సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారా.. ఈ వివరాలు తెలుసుకోకుండా కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవు..!
అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో భారత్ ఒకటి. అయితే సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్లకు కూడా భారీ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం లేదా ఫ్లాగ్‌షిఫ్ ఫోన్‌లను డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు Second Hand Phones) కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు కూడా ఈ తరహా ఫోన్‌లను విక్రయిస్తున్నాయి. డ్యామేజీ లేదా ఇతర సమస్యలు ఉన్న ఫోన్‌లను రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
దొంగిలించిన ఫోన్‌లు కూడా :
ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ ఫోన్‌లను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. దీంతో కొంత మంది దొంగలించిన మొబైల్స్‌ను విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయాలకు పాల్పడుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే.. ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

సాధారణంగా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో refurbished లేదా resold ఫోన్‌లు లభిస్తుంటాయి. వీటిని కొనుగోలు చేసే సమయంలో IMEI నంబర్ ఆధారంగా ఈ ఫోన్‌ల పరిస్థితిని తెలుసుకోవచ్చు. మీరు కొనుగోలు చేయాలని భావిస్తున్న ఫోన్ దొంగిలించబడినదా లేదా నిజంగానే సెకండ్ హ్యాండ్ మోడల్‌నా అనేది తెలుసుకోవచ్చు. సింపుల్‌గా చిన్న SMS పంపి ఈ వివరాలు తెలుసుకోవచ్చు.
IMEI నంబర్ ద్వారా :
ఇందుకోసం ముందుగా మీరు కొనుగోలు చేయాలని భావిస్తున్న సెకండ్ హ్యాండ్ ఫోన్ IMEI నంబర్ తెలుసుకోవాలి. సాధారణంగా ఫోన్ రిటైల్ బాక్స్ మీద ఈ వివరాలు ఉంటాయి. ఫోన్ బాక్స్ అందుబాటులో లేకుంటే ఫోన్ డయల్‌ప్యాడ్ లో *#06# నంబర్‌ను డయల్ చేసి, IMEI నంబర్‌ను పొందవచ్చు.
ఈ విధంగా మెసేజ్ చేయండి :
అనంతరం మీకు ఫోన్‌కు సంబంధించిన 15 అంకెల IMEI నంబర్ వస్తుంది. ఈ వివరాలను 14422 నంబర్‌కు SMS చేయాల్సి ఉంటుంది. KYM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి IMEI నంబర్ నమోదు చేయాలి. అనంతరం 14422 నంబర్‌కు SMS పంపాలి. ఉదాహరణకు KYM 123561235667890 ఫార్మాట్‌లో పంపాలి.
అక్కడ నుంచి మీకు రిప్లై వస్తుంది :
ఈ SMS పంపిన అనంతరం మీకు అక్కడ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఒకవేళ మెసేజ్‌లో ఫోన్ బ్లాక్ లిస్ట్ లో ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫోన్ కొనుగోలు చేయవద్దు. దొంగిలించబడినా లేదా పొగొట్టుకున్న అనంతరం అనేక మంది వీటిని బ్లాక్ చేస్తుంటారు.
సంచార్‌సాథీ ద్వారా :
సంచార్ సాథీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లను బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంది. లేదా కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లోనూ పోలీసులు ఆయా ఫోన్‌లను బ్లాక్ చేస్తుంటారు. ఇలాంటి ఫోన్‌లు ఎక్కువగా బ్లాక్‌లిస్ట్‌లో ఉంటాయి.
ఈ వివరాలు తెలుసుకోకుండా దొంగిలించబడిన ఫోన్‌లను కొనుగోలు చేస్తే.. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేదా ఫోన్ పనిచేయకపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు కొనుగోలు చేసే సమయంలో పైన తెలిపిన జాగ్రత్తలు పాటించాలి.


Click it and Unblock the Notifications








