శామ్‌సంగ్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలా.. 80 శాతానికి ఛార్జింగ్ లిమిట్ ఇలా సెట్ చేసుకోండి..
Battery Life: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఫోన్ బ్యాటరీని 100% వరకు ఛార్జ్ చేయడం. ఇలా చేయడం వల్ల మీ బ్యాటరీ తొందరగా పాడైపోయే ప్రమాదం ఉంది. నిపుణులు ఏం చెబుతున్నారంటే, బ్యాటరీని 80% వరకు మాత్రమే ఛార్జ్ చేస్తే, అది ఎక్కువ కాలం పనిచేస్తుందట. కానీ, రోజూ 80% వరకు మాత్రమే ఛార్జ్ చేస్తూ ఉండటం చాలా చిరాకుగా ఉంటుంది కదా? ఈ సమస్యకు శాంసంగ్ ఒక సూపర్ ఫీచర్ తీసుకొచ్చింది. అదే "బ్యాటరీ ప్రొటెక్షన్".
వన్ యూఐ (One UI)లో ఉండే ఈ ఫీచర్ ద్వారా ఫోన్ ఎంత శాతం ఛార్జ్ అవ్వాలో లిమిట్ సెట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం పదండి. శామ్‌సంగ్ బ్యాటరీ ప్రొటెక్షన్ ఫీచర్ ఫోన్ బ్యాటరీని కంట్రోల్‌లో ఉంచుతుంది. దీన్ని సెటప్ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా మీ ఫోన్‌లో "సెట్టింగ్స్" యాప్‌ను ఓపెన్ చేయండి.

సెట్టింగ్స్‌లో కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే "బ్యాటరీ" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. బ్యాటరీ సెట్టింగ్స్‌లో "బ్యాటరీ ప్రొటెక్షన్" అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. "బ్యాటరీ ప్రొటెక్షన్" ఆప్షన్ పైన ఒక టాగల్ బటన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేయండి.
టాగల్ కింద మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో "మాక్సిమమ్" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. కింద ఒక స్లైడర్ వస్తుంది. దాన్ని కదిలించి మీకు కావలసిన ఛార్జింగ్ లిమిట్‌ను 80% నుంచి 95% మధ్యలో సెట్ చేసుకోవాలి. 80% బెస్ట్ కాబట్టి అదే లిమిట్ సెట్ చేసుకోవడం మంచిది.
* ఛార్జింగ్ లిమిట్ సెట్ చేస్తే ఏం జరుగుతుంది..
మీరు ఛార్జింగ్ లిమిట్ సెట్ చేసిన తర్వాత, మీ ఫోన్ బ్యాటరీ మీరు పెట్టిన శాతానికి రాగానే ఛార్జింగ్ ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 80% లిమిట్ పెడితే, బ్యాటరీ 80% రాగానే ఛార్జింగ్ ఆగిపోతుంది. లాక్ స్క్రీన్‌పై "బ్యాటరీని ప్రొటెక్ట్ చేయడానికి ఛార్జింగ్ ఆగిపోయింది" అని ఒక మెసేజ్ వస్తుంది.
అంతేకాదు, బ్యాటరీ స్టేటస్ బార్‌లో ఒక షీల్డ్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ బ్యాటరీ లెవెల్ సెట్ చేసిన లిమిట్ కంటే తగ్గితే, ఫోన్ మళ్లీ ఛార్జింగ్ చేయడం మొదలుపెడుతుంది. అంటే, మీ బ్యాటరీ అనవసరంగా ఛార్జ్ అవ్వకుండా, సేఫ్ లిమిట్స్‌లో ఉండేలా ఈ ఫీచర్ చూసుకుంటుంది.
* ఛార్జింగ్ లిమిట్ వల్ల ఉపయోగం..
ప్రతి ఫోన్ బ్యాటరీకి ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి. అంటే, మీరు ఫోన్‌ను 0% నుండి 100% వరకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే, అది ఒక ఛార్జ్ సైకిల్ కింద లెక్క. ఈ ఛార్జ్ సైకిల్స్ పెరిగే కొద్దీ, బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోతుంది. తరచూ 100% వరకు ఛార్జ్ చేయడం లేదా బ్యాటరీని పూర్తిగా 0% వరకు వాడటం వల్ల బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
దీనివల్ల బ్యాటరీ తన అసలు సామర్థ్యాన్ని త్వరగా కోల్పోతుంది. అందుకే, ఛార్జింగ్‌ను 80-85%కి లిమిట్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ లేదా వైర్‌లెస్ ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ వేడెక్కకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది, దాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది.
వన్ యూఐ 7తో, శాంసంగ్ మీ బ్యాటరీని కాపాడుకోవడం చాలా సులువు చేసింది. ఈ ఫీచర్ సౌకర్యం, బ్యాటరీ ఆరోగ్యం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఫోన్ ఎక్కువ కాలం పనిచేయడానికి ఇది సూపర్ హెల్ప్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సెట్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








