అంబానీ అసలు స్వరూపం : జియోఫోన్ షరతులు చూస్తే వద్దు మొర్రో అనాల్సిందే !
బయటపడిన జియో అసలు గుట్టు, జియో 4జీ ఫోన్ కొంటే వినియోగదారులకు భారీ నష్టం తప్పదు
జియో ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు జియో తమ నిబంధనలతో భారీగానే షాకిచ్చింది. రిలయన్స్ జియో కంపెనీ కొత్తగా 4 జీ ఫోన్ కు సంబంధించి నిబంధనలు, షరతులను సంస్థ ప్రకటించింది. కస్టమర్లపై ఆశలపై నీళ్లు చల్లుతూ కొన్ని షాకింగ్ నిబంధనలు, మాండేటరీ రీచార్జ్‌ల బాదుడుకు శ్రీకారం చుట్టింది. కనీస రీఛార్జిలు, ఫోన్ రిటర్న్ విధానాన్ని కంపెనీ వెబ్‌సైట్ లో పేర్కొంది. అవేంటో తెలుసుకుంటే దిమ్మతిరగాల్సిందే మరి.

రూ.1500 సొమ్ము తిరిగి పొందాలంటే..
కంపెనీ వెబ్ సైట్లో పొందుపరిచిన షరతులు ప్రకారం జియో 4జీ ఫీచర్ ఫోన్ కొనుగోలు సందర్భంగా కస్టమర్ డిపాజిట్ చేసిన రూ.1500 సొమ్ము తిరిగి పొందాలంటే 3 సంవత్సరాల్లో కనీసం రూ.4500 విలువైన రీచార్జ్ చేసుకోవాలి.

తప‍్పనిసరిగా రీచార్జ్
ఇది తప‍్పనిసరిగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే. వినియోగదారుడికి భారీ నష్టం తప్పదు. అదెలాగంటే మూడు నెలల పాటు యూజరు ఎలాంటి రీచార్జ్‌లు చేసుకోకుండా వుంటే వారికి రావాల్సిన రిఫండ్ మనీ రూ.1500 వెనక్కి రాదు.

సంవత్సరానికి ఖచ్చితంగా రూ.1500
అలాగే మూడేళ్ల పాటు సంవత్సరానికి ఖచ్చితంగా రూ.1500 (మొత్తం రూ.4500) విలువైన రీచార్జ్ కచ్చితంగా చేసుకోవాలి. అప్పుడు కూడా షరతులతో కూడిన అమౌంట్ మీకు వస్తుంది.

12 నెలల లోపు దాన్ని రిటర్న్ చేస్తే రూ.1500 , ప్లస్ జీఎస్‌టీ
ఒకవేళ మధ్యలోనే జియో ఫోన్ వెనక్కి ఇచ్చేయాలని ప్రయత్నిస్తే యూజర్లకు మరో బాదుడు తప్పదు.దీనికి కూడా అదనంగా పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఫోన్ కొన్నప్పటి నుంచి 12 నెలల లోపు దాన్ని రిటర్న్ చేస్తే రూ.1500 , ప్లస్ జీఎస్‌టీ పెనాల్టీగా చెల్లించాలి.

రూ.1000 రూపాయలు ఫైన్
ఒకవేళ మొదటి సంవత్సరం వాడుకుని రెండో సంవత్సరం దాన్ని రిటర్న్ చెయ్యాలనుకుంటే రూ.1000 రూపాయలు ఫైన్‌గా కట్టాలి. దీనికి కూడా జీఎస్టీ అదనం.

36 నెలలు పూర్తయ్యే లోపు రిటర్న్ చెయ్యాలంటే రూ. 500 ఫైన్
ఇక మూడవ సంవత్సరం 36 నెలలు పూర్తయ్యే లోపు రిటర్న్ చెయ్యాలంటే రూ. 500 ఫైన్ కట్టాలి. దీనికి కూడా జీఎస్టీ అదనం.

జియో అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు
ఈ నిబంధనలకు లోబడి వినియోగదారుడు చెల్లించిన రూ.1500 తిరిగి వస్తాయి. ఈ వివరాలన్నీ జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

జియో తాజా నిబంధనలపై
కాగా జియో తాజా నిబంధనలపై కస్టమర్లు భగ్గుమంటున్నారు. జియో ఉచిత ఆఫర్ల అసలు గుట్టు బట్టబయలైందని మండిపడుతున్నారు. ఉచిత ఫోన్ తీసుకునేముందు నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications