ ఉంటుంది. IMEI నంబర్ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ నొక్కండి. అంతే, మీ ఫోన్ IMEI డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తాయి. అవి చాలా పరిశీలనగా చూసుకోవాలి.
* రిజల్ట్స్ ఎలా ఉంటే ఏమని అర్థం..
"Valid" అని వస్తే మీ ఫోన్ ఒరిజినల్ అని అర్థం. IMEI నంబర్‌తో పాటు, మీ ఫోన్ బ్రాండ్ పేరు, మోడల్, ఎవరు తయారుచేశారు, డివైజ్ టైప్ వంటి వివరాలన్నీ చూపిస్తుంది. "Invalid" అని వస్తే, ఫోన్ నకిలీ అని తేలిపోయినట్టే. ఇది ఫేక్ ఫోన్ లేదా అక్రమంగా తయారు చేసిన ఫోన్ అయ్యి ఉంటుంది.
* మీ IMEI నంబర్‌ను ఎలా కనుక్కోవాలి
IMEI నంబర్ తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ కింద ఇచ్చిన పద్ధతుల్లో మీరు మీ IMEI నంబర్‌ను కనుక్కోవచ్చు. మొదటి పద్ధతి ఫోన్ బాక్స్ చెక్ చేయడం. మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడు బాక్స్ ఉంటుంది కదా.. దాని మీద IMEI నంబర్ ప్రింట్ చేసి ఉంటుంది.
లేదంటే మీ ఫోన్ డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *# 06# అని టైప్ చేయాలి. వెంటనే మీ IMEI నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ పద్ధతి ఫాలో కాలేకపోతే, మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, "About Phone" సెక్షన్ లోకి వెళ్లండి. అక్కడ IMEI నంబర్ ఉంటుంది.
* ఇది ఎందుకు ఇంత ముఖ్యం..
నకిలీ ఫోన్ వాడటం చాలా ప్రమాదకరం. అవి సరిగ్గా పనిచేయకపోవచ్చు. అంతే కాదు.. వాటిని చట్టవిరుద్ధమైన పనులకు కూడా వాడుకోవచ్చు. సంచార్ సాథీ యాప్ మీ ఫోన్ చట్టబద్ధమైనదా కాదా అని తెలుసుకోవడానికి, సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.
IMEI చెక్ చేసుకోవడం వల్ల మీరు మోసాల నుంచి, దొంగతనం నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అందుకే ఫోన్ కొనేముందు అది ఒరిజినలా కాదా అని తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ ఉపయోగకరమైన వార్తను మీ బంధుమిత్రులతో కూడా తప్పనిసరిగా షేర్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








