దివాళీ సేల్: శామ్‌సంగ్ S26 కొనాలా? వన్ ప్లస్ 16 కోసం ఆగాలా? అసలు నిజం ఇదే!
ఈ రోజు (అక్టోబర్ 28) దేశవ్యాప్తంగా దివాళీ సేల్స్ ప్రారంభమయ్యాయి. మీరు ఇప్పుడే ఒక కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటే, శామ్‌సంగ్ గెలాక్సీ S26 సెక్యూర్ ఎంపికగా నిలుస్తుంది. ఎందుకంటే వన్ ప్లస్ 16 ఇంకా భారతదేశంలో ఓపెన్ సేల్‌కు రాలేదు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ S26 12GB/512GB వేరియంట్ ధర ₹1,07,999గా ఉంది. అక్టోబర్ 31 శనివారం నాటికి డెలివరీ ఇస్తామని చూపిస్తోంది. కాగా, 12GB/256GB ఆప్షన్ ప్రస్తుతం 'అవుట్ ఆఫ్ స్టాక్'గా ఉంది.
వన్ ప్లస్ 16 ఈ నెల ప్రారంభంలో చైనాలో లాంచ్ అయింది. అయితే భారతదేశంలో ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. చైనాలో 12GB/256GB మోడల్ ప్రారంభ ధర 5,999 యువాన్లు (మన దేశ మారకంలో దాదాపు ₹86,000)గా ఉంది. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 9,000mAh భారీ బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 185Hz గేమింగ్ డిస్‌ప్లే వంటి పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ ఆకట్టుకుంటున్నప్పటికీ.. స్థానిక వారంటీ, నెట్‌వర్క్ సపోర్ట్, డెలివరీ విషయాల్లో ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.

వన్ ప్లస్ 16 వర్సెస్ శామ్‌సంగ్ గెలాక్సీ S26: కెమెరాల పోలిక
డేలైట్‌లో రెండూ అద్భుతమైన క్లియర్ ఫొటోలను అందిస్తాయి. కానీ చీకటి పడ్డాక, వీడియో రికార్డింగ్‌లో మాత్రం వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. శామ్‌సంగ్ అడ్వాన్స్‌డ్ నైటోగ్రఫీ, AI ఫ్రంట్ కెమెరా ISPపై ఎక్కువగా ఆధారపడుతుంది. నడుస్తూ లేదా కదులుతూ వీడియోలు తీసేటప్పుడు 'సూపర్ స్టెడీ విత్ హారిజాంటల్ లాక్' ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వన్ ప్లస్ 200MP సెన్సార్, 3x పెరిస్కోప్ లెన్స్‌తో పోటీకి దిగింది. అయితే, ఎలాంటి షేక్స్ లేకుండా పక్కాగా స్టెబిలైజేషన్ కావలసిన కంటెంట్ క్రియేటర్లకు గెలాక్సీ S26 బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
వన్ ప్లస్ 16 వర్సెస్ శామ్‌సంగ్ గెలాక్సీ S26: డిస్‌ప్లే, యూజర్ అనుభవం
వన్ ప్లస్ 16 ఫోన్ 6.78 ఇంచుల LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది సిస్టమ్‌లో 165Hz, గేమింగ్‌లో 185Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే 3,840Hz PWM డిమ్మింగ్ ఉండటం వల్ల రాత్రివేళల్లో ఎక్కువసేపు చదివినా కళ్లపై ఒత్తిడి పడదు. మరోవైపు గెలాక్సీ S26 బ్రైట్ 120Hz డైనమిక్ AMOLED స్క్రీన్, శామ్‌సంగ్ సిగ్నేచర్ కలర్ ట్యూనింగ్‌తో ఆకట్టుకుంటుంది. HDR స్ట్రీమింగ్, ఎండలో విజిబిలిటీ చాలా బాగుంటాయి. అయితే పేపర్ మీద ఉన్న ఫీచర్ల పరంగా డిస్‌ప్లే కంఫర్ట్ విషయంలో వన్ ప్లస్ కాస్త ముందుంది.
వన్ ప్లస్ 16 వర్సెస్ శామ్‌సంగ్ గెలాక్సీ S26: పెర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఛార్జింగ్
కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లు మినహా మిగిలిన చోట్ల గెలాక్సీ S26 సిరీస్ శామ్‌సంగ్ స్వంత Exynos 2600 చిప్‌సెట్‌తో వస్తుంది. దీనికి ఏడేళ్ల పాటు సపోర్ట్ లభిస్తుంది. వేడిని త్వరగా తగ్గించడానికి శామ్‌సంగ్ దీని వేపర్ ఛాంబర్‌ను 29 శాతం మెరుగుపరిచింది. ఇక వన్ ప్లస్ 16లో 2nm స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ గేమింగ్ చిప్స్, పెద్ద వేపర్ ఛాంబర్ ఉన్నాయి. బ్యాటరీ విషయంలో వన్ ప్లస్ భారీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇందులో 9,000mAh బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంటే.. గెలాక్సీ S26 కేవలం 25W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో సరిపెట్టుకుంది.
వన్ ప్లస్ 16 వర్సెస్ శామ్‌సంగ్ గెలాక్సీ S26: సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్, అప్‌డేట్లు, ఏది బెటర్?
శామ్‌సంగ్ ఈ ఫోన్‌కు ఏడేళ్ల పాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇది ఫోన్ రీసేల్ వాల్యూకు బాగా ప్లస్ అవుతుంది. ఇండియన్ మోడల్ జియో 700MHz, 3.5GHz బ్యాండ్‌లకు, ఎయిర్‌టెల్ 3.5GHz బ్యాండ్‌కు సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు VoWiFi, VoNR సపోర్ట్ ఉంది (ప్రస్తుతానికి VoNR ప్రధానంగా జియోలోనే అందుబాటులో ఉంది). వన్ ప్లస్ 16 చైనాలో ColorOS 17తో పనిచేస్తోంది, మన దేశంలో దీని సాఫ్ట్‌వేర్ పాలసీపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కాబట్టి.. మంచి కెమెరా, ఆఫీస్ అవసరాలు, ట్రావెలింగ్ కోసం ఇప్పుడే ఫోన్ కొనాలనుకునేవారు గెలాక్సీ S26ను ఎంచుకోవడం ఉత్తమం. అదే గేమింగ్, భారీ బ్యాటరీ లైఫ్ కావాలనుకునేవారు వన్ ప్లస్ 16 ఇండియా లాంచ్ వరకు వేచి చూడవచ్చు.


Click it and Unblock the Notifications
